International

ఆ కళాకారుడు ఏడుస్తూ ఉండగా.. వీరందరి పైశాచిక ఆనందం

ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ పాలన కారణంగా ఆ దేశంలోని సంగీతకారులపై అణిచివేతను తీవ్రతరం చేసింది. శనివారం (జనవరి 15), ఆఫ్ఘనిస్తాన్‌లోని పాక్టియా ప్రావిన్స్‌లోని జజాయ్ అరూబ్ జిల్లాలో తాలిబాన్లు స్థానిక సంగీత విద్వాంసుడి సంగీత వాయిద్యాన్ని తగలబెట్టినట్లు ఆఫ్ఘన్ జర్నలిస్ట్ అబ్దుల్‌హాక్ ఒమెరీ తెలియజేశారు. ఓ సంగీతకారుడి కళ్లెదుటే అతడి వాయిద్య పరికరాన్ని తాలిబాన్లు దగ్ధం చేశారు. వాయిద్య పరికరం అగ్నికి ఆహుతవుతుండగా, విలపిస్తున్న ఆ సంగీతకారుడి వైపు చూస్తూ తాలిబాన్లు వెకిలిగా నవ్వుతుండడం ఆ వీడియోలో కనిపించింది.

ఒమెరీ పంచుకున్న వీడియోలో సంగీతకారుడు తన కాలిపోతున్న సంగీత వాయిద్యాన్ని చూసి విలపించడాన్ని చూడవచ్చు. పక్కనే నిలబడి ఉన్న ఒక తాలిబ్ సంగీత విద్వాంసుడి దుస్థితిని చూసి నవ్వుతూ, వెక్కిరిస్తూ కనిపించాడు. మరో ఇస్లామిస్ట్ ఆ వ్యక్తి వీడియోను తీయాలని నిర్ణయించుకున్నాడు.

గత నెలలో తాలిబాన్లు హార్మోనియం, ఇతర సంగీత వాయిద్యాలను ధ్వంసం చేయడం కనిపించింది. ఈ వీడియోను పాకిస్థానీ జర్నలిస్ట్ హమ్జా అజర్ సలామ్ షేర్ చేశారు. పాకిస్తాన్‌లోని మౌల్వీలు మొదట్లో టీవీ, రేడియో, ఇతర వినోద పద్ధతులకు వ్యతిరేకంగా ఉండేవారని.. అయితే తరువాత వాటిని ఉపయోగించడం ప్రారంభించారని.. తాలిబ్‌లలో కూడా అలాంటి మార్పు వచ్చే అవకాశం ఉంటుందని హంజా వెనకేసుకొచ్చాడు.

ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన నాటిక్ మాలిక్జాదాకు చెందిన మరొక వీడియోలో, తాలిబ్‌లు భవిష్యత్తులో మళ్లీ టీవీ చూడనని ప్రమాణం చేయమని ఒక వ్యక్తిని బలవంతం చేయడం కనిపించింది. వారు టీవీకి మరణశిక్ష విధించారు. దానిని పగులగొట్టి ఉరిశిక్షను అమలు చేశారు. టీవీని ధ్వంసం చేయడంతో గుంపులో ఉన్నవారంతా ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి వినోదాలకు దారి తీసే ఎన్నో విభాగాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. తాలిబాన్ పాలనలో వివాహాలలో ప్రత్యక్ష సంగీతాన్ని నిషేధించింది. వివాహాల సమయంలో పురుషులు, మహిళలు వేర్వేరు హాళ్లలో జరుపుకోవాలని ఆదేశించింది. ఇటీవల తాలిబాన్లు వస్త్ర దుకాణాలు ఉపయోగించే బొమ్మలకు శిరచ్ఛేదం చేయాలని కూడా ఆదేశించారు.

Related Articles

Back to top button