International

ఆడపిల్లలకు చదువు లేనట్లేనా.. బాలురకు మాత్రమే ప్రవేశం..!

తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత మహిళల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చదువు ఉద్యోగాల విషయంలో వారికి ఆంక్షలు ఉంటాయని ప్రపంచం మొత్తం అంచనా వేసింది. అనుకున్నట్లుగానే అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఇటీవల తాలిబాన్ నుండి వచ్చిన ఓ ప్రకటన ఆఫ్ఘనిస్తాన్‌లో బాలికలు మాధ్యమిక విద్యను పొందకుండా నిషేధించింది. అబ్బాయిల కోసం ఉన్నత పాఠశాలలను తిరిగి తెరవాలని తాలిబాన్లు ఆదేశించారు. ఆ ప్రకటనలో బాలికల గురించి మాత్రం చెప్పలేదు. ఏడు నుండి 12 వ తరగతి వరకు ఉన్న బాలుర కోసం అన్ని సెకండరీ పాఠశాల తరగతులను శనివారం నుండి పునః ప్రారంభించాలని కొత్త విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశించింది.ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తరువాత పాఠశాలలు మూసివేయబడిన ఒక నెల తర్వాత ఈ ప్రకటన వచ్చింది.

తాలిబాన్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి మహిళల భవిష్యత్తు మరియు భద్రత ప్రశ్నార్థకంగా మారాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల మునుపటి పాలనలో ఆడవాళ్లు విద్య, పని, ఇతర ప్రాథమిక మానవ హక్కులను పొందకుండా నిషేధించారు. ఈసారి తాలిబాన్ మహిళలు చదువుకోవడానికి మరియు పని చేయడానికి అనుమతించబడతారని, గత పాలనలా ఉండదని పేర్కొన్నారు. ఇంతకు ముందు తాలిబాన్ నేతలు మాట్లాడుతూ యువతులు విశ్వవిద్యాలయాలకు హాజరు కావడానికి అనుమతించింది కానీ వారు ముఖం మరియు శరీరంలోని అన్ని భాగాలను కప్పుకోవాల్సి ఉంటుందని తెలిపారు. తరగతి గదులను వేరు చేయాలని మరియు మహిళా టీచర్‌లు మాత్రమే బాలికలకు బోధించడానికి అనుమతించాలని యూనివర్సిటీలను ఆదేశించారు. మహిళా టీచర్లు అందుబాటులో లేని సమయంలో వయసులో పెద్ద వాళ్ళైన టీచర్లు, టెక్నాలజీ ద్వారా విద్యను చెప్తామని అన్నారు. మగవారితో పోలిస్తే ఐదు నిమిషాల ముందుగానే విద్యాసంస్థలు, చుట్టుపక్కల ప్రాంతాలను వదిలి వెళ్లాలని మహిళా విద్యార్థినులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. మగవారితో స్త్రీలు సంప్రదించకూడదని ఆంక్షలు జారీ చేశారు.

ఇక మహిళా మంత్రిత్వ శాఖలో పని చేసే నలుగురు మహిళా ఉద్యోగులను కాబూల్‌లోని ఆ శాఖ కార్యాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. కేవలం పురుష ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ దేశ మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన మహిళా ఉద్యోగులపై తాలిబాన్లు నిషేధం విధించినట్లు ఆ శాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు. ఈ చర్యను నిరసిస్తూ మహిళా ఉద్యోగులు మహిళా మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు.

Related Articles

Back to top button