ఆఫ్ఘనిస్తాన్ లోని పంజ్ షీర్ ను సొంతం చేసుకున్నామని తాలిబాన్లు చెబుతూ వస్తున్నారు. గతంలో కూడా అదే మాట చెప్పినప్పటికీ అది అబద్ధమని తేలింది. ఈరోజు మరోసారి అదే తరహా ప్రచారాన్ని తాలిబాన్లు మొదలుపెట్టారు. పంజ్ షీర్ ప్రావిన్స్‌ను కూడా తాము గెలిచినట్లు ప్రకటించుకున్నారు తాలిబన్లు. ప్రావిన్షియల్ గవర్నర్ కార్యాలయం ముందు తాలిబాన్ నేతలు నిల్చున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారి వెనుకే తాలిబాన్ జెండా కూడా ఉంది. ఈ యుద్ధంలో నార్తర్న్ అలయెన్స్ కమాండర్ ఇన్ చీఫ్ సలే మహ్మద్‌ను కూడా తాము మట్టుబెట్టినట్లు తాలిబన్లు ప్రకటించుకున్నారు. పాక్ ఎయిర్‌ఫోర్స్ కూడా తాలిబాన్లకు సహకరిస్తోంది. పంజ్‌షీర్ ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తాలిబాన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు.
తాలిబన్లు చెబుతున్నదన్నదంతా అబద్ధమని పంజ్‌షీర్ ఇంకా తమ ఆధీనంలోనే ఉన్నదని తిరుగుబాటు సేనలు చెబుతున్నాయి. ఇంకా పోరాడుతూ ఉన్నామని చెబుతున్నారు. తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న రెసిస్టెన్స్ దళాల నాయకులు అహ్మద్ మసౌద్, అమ్రుల్లా సలేహ్ గురించి తాలిబాన్ల నుండి ఎలాంటి సమాచారం లేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, సలేహ్ ఇంటిపై హెలికాప్టర్ తో బాంబు దాడి చేయడంతో సురక్షిత ప్రాంతానికి తరలించారని తెలుస్తోంది. అహ్మద్ మసూద్ కూడా సురక్షితంగా ఉన్నారని చెప్పారు.
కొన్ని రోజుల క్రితం కూడా పంజ్‌షీర్ ప్రావిన్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబాన్లు చెప్పగా నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ (NRF) ఆ వ్యాఖ్యలను తిరస్కరించింది. తాజాగా కూడా అమ్రుల్లా సలేహ్ కు సన్నిహితంగా ఉన్న వాళ్లు.. పంజ్ షీర్ ఇంకా తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లలేదని తెలిపారు. “తాలిబాన్ల వాదనలు తప్పు. ప్రతిఘటన దళాలు పర్వతాలపై ఉన్నాయి. తమను తాము రక్షించుకుంటాయి. మాకు వ్యతిరేకంగా కార్యకలాపాల కోసం తాలిబాన్లకు పాకిస్తాన్ ఛాపర్లు సహాయపడుతున్నాయని ”అని అమ్రుల్లా సహాయకుడు చెప్పినట్లు నివేదిక పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్‌లో పంజ్‌షీర్ వద్ద ఆదివారం భారీగా కాల్పులు జరిపాయి. సమంగాన్ మాజీ ఎంపీ జియా అరియన్‌జాద్ ఆమాజ్ మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ వైమానిక దళం డ్రోన్‌లతో బాంబు దాడి చేసినట్లు తెలిపారు. దాడికి స్మార్ట్ బాంబులను ఉపయోగించారని నివేదికలు తెలిపాయి. ప్రతిఘటన దళాలకు వ్యతిరేకంగా పోరాటంలో పాకిస్థాన్ సైన్యం నుండి తాలిబాన్ సహాయం పొందినట్లు అనేక వార్తా సంస్థలు నివేదించాయి. ప్రతిఘటన దళాలకు వ్యతిరేకంగా తాలిబాన్లతో కలిసి పోరాడటానికి ప్రత్యేక దళాలను గాలిలోకి దించినట్లు తెలుస్తోంది. అయితే నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ దళాలకు భారీగా ఎదురుదెబ్బలు కలిగాయని అనేక నివేదికలు పేర్కొంటున్నాయి. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికీ కొన్ని వ్యూహాత్మక ప్రదేశాలలో ఉంది.. తాలిబాన్ మరియు దాని సహాయక దళాలకు వ్యతిరేకంగా వారి పోరాటం కొనసాగుతోంది.
పంజాంగ్‌లోని ఎనిమిది జిల్లాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తాలిబాన్ ప్రకటించింది. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ఘనిస్తాన్ చీఫ్ కమాండర్ సలేహ్ మహ్మద్ కూడా పంజ్‌షిర్‌లో జరిగిన దాడిలో మరణించాడని తాలిబాన్ ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రతినిధి ఫాహిమ్ దస్తీ ఆదివారం పంజ్‌షీర్‌లో తాలిబన్‌లతో జరిగిన యుద్ధంలో మరణించారని తాలిబాన్ ప్రచారం చేసుకుంటూ ఉంది. అహ్మద్ షా మసూద్ మేనల్లుడు మరియు మాజీ ప్రముఖ ముజాహిదీన్ కమాండర్ జనరల్ సాహిబ్ అబ్దుల్ వదూద్ జోర్ కూడా ఈ యుద్ధంలో మరణించినట్లు తెలుస్తోంది.