ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో పాకిస్తాన్ ఎప్పటి నుండో తాలిబాన్లకు మద్దతు తెలుపుతూ ఉంది. ఇటీవల కూడా రెసిస్టెన్స్ దళాలను తాలిబాన్లు ఎదుర్కొంటున్న సమయంలో పాక్ ఎయిర్ ఫోర్స్ పంజ్ షీర్ వ్యాలీలో బాంబు దాడులకు పాల్పడింది. ఆఫ్ఘన్ వ్యవహారంలో పాకిస్తాన్ వేలు పెట్టడాన్ని ఆఫ్ఘన్ ప్రజలు సహించలేకపోతున్నారు. దీంతో పాక్ కు వ్యతిరేకంగా కాబూల్‌లో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. అయితే ఆ నిరసనకారులపై తాలిబన్లు కాల్పులకు దిగారు. యాంటీ-పాకిస్థాన్ ర్యాలీని చెదరగొట్టేందుకు తాలిబన్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. వందల్లో ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. దాంట్లో ఎక్కువ శాతం మంది మహిళలే ఉన్నారు. కాబూల్‌లో ఉన్న పాకిస్తానీ ఎంబసీ ముందు ఈ నిరసన ప్రదర్శన జరిగింది. పాకిస్తాన్ కు, ఐఎస్ఐ కు వ్యతిరేకంగా నిరసనలను చేపట్టారు ఆఫ్ఘన్ ప్రజలు.
AFP వార్తా సంస్థ ప్రకారం, కాబూల్‌లో పాకిస్తాన్ వ్యతిరేక ర్యాలీని చెదరగొట్టడానికి తాలిబాన్లు గాలిలో కాల్పులు జరిపారు. కాబూల్ లోని రాష్ట్రపతి భవనం సమీపంలో గుమిగూడిన నిరసనకారులపై తాలిబన్లు కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా సంస్థ ‘అశ్వక న్యూస్’ తెలిపింది. నిరసనకారులు గత వారం నుండి పాకిస్థాన్ ఐఎస్ఐ డైరెక్టర్ బస చేస్తున్న కాబూల్ సెరెనా హోటల్ ముందే ఉన్నారు. షేర్ చేయబడిన వీడియోలలో వందలాది మంది ఆఫ్ఘన్ పురుషులు, మహిళలు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం గమనించవచ్చు. ఆఫ్ఘన్ ప్రజల్లో కోపం తారాస్థాయికి వెళ్లడంతో నిరసనకారులు “ఆజాది, ఆజాది” అంటూ “పాకిస్తాన్‌కు మరణం”, “ISI కి మరణం” అని నినాదాలు చేశారు. బుర్ఖాలు ధరించిన మహిళలు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాబూల్ వీధుల్లోకి వచ్చారు. కాబూల్, మజారీ షరీఫ్ నగరాల్లో మహిళలు సహా పెద్ద ఎత్తున ఆఫ్ఘన్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అహ్మద్ మసూద్ నేతృత్వంలోని ప్రతిఘటన దళాలకు ఆఫ్ఘన్ ప్రజలు మద్దతుగా నిలిచారు. పంజ్ షీర్ కే తమ మద్దతు అని, తమకు స్వేచ్ఛ కావాలని నినాదాలు చేశారు.‘‘తాలిబాన్లకు మరణ శిక్ష.. ఆఫ్ఘనిస్తాన్ జిందాబాద్’’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పాకిస్థాన్ కూ మరణ శిక్ష తప్పదంటూ నినాదాలు చేశారు. తాలిబాన్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్లందరూ గళం విప్పాల్సిన సమయం వచ్చిందని అహ్మద్ మసూద్ సందేశం ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఆఫ్ఘన్లు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. విదేశీ అరాచక శక్తులతో తాలిబాన్లు చేతులు కలిపారని, దీనిపై దేశంలోని అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములంతా ఏకం కావాలని అహ్మద్ మసూద్ పిలుపునిచ్చారు.
ట్విట్టర్లో షేర్ చేయబడిన ఒక వీడియోలో.. ఆఫ్ఘన్ మహిళ మాట్లాడుతూ “పంజ్‌షీర్‌పై దాడి చేయడానికి ఎవరికీ హక్కు లేదు, పాకిస్తాన్ లేదా తాలిబాన్ ఎవరికీ హక్కులు లేదు” అని చెప్పుకొచ్చింది. సోమవారం తాలిబాన్లు పంజ్‌షీర్ లోయను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.. అయితే ఇది అబద్ధమని తాలిబాన్లకు వ్యతిరేకంగా ప్రతిఘటన దళాలు తీవ్ర పోరాటం చేస్తున్నాయని తెలుస్తోంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తాలిబాన్లకు మద్దతు ఇవ్వడమే కాకుండా.. ఐఎస్ఐ సిబ్బంది కాబూల్‌లో ఆకస్మిక పర్యటన చేసింది. ఆఫ్ఘనిస్తాన్పై 20 సంవత్సరాల యుఎస్ యుద్ధంలో తాలిబాన్లకు పాకిస్తాన్ మద్దతును ఇస్తూ వచ్చింది. తాలిబాన్లు పాకిస్తాన్‌ను తమ “రెండవ ఇల్లు” అని కూడా పిలిచారు. త్వరలో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటు వేడుకలకు పాక్ నాయకులను ఆహ్వానించారు.
తాలిబాన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ మాట్లాడుతూ.. కొత్త తాలిబాన్ పరిపాలనకు పాకిస్తాన్ చాలా ముఖ్యమైనదని తెలిపారు. చాలా మంది తాలిబాన్ల కుటుంబాలు, పిల్లలు పాకిస్తాన్లో నివసిస్తున్నారని చెప్పారు. పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ ఒక టీవీ షోలో మాట్లాడుతూ, పాకిస్తాన్ ప్రభుత్వం ఎల్లప్పుడూ తాలిబాన్ నాయకులకు అండగా నిలిచిందని, వారు పాకిస్తాన్ కు విధేయులుగా ఉన్నారని ప్రస్తావించారు.
