తాలిబాన్ల పాలన నుండి ఎలాగైనా విముక్తులు కావాలని ఆఫ్ఘనిస్తాన్ దేశ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకోసం ఎలాగైనా దేశాన్ని విడిచిపెట్టాలని భావిస్తూ వస్తున్నారు. చార్టర్డ్ విమానాల్లో సైతం వెళ్లిపోవాలని ప్రజలు భావిస్తూ ఉన్నారు. అయితే వాటిని తాలిబాన్లు కదలనివ్వకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ లోని పెద్ద నగరాల్లో ఒకటైన మజర్–ఏ–షరీఫ్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన దాదాపు నాలుగు చార్టర్డ్ విమానాలను తాలిబాన్లు కొన్ని రోజులుగా నిలిపివేశారు. ఆయా విమానాల్లో ప్రయాణించేందుకు సన్నద్ధమైన వందలాది మంది ప్రయాణికులు ప్రస్తుతం తాలిబన్ల వద్దే బందీలుగా ఉన్నట్లు అమెరికా రిపబ్లికన్ పార్టీ నాయకుడు, విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైఖేల్ మెక్‌కౌల్ చెప్పారు. ఈ ఘటనపై ఆఫ్ఘన్ అధికారి మాట్లాడుతూ నాలుగు విమానాల్లో ఉన్న ప్రయాణికులంతా ఆఫ్ఘన్ పౌరులేనని, వారిలో చాలా మందికి పాస్‌పోర్టులు, వీసాలు, ఇతర ధ్రువపత్రాలు లేవని తెలిపారు. అందుకే దేశం విడిచి వెళ్లలేకపోతున్నారని వెల్లడించారు.
ప్రయాణికుల్లో తమ దేశ పౌరులు కూడా ఉన్నారని రిపబ్లికన్ నాయకుడు మైఖేల్ మెక్‌కౌల్ స్పష్టం చేశారు. దాదాపు 1000 మంది కొన్ని రోజులు విమానాశ్రయంలోనే గడిపిన అనంతరం మరో మార్గం లేక వారంతా వెనక్కి వెళ్లిపోవాలని భావించినా తాలిబాన్లు అనుమతులు ఇవ్వలేదట. శరణార్థుల విమానాలకు ఇంకా అనుమతి రాలేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. కాబూల్‌లో చిక్కుకుపోయిన అమెరికా సహా ఇతర దేశాల పౌరులు, బలగాలు, ఆఫ్ఘన్ శరణార్థులను తరలించేందుకు చర్యలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా విమాన రాకపోకలపై అంతరాయం ఏర్పడుతూ ఉంది.