గురుద్వారాలోకి దూసుకుపోయిన తాలిబాన్లు.. భక్తులకు బెదిరింపులు

0
677

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారం లోకి వచ్చినప్పటి నుండి మైనారిటీల పరిస్థితి దారుణంగా తయారైంది. తాము అందరినీ సమానంగా చూస్తామని తాలిబాన్ నేతలు చెబుతున్నా.. పరిస్థితులు మాత్రం చాలా తేడాగా ఉన్నాయి. కాబూల్ లోని కర్టే పర్వాన్ లో ఉన్న దష్ మేష్ గురుద్వారాలోకి తాలిబాన్లు బలవంతంగా ప్రవేశించారు. తాము ‘స్పెషల్ యూనిట్’ అంటూ లోపలికి చొరబడి గురుద్వారాను అపవిత్రం చేశారు. ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పునీత్ సింగ్ చందోక్ ఈ ఘటనపై స్టేట్మెంట్ ను విడుదల చేశారు. ఆయుధాలతో వచ్చిన తాలిబాన్లు సిక్కులను భయపెట్టారని.. కాబూల్ లోని సిక్కు సమాజం నుంచి తమకు అనేక కాల్స్ వచ్చాయని తెలిపారు. ఆయుధాలను ధరించిన కొందరు వ్యక్తులు తాము ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యేక యూనిట్ కు చెందిన వారమని చెపుతూ గురుద్వారాలోకి బలవంతంగా ప్రవేశించారని తెలిపారు. గురుద్వారాలో ఉన్న సిక్కు సంఘం అధ్యక్షుడిని బెదిరించారని అన్నారు. గురుద్వారా అంతా కలియదిరిగారని, పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్న సెక్యూరిటీ గార్డును కొట్టారని, తమను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారని తెలిపారు. గురుద్వారాకు ఆనుకుని ఉన్న స్కూల్ లోకి కూడా ప్రవేశించారని చెప్పారు. వారు గురుద్వారాని మాత్రమే కాకుండా దాని పక్కనే ఉన్న కమ్యూనిటీ స్కూల్ ఆవరణలో కూడా బాగా తిరిగారని చందోక్ వెల్లడించారు. గురుద్వారలో ఇంకా 20 మంది సిక్కులు చిక్కుకున్నారని, ఈ పరిస్థితిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.

తాలిబాన్లు అధికారం లోకి రాగానే.. భారత్ కు వచ్చేసిన హిందువులు, సిక్కులు

ఆగష్టు 15, 2021 న, తాలిబాన్లు తమను ఆఫ్ఘనిస్తాన్ పాలకులుగా ప్రకటించుకుని కాబూల్‌లోకి ప్రవేశించారు. కాబూల్ పతనం తర్వాత దేశవ్యాప్తంగా భయాందోళనలు మొదలయ్యాయి. ఆ తర్వాత నగరవాసులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. దేశం నుండి పారిపోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో సంక్షోభం ఏర్పడుతుందని భారతదేశం ఊహించి అప్పటికే వేగంగా తరలింపును ప్రారంభించింది. ఎంతో మంది హిందువులను, సిక్కులను భారత్ కు తరలించారు.

బహిరంగ మరణశిక్షలపై తాలిబాన్ ప్రకటన:

బహిరంగ మరణ శిక్షలపై తాలిబాన్లు ప్రకటన చేశారు. దేశ సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకు బహిరంగ శిక్షలను అమలు చేయబోమని తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు వస్తేనే బహిరంగ మరణ శిక్షలు, మృతదేహాలను బహిరంగంగా వేలాడదీయడం అమలు చేయాలని తాలిబాన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పారు. అందుకు మంత్రి మండలి మొత్తం ఆమోదం తెలిపిందన్నారు. శిక్ష విధిస్తే తప్పనిసరిగా అతడు చేసిన నేరమేంటో ప్రజలకు తెలిసేలా చేయాలని చెప్పారు. కాళ్లూచేతుల నరికివేత, ఉరితీత వంటి కఠినమైన శిక్షలను బహిరంగంగా అమలు చేస్తామని గతంలో ఆఫ్ఘనిస్థాన్ న్యాయ శాఖ మంత్రి ముల్లా నూరుద్దీన్ తురాబీ గతంలో వ్యాఖ్యలు చేశారు.