ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోకి తాలిబన్లు చొచ్చుకొచ్చేశారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు. నగరం నలుమూలల నుంచి తాలిబన్ ఉగ్రవాదులు చొరబడిపోతున్నారని.. నగరంలోని చాలా ప్రాంతాల్లో తుపాకుల మోత మోగుతోందని ఆఫ్ఘన్ అధ్యక్ష భవనం తన అధికారిక ట్విట్టర్ ఖాతా లో ట్వీట్ చేసింది. అంతర్జాతీయ మిత్రులతో కలిసి తాలిబన్లను ఆఫ్ఘన్ సైన్యం నిరోధిస్తోందని, ప్రస్తుతం కాబూల్ సైన్యం నియంత్రణలోనే ఉందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ కాబూల్‌లోకి బలవంతంగా వెళ్లాలని అనుకోవడం లేదని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాలు ఇస్లామిక్ ఎమిరేట్ నియంత్రణలోకి వచ్చాయని, రాజధాని కాబూల్ పెద్ద జనసాంద్రత కలిగిన నగరం కనుక, ఇస్లామిక్ ఎమిరేట్‌లోని ముజాహిదీన్‌లు బలవంతంగా, యుద్ధం ద్వారా నగరంలో ప్రవేశించడానికి ఉద్దేశించమని అన్నారు. శాంతియుతంగా కాబూల్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉన్నామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయని.. ఎవరి జీవితాలు, ఆస్తి, గౌరవానికి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఇస్లామిక్ ఎమిరేట్ తన బలగాలన్నింటినీ కాబూల్ ద్వారాల వద్ద ఉంచిందని తెలిపారు. ఇస్లామిక్ ఎమిరేట్ ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోదని మేము పునరుద్ఘాటిస్తున్నామన్నారు. కాబూల్ పరిపాలనలో సైనిక, పౌర రంగాలలో పనిచేసిన వారందరూ క్షమించబడ్డారని.. వారంతా సురక్షితంగా ఉంటారని తెలిపారు. అందరూ తమ సొంత దేశంలో, సొంత ఇంట్లో ఉండొచ్చని దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నించకూడదని అన్నారు. అన్ని వర్గాల ఆఫ్ఘన్‌లు, భవిష్యత్తులో ఇస్లామిక్ వ్యవస్థలో బాధ్యతాయుతమైన ప్రభుత్వంతో తమను తాము చూసుకోవాలని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నామని అన్నారు.
మరోవైపు అమెరికా తన రాయబారులను అక్కడి నుంచి హెలికాప్టర్ లో తరలించింది. వజీర్ అక్బర్ ఖాన్ జిల్లాలోని ఎంబసీ అధికారులను విమానాశ్రయానికి తీసుకెళ్లామని అమెరికా అధికారులు తెలిపారు. యూరోపియన్ యూనియన్ సిబ్బందిని కాబూల్ లోని అత్యంత సురక్షితమైన రహస్య ప్రాంతానికి తరలించామని నాటో అధికారి చెప్పారు. వీలైనంత త్వరగా అమెరికన్లను కాపాడి తీసుకొచ్చేందుకు 5 వేల మంది బలగాలను ఆఫ్ఘనిస్థాన్ కు పంపాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలిచ్చారు. 82వ ఎయిర్ బార్న్ కు చెందిన వెయ్యి మంది బలగాలను అదనంగా పంపిస్తున్నట్టు ఆ దేశ రక్షణ శాఖ అధికారి చెప్పారు.