Special Stories

చైనా + పాక్ + తాలిబన్
దక్షిణాసియాకు పొంచివున్న ప్రమాదం..!!

మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుతో ఆఫ్ఘనిస్తాన్ ఇక పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వచ్చేసింది. తాలిబన్ సర్కార్‎కు అంతర్జాతీయంగా ఎలాంటి మద్దతు లభిస్తుందో తెలియదు గానీ.. ఆల్‎ఖైదా, హక్కానీ నెట్‎వర్క్, ఐసిస్ ఖొరాసన్ వంటి ప్రపంచంలోనే కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థలు.. తాలిబన్లను పొగడటం, అందరం ఒక్కటేనన్న సందేశాలివ్వడం ఆందోళనకు గురిచేస్తోంది. పైకి తాలిబ‌న్లు అంతర్జాతీయ సమాజానికి సానుకూలంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. లోనమాత్రం ఉగ్రవైఖరిలో ఏమాత్రం మార్పు లేదు. మొదట్లో మహిళల హక్కులను కాపాడాతమని ప్రగల్భాలు పలికిన తాలిబన్లు.. బహిరంగ దాడులకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‎లో ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు వణికిపోతున్నారు. గత్యంతరం లేక తాలిబన్లకు లొంగిపోయి బతుకీడుస్తున్నారు.

ఇదిలావుంటే, షరియా తప్ప ప్రజాస్వామ్యాన్ని మర్చిపోవాలంటూ తెగేసి చెప్పిన తాలిబన్లకు ఏకంగా 8 వేల ఉగ్రవాద గ్రూపులు అండగా నిలవడం ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంశం. వారి వ‌ద్ద ఇంకా ల‌క్ష‌లాది ఆయుధాలు ఉన్నాయి. ఇలాంటి ప‌రిస్థితులు పొరుగున ఉన్న భారత్ సహా దక్షిణాసియా దేశాల‌కు పెను ప్ర‌మాదంగా మారే అవ‌కాశం ఉంది. పైగా కశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మ‌హ్మ‌ద్ వంటి సంస్థ‌లు కూడా తాలిబన్లకు వత్తాసు పలుకుతున్నాయి. మ‌సూద్ అజ‌ర్ కశ్మీర్‎పై త‌మ‌కు అనుకూలంగా తాలిబ‌న్ల‌ను ఒప్పించిన‌ట్లు వార్త‌లొచ్చాయి. ఆఫ్ఘన్ కేంద్రంగా ప‌నిచేస్తున్న ల‌ష్క‌ర్-ఏ-తోయిబా కూడా వారి పక్షానే వుంది. అమెరికా ఆఫ్ఘన్ నుండి వైదొల‌గ‌గానే ఈ సంస్థ‌ల‌న్నీ తాలిబ‌న్ల‌ను కశ్మీర్ విష‌యంలో త‌మ‌కు అనుకూలంగా ప్ర‌క‌ట‌న‌లిప్పించేందుకు పోటీప‌డ్డాయి. ఊహించినట్టుగా ఇటీవల కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకుంటామని తాలిబన్లు ప్రకటించారు. బీబీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్‌ సహా ప్రపంచంలోని ముస్లింల హక్కుల కోసం గళమెత్తుతామని తాలిబన్లు ప్రకటించాడు. మొదట్లో కశ్మీర్ అంశంతో తమకు సంబంధం లేదని ప్రకటించిన తాలిబన్లు అంతలోనే మాటమార్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అటు పాక్ మీడియా సైతం తాలిబ‌న్లు భార‌త్‎కు వ్య‌తిరేకం అంటూ ప్రచారం మొదలు పెట్టింది. దీనిని కాబూల్‎కు ఢిల్లీకి దూరాన్ని పెంచే పన్నాగంగా భావిస్తున్నారు విదేశీ వ్యవహారాల నిపుణులు. ఇప్పటికే తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటులో పాకిస్తాన్ హస్తముందనే వార్తలు జోరందుకున్నాయి. చైనా తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నట్టుగా అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. చైనా తన నమ్మినబంటుగా ఉన్న పాకిస్తాన్ సహాయంతో.. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించినట్టుగా తెలుస్తోంది. తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందే పాకిస్తాన్ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ కాబూల్‎లో వాలిపోయాడు. తాలిబన్ సర్కార్ వెనుక పాక్ హస్తం ఉందని చెప్పడానికి ఇదే బలమైన ఉదాహరణ.

