More

    గర్భవతి అయిన పోలీసు మహిళను కుటుంబసభ్యుల ముందే కాల్చి చంపిన తాలిబాన్లు

    తాలిబాన్లు అధికారం లోకి వస్తే మహిళల మీద తీవ్రమైన ఆంక్షలు ఉంటాయని ముందుగానే అందరూ ఊహించారు. ఊహించినట్లుగానే మహిళలపై తాలిబాన్లు తమ ఆంక్షలను అమలు చేస్తూ ఉన్నారు. మహిళలు వేసుకునే బట్టల దగ్గర నుండి.. ఉద్యోగాల వరకూ ఎన్నో నిబంధనలను తీసుకుని వచ్చారు. మాట వినని వారిపై తాలిబాన్లు శిక్షలు కూడా విధిస్తున్నారు.

    తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకున్న ఓ ఘటన ప్రపంచం మొత్తం నిర్ఘాంతపోయేలా చేసింది. గర్భిణి అయిన ఆఫ్ఘన్ పోలీసు మహిళను తాలిబాన్లు ఆమె కుటుంబం ముందే కాల్చి చంపారని ఆఫ్ఘన్ జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. ఘోర్ ప్రావిన్స్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. బాను నిగారా అనే పోలీసు మహిళ 6 నెలల గర్భవతి అని స్థానిక అధికారులు కూడా తెలిపారు. తన భర్త మరియు పిల్లల ముందు ఆమెను తాలిబాన్లు చంపేసినట్లు జర్నలిస్ట్ తెలిపారు.

    ఈ హత్యలో తమ సంస్థకు సంబంధం లేదని తాలిబాన్ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహీద్ తెలిపారు. ‘ఈ సంఘటన గురించి మాకు తెలిసింది.. తాలిబాన్లు ఆమెను చంపలేదని నేను ధృవీకరిస్తున్నాను, మా విచారణ కొనసాగుతోంది.’ అని తాలిబాన్లు తెలిపారు. అయితే వ్యక్తిగత శత్రుత్వం లేదా మరేదైనా కారణం ఆమె హత్య వెనుక ఉండొచ్చని తాలిబాన్ ప్రతినిధులు వెల్లడించారు. మొదట ముగ్గురు వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చారు. ఇల్లు మొత్తాన్ని వెతికారు. ఆమెను చంపడానికి ముందు కుటుంబ సభ్యులని కట్టివేశారు. ఈ సంఘటన శనివారం జరిగింది. తాలిబాన్ తనను తాను మితవాద సంస్థగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. తాలిబాన్ల విషయంలో అమెరికన్ మరియు నాటో దళాలకు సహకరించిన వారిని వేటాడేందుకు తాలిబాన్లు ఇంటింటికీ వెళ్లినట్లు అనేక నివేదికలు వచ్చాయి.

    మరోవైపు తమ హక్కులు కాపాడాలని.. అన్నిట్లోనూ తమకు అవకాశాలు కల్పించాలని మహిళలు ఓ వైపు పలు నగరాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టగా.. తాలిబాన్లు ఇప్పుడు ఓ గర్భవతిని చంపారనే వార్త బయటకు రావడంతో ప్రజల్లో మరింత ఆగ్రహం నెలకొంది. ఆఫ్ఘన్ ప్రధాన పట్టణాల వీధుల్లో వేల మంది మహిళలు తాలిబాన్లకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తమ హక్కులు ఇవాల్సిందే అంటూ నిరసన గళం వినిపిస్తున్నారు మహిళలు. పశ్చిమ ప్రాంతంలోని చాలా పట్టణాలలో హక్కుల పరిరక్షణ కోసం మహిళలు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. మూడో అతిపెద్ద పట్టణం అయిన హెరాత్‌లో యాభై మంది మహిళలు మొదలుపెట్టిన నిరసన ప్రదర్శన.. మిగతా మహిళల్లో స్ఫూర్తి, ధైర్యాన్ని నింపింది. తాము బురఖాలను ధరించడానికి సిద్ధమేనని.. అయితే ఉద్యోగాలు మాత్రం తమకు కావాలని తాలిబాన్లకు మహిళలు తెగేసి చెబుతూ వస్తున్నారు. ఉద్యోగాల నుంచి తమను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. తమ కుమార్తెలు తాలిబాన్ పాలనలో పాఠశాలకు వెళ్లగలిగితే బురఖా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఆఫ్ఘన్ మహిళలు నిరసనల్లో తెలిపారు.

    బురఖా లేకుండా మహిళలు కనిపిస్తే తాలిబాన్లు వేటాడతారనే భయం కూడా మహిళల్లో నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున బురఖాలను కొనడానికి ఆఫ్ఘన్ మహిళలు ముందుకు వస్తున్నారు. 90 వ దశకంలో తాలిబాన్ పాలనలో చోటు చేసుకున్న దారుణాలు మళ్లీ చోటు చేసుకుంటాయనే భయం ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ ఉంది.

    Trending Stories

    Related Stories