ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ముఖ్యంగా తాలిబాన్లు అధికారం లోకి రావడంతో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. ఇలాంటి తరుణంలో తాలిబాన్లు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘన్‌లో విదేశీ కరెన్సీని ఉపయోగించడంపై తాలిబాన్లు నిషేధం విధించారు. ఆఫ్ఘన్ బ్యాంకుల్లో నగదు కొరత తీవ్రంగా ఉంది. మరోవైపు ఆ దేశంలో తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావడం లేదు. ఆ దేశంలో అనేక లావాదేవీలు అమెరికన్ డాలర్లలో జరుగుతాయి. దక్షిణ సరిహద్దుల్లోని వాణిజ్య మార్గానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో పాకిస్తానీ రూపాయలను ఉపయోగిస్తున్నారు. ఇలా ఎన్నో ఉండగా.. ఇప్పుడు విదేశీ కరెన్సీపై తాలిబాన్లు నిషేధాన్ని విధించారు. తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఇకపై దేశీయ వ్యాపార, తదితర కార్యకలాపాల కోసం విదేశీ కరెన్సీని ఉపయోగిస్తే, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆర్థిక పరిస్థితి, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆఫ్ఘన్లంతా ఆఫ్ఘని కరెన్సీని మాత్రమే ప్రతి లావాదేవీలోనూ ఉపయోగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలంతా విదేశీ కరెన్సీ లావాదేవీలను మానుకోవాలని తెలిపారు. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం ఉంది. తాలిబాన్లు ఆఫ్ఘన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ దేశ కరెన్సీ ఆఫ్ఘని విలువ మరింత క్షీణించింది. రాబోయే రోజుల్లో ఆర్థికంగా మరిన్ని చిక్కులు తప్పవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.