ఇదే ఆఖరి అవకాశం అంటూ.. పాక్ కు ఇంకాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తాలిబాన్

0
710

ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక రక్షణ మంత్రి ఆదివారం నాడు పొరుగున ఉన్న పాకిస్థాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాక్ నిర్వహిస్తున్న వైమానిక దాడులను తాలిబాన్ ప్రభుత్వం అసలు సహించదని అన్నారు. తమ భూభాగంపై ఎయిర్ స్ట్రయిక్స్ చేసిన పాకిస్థాన్ పై ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం మండిపడింది. తమ దేశంపై దండయాత్ర చేయాలని చూస్తే సహించబోమని తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా మొహమ్మద్ ఒమర్ కుమారుడు, ఆప్ఘనిస్థాన్ తాత్కాలిక రక్షణ మంత్రి ముల్లా మొహమ్మద్ యాకూబ్ హెచ్చరించారు. యావత్ ప్రపంచంతో పాటు పొరుగుదేశం నుంచి కూడా తాము సమస్యలను ఎదుర్కొంటున్నామని పాక్ ను విమర్శించారు. దేశ ప్రాధాన్యతల కోసం ఈ దాడులను ఇప్పుడు క్షమించామని… మరోసారి పాక్ తోకజాడిస్తే క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ నెల 16న ఖోస్త్, కునార్ ప్రావిన్సుల్లో పాకిస్థాన్ ఎయిర్ స్ట్రయిక్స్ చేసింది. ఈ దాడిలో 36 మంది ఆప్ఘనిస్థాన్ పౌరులు చనిపోయారు. వీరిలో 20 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ఎయిర్ స్ట్రయిక్స్ తామే జరిపినట్టు పాకిస్థాన్ ఇంతవరకు ప్రకటించలేదు. ఆప్ఘన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై స్పందించాలంటూ అడిగిన ప్రశ్నకు పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సమాధానమిస్తూ రెండూ సోదర దేశాలని చెప్పారు.

“పాక్ మరియు ఆఫ్ఘనిస్థాన్ సోదర దేశాలు. రెండు దేశాల ప్రభుత్వాలు, ప్రజలు తీవ్రవాదాన్ని తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తారు. చాలా కాలంగా తీవ్రవాదం కారణంగా బాధపడుతున్నారు. మన రెండు దేశాలు సంబంధిత సంస్థాగత ద్వారా అర్ధవంతమైన రీతిలో నిమగ్నమవ్వడం చాలా ముఖ్యం. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో, ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవడంలో సహకరించాలి” అని పాక్ ప్రతినిధి చెప్పారు. ఆగస్ట్‌లో తాలిబాన్ ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో అనేక ప్రతిష్టంభనలు నెలకొన్నాయి. పాక్ సైన్యం ఇటీవలి నెలల్లో ఆఫ్ఘన్ సరిహద్దు వెంబడి కార్యకలాపాలను వేగవంతం చేసింది.