ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్, హెరాత్ ప్రావిన్స్‌లలో మూసివేయబడిన భారతీయ కాన్సులేట్‌లపై తాలిబాన్లు బుధవారం రైడ్లను నిర్వహించినట్లు హిందుస్థాన్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. తాలిబాన్లు భారత్ కు చెందిన రెండు కాన్సులేట్లలో సోదాలు జరిపారని.. అలాగే రాయబార కార్యాలయాల బయట పార్క్ చేసిన వాహనాలను తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆధీనంలోని నిఘా సంస్థ అయిన ఎన్‌డిఎస్‌లో పనిచేసిన ఆఫ్ఘన్‌ల వివరాలను తెలుసుకోవడానికి తాలిబాన్లు ప్రయత్నించారు. వారికి కావాల్సిన పేపర్‌ల కోసం అల్మారాలను వెతికారు. జలాలాబాద్, కాబూల్‌లోని కాన్సులేట్ మరియు రాయబార కార్యాలయాల్లో తాలిబాన్లు ఏమేమి చేశారో వివరాలు అందుబాటులో లేవు. కాందహార్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం తాలిబాన్లు భారత కాన్సులేట్ తాళాలను పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. దౌత్య అధికారులు వినియోగించే వాహనాలను తాలిబాన్లు తీసుకొని వెళ్లిపోయారు.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని నగరం కాబూల్ ప్రస్తుతం హక్కానీ నెట్‌వర్క్కు చెందిన దాదాపు 6,000 క్యాడర్‌ల నియంత్రణలో ఉంది. టెర్రరిస్ట్ గ్రూప్ అధినేత, తాలిబాన్ డిప్యూటీ లీడర్ సిరాజుద్దీన్ హక్కానీ సోదరుడు అనస్ హక్కానీ పలువురు నేతలను కలుస్తూ ఉన్నారు. మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, ఛైర్మన్ హెచ్‌సిఎన్‌ఆర్ అబ్దుల్లా అబ్దుల్లా, హెజ్బ్-ఇ-ఇస్లామీకి చెందిన గుల్బుద్దీన్ హెక్‌మత్యార్‌ని కూడా కలిశారు. తాలిబాన్లు కర్జాయ్, అబ్దుల్లాల కదలికలను పరిమితం చేసినట్లు తెలుస్తోంది.
హమీద్ కర్జాయ్, అబ్దుల్లా ఇద్దరూ కలిసి అధ్యక్ష భవనంలో అధికారికంగా తాలిబాన్ నాయకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌కు అధికారాన్ని అప్పగించాలని తాలిబాన్లు చర్చలు జరుపుతున్నారు. సిరాజుద్దీన్ హక్కానీ పాకిస్తాన్ క్వెట్టా నుండి చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు. హక్కానీ నెట్‌వర్క్ కాబూల్‌పై నియంత్రణ తీసుకుంటున్నందున, ముల్లా ఒమర్ కుమారుడు మరియు తాలిబాన్ మిలిటరీ కమిషన్ అధిపతి అయిన ముల్లా యాకూబ్ నేతృత్వంలోని మరొక తాలిబాన్ వర్గం పష్టున్‌ల సంప్రదాయ కేంద్రమైన కాందహార్ నుండి అధికారాన్ని మరియు ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ ను ఇస్లామిక్ ఎమిరేట్ గా మార్చి మొట్ట మొదటి అధ్యక్షుడిగా ఉండాలని భావిస్తున్న ముల్లా బరాదర్ ఆగస్టు 18 న దోహా నుండి వచ్చిన తర్వాత ముల్లా యాకూబ్‌ను కలిశారు.
ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతీయులను తరలించడానికి సహాయం చేసిన తాలిబాన్లు
తాలిబాన్లు కాబూల్ ను స్వాధీనం చేసుకున్నారని తెలియగానే వీధుల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల మధ్య తాలిబాన్లు భారతీయులను రాయబార కార్యాలయం నుండి విమానాశ్రయానికి తీసుకెళ్లారని నివేదికలు వచ్చాయి. పాకిస్తాన్ దినపత్రిక డాన్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, తాలిబాన్లు రహదారి దిగ్బంధనాల కారణంగా భారతీయులు విమానాశ్రయానికి చేరుకోలేకపోయారు. భారతీయులు దేశం విడిచి వెళ్లడానికి భారత ప్రభుత్వం తాలిబాన్లను సంప్రదించింది. తాలిబాన్లు నగరానికి చేరుకున్న తర్వాత దాదాపు 50 మందిని భారత రాయబార కార్యాలయం వద్దకు తరలించారు. ఆదివారం కూడా దాదాపు 150 మందిని తరలించాలని నిర్ణయించారు.
ఆఫ్ఘనిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న 120 మందిని సైనిక రవాణా విమానంలో భారత ప్రభుత్వం తరలించింది. ఈ విమానం హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో బయలుదేరి గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయింది. విమానంలో తరలించిన వ్యక్తుల్లో కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు, భద్రతా సిబ్బంది, మరికొంత మంది భారతీయులు ఉన్నారు. జామ్‌నగర్ నుండి వారు గమ్యస్థానాలకు పంపబడ్డారు.