ఆఫ్ఘనిస్తాన్ లోని పలు ప్రాంతాలను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటూ ఉన్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. భారత్ ఆఫ్ఘనిస్తాన్ కు బహుమానంగా ఇచ్చిన Mi-35 అటాక్ హెలికాఫ్టర్ ఇప్పుడు తాలిబాన్ల చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘన్ దళాలకు భారతదేశం బహుమతిగా ఇచ్చిన ఎంఐ -35 అటాక్ హెలికాప్టర్ తాలిబానీ ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళింది. ఆఫ్ఘనిస్తాన్ దళాల నుండి ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని కుందూజ్ విమానాశ్రయంను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. రష్యా రూపొందించిన ఎంఐ-35 హింద్ అటాక్ హెలికాఫ్టర్ ను తాలిబాన్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు.
తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న విమానాశ్రయం నుండి వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. తాలిబాన్లు తుపాకీలను పట్టుకుని విమానం ముందు పహారా కాస్తున్నారు. అయితే హెలికాప్టర్ ఎగరడానికి సంబంధించిన కీలక వస్తువులు కనిపించలేదు. ఇంజిన్లలోని రోటర్ బ్లేడ్లు, కీలక భాగాలు కనిపించడం లేదు. వీడియోలు, ఫోటోలను నిశితంగా పరిశీలిస్తే, రోటర్ బ్లేడ్లు హెలికాప్టర్ క్రింద, నేలపై ఉంచినట్లు తెలుస్తోంది.
రక్షణ విశ్లేషకుడు జోసెఫ్ డెంప్సే మాట్లాడుతూ జూలై 14 న ఉపగ్రహ చిత్రం ఆధారంగా కుందూజ్ హంగర్ వద్ద రోటర్ బ్లేడ్‌లతో పార్క్ చేసిన Mi-35 అటాక్ హెలికాప్టర్‌ను చూపించింది. అయితే తాజాగా బయటకు వచ్చిన ఫోటోలను పరిశీలిస్తే హెలికాప్టర్ రోటర్ బ్లేడ్లు లేకుండా చూపించింది. తాలిబాన్ దళాల చేతిలో ఓటమిని అంచనా వేస్తూ ఆఫ్ఘన్ దళాలు హెలికాప్టర్ నుండి పలు భాగాలను తీసివేసినట్లు భావించవచ్చని అన్నారు. దాని రోటర్ బ్లేడ్‌లను తీసివేయడంతో పాటు, పలు భాగాలను నిర్వీర్యం చేసి ఉండవచ్చని భావిస్తూ ఉన్నారు. అలా చేయడం వలన తాలిబాన్లు ఆ హెలికాఫ్టర్ ను ఉపయోగించే వీలు ఉండదు. హెలికాప్టర్ పక్కన నిలబడి ఉన్న తాలిబానీ టెర్రరిస్టుల చిత్రంలో విడదీసిన రోటర్ బ్లేడ్‌లను చూపుతుంది. భారత రక్షణ నిపుణుడు మను పబ్బి ప్రకారం, ఇతర హెలికాప్టర్లను మరమ్మతు చేయడానికి ఆఫ్ఘన్ వైమానిక దళం ఎయిర్‌ఫ్రేమ్‌ని ఉపయోగించి భాగాలను తీసివేసి ఉండే అవకాశం ఉందని అన్నారు.
ఈ వారం తాలిబాన్ ఈశాన్య నగరమైన కుందూజ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. కుందూజ్, ఒక వ్యూహాత్మక పట్టణం ఉత్తర ప్రావిన్సులు మరియు మధ్య ఆసియా ముఖద్వారం వద్ద ఉంటుంది. తాలిబాన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తమ బలగాలు విమానాశ్రయానికి సమీపంలో ఉన్నాయని చెప్పారు. తాలిబానీ ఉగ్రవాదులు విమానాశ్రయాన్ని సొంతం చేసుకున్నారు. కుందూజ్ విమానాశ్రయంలోని స్థానిక ఆర్మీ ప్రధాన కార్యాలయంతో సహా పలు ప్రాంతాలను ఆఫ్ఘన్ దళాల నుండి తాలిబాన్లు లాగేసుకున్నారు. సోషల్ మీడియా వినియోగదారుల ప్రకారం విమానాశ్రయంలో ఒక సివిలియన్ విమానం కూడా ఉంది. నివేదికల ప్రకారం వందలాది ఆఫ్ఘన్ సైనికులు మరియు పోలీసు అధికారులు తాలిబాన్లకు లొంగిపోయారు.