ప్రభుత్వ ఏర్పాటుకు ముందు ఆఫ్ఘనిస్తాన్‎లోని కాందహరీలు, కాబూలీల మద్య తలెత్తిన అంతర్గత సమస్యల్ని పరిష్కరించేందుకు ఐఎస్ఐ తీవ్రంగా శ్రమించింది. పాకిస్తాన్‎కు కొమ్ముకాసే హక్కానీలకు హక్కానీలకు కేబినెట్‎లో స్థానం కల్పించింది. హక్కానీ తీవ్రవాద గ్రూపుగా, ఆల్‎ఖైదాకు సంబంధించిన సంస్థగా ఇప్పటికే ఐక్యరాజ్యసమితి నిషేధిత జాబితాలో వుంది. తాలిబన్ సర్కార్ ఏర్పాటు వెనుక పాకిస్తాన్ ప్రత్యక్ష పాత్ర పోషించగా.. ఈ మొత్తం వ్యవహారంలో చైనా తెరవెనుక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. కాబూల్‎లో అన్ని దేశాలు తమ తమ దౌత్య కార్యాలయాలను మూసివేసినా.. చైనా, పాకిస్తాన్ ఎంబసీలు మాత్రం కొనసాగుతున్నాయి.ః

ఇదిలావుంటే, తాలిబన్లు కూడా చైనా అందించే ఆర్ధిక సహాయంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆప్ఘనిస్తాన్ అభివృద్ధికి చైనా తోడ్పాటునందిస్తుందని తాలిబన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘన్‌‌లో పెట్టుబడులు పెట్టడానికి డ్రాగన్ దేశం సిద్ధంగా ఉందని తాలిబన్లు చెప్పారు. ఆఫ్ఘన్ పునర్నిర్మాణం కోసం తాము చైనా సాయం తీసుకుంటామని స్పష్టంచేశారు. యుద్ధంతో చాలా నష్టపోయిన ఆఫ్ఘనిస్థాన్‌లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోంది. అందుకే, ఈ పరిస్థితిని తట్టుకొని నిలబడేందుకు చైనా సాయం తీసుకుంటామని, ఆ సహకారంతో తమ దేశంలో అపారంగా వున్న రాగి నిల్వలను ఉపయోగించుకునే అవకాశం కలుగుతుందని తాలిబన్లు చెబుతున్నారు. ఈ క్రమంలో తాలిబన్ల అధికార ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. చైనా చేసిన ‘వన్ బెల్ట్, వన్ రోడ్’ ప్రతిపాదనకు తాము మద్దతిస్తామని ప్రకటించారు.

అటు తాలిబన్ ప్రకటన పట్ల పాకిస్తాన్ కూడా హర్షం వ్యక్తం చేసింది. చైనాతో మైత్రి విషయంలో తాలిబన్లు కూడా పాకిస్తాన్‎లాగే ఆలోచిస్తున్నారని.. పాక్ ఇంటీరియర్ మినిస్టర్ షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు. చైనా మైత్రి పట్ల పాకిస్తాన్ గర్వంగా వుందని.. తమకు తాలిబన్లు కూడా తోడైతే మైత్రి మరింత బలపడుతుందని అన్నాడు. ఏదేమైనా, చైనా విస్తరణవాదానికి, పాకిస్తాన్ ఉగ్రవాదానికి.. తాలిబన్ల మతోన్మాదం తోడైతే దక్షిణాసియాకు మరింత ప్రమాదమని అంతర్జాతీయ నిపుణులు అంచనావేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

fourteen − 10 =

Back to top button