More

    మగతోడు లేకుండా ఆడవాళ్లు విమానాలు కూడా ఎక్కడానికి వీలు లేదు..!

    ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక మహిళలపై ఎన్నో ఆంక్షలు మొదలయ్యాయి. వారిపై ఎన్నో అఘాయిత్యాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు తాలిబాన్ కమాండర్లు అనేక మంది మహిళలను వివిధ విమానాల్లోకి అనుమతించడానికి నిరాకరించారు. అందులో కొందరు ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండగా వారిని అడ్డుకున్నారు. వారితో పాటు మగ సంరక్షకుడు లేడనే కారణంతో ఆడవాళ్లను దింపేశారు.

    నివేదికల ప్రకారం.. దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఎక్కడానికి శుక్రవారం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న డజన్ల కొద్దీ మహిళలు షాక్‌కు గురయ్యారు. ఈ పరిస్థితిపై మాట్లాడిన ఇద్దరు ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్ అధికారుల ప్రకారం, మగ సంరక్షకుడు లేకుండా ప్రయాణాలు చేయలేరని వారికి తెలియజేశామని అన్నారు. తాలిబాన్ అధికారుల ఆదేశం కారణంగా మహిళలను పలు ఎయిర్‌లైన్స్ విమానాలలో ఇస్లామాబాద్, దుబాయ్, టర్కీకి వెళ్లడానికి నిరాకరించారు. చాలా మంది మహిళలు ద్వంద్వ పౌరసత్వం ఉన్న వాళ్లు. మరి కొందరు కెనడా నుండి వచ్చారు. ఇప్పుడు వాళ్లు తిరిగి వెళ్లనివ్వకుండా ఎయిర్ పోర్టు అధికారులు అడ్డుకుంటూ ఉన్నారు.

    ఒక అధికారి ప్రకారం.. తాలిబాన్ నాయకత్వం నుండి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. శనివారం నాడు పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌కు అరియానా ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కేందుకు పలువురు మహిళలకు అనుమతి లభించిందని, అయితే క్లియరెన్స్ ఇచ్చే సమయానికి వారిని అధికారులు అడ్డుకోవడం జరిగింది. ఎయిర్‌పోర్ట్ ప్రెసిడెంట్, పోలీస్ చీఫ్, తాలిబాన్ మరియు ఇస్లామిక్ మత గురువులు, ఎయిర్‌లైన్ ఎగ్జిక్యూటివ్‌లతో శనివారం సమావేశమయ్యారని అధికారులు తెలిపారు. బాలికల కోసం సెకండరీ పాఠశాలలను మూసివేయాలని తాలిబాన్లు ఆదేశించిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన కూడా వచ్చింది.

    తాలిబాన్ల పాలనలో మహిళల దుస్థితి

    ఆగస్టు 2021లో దేశంలో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆఫ్ఘన్ మహిళలు కఠినమైన ఆంక్షల కారణంగా హింసను అనుభవిస్తున్నారు. తాలిబాన్లు మహిళల పట్ల వివక్ష చూపుతూనే ఉన్నారు. దేశంలోని పురుషులు అనుభవించే స్వేచ్ఛను మహిళలకు అందించడం లేదు. తాలిబాన్లు కూడా ప్రస్తుతం దేశంలో మహిళలతో జరుగుతున్నది వారి స్వంత సమస్య అని, మహిళలకు ఎటువంటి ఇబ్బంది, అన్యాయం జరగడం లేదని ప్రచారం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత, తాలిబాన్లు తాము మహిళలు, పిల్లలు, మైనారిటీల హక్కులను కాపాడతామని చెప్పుకొచ్చింది. కానీ అలాంటిది ఏమీ జరగడం లేదు.

    Trending Stories

    Related Stories