More

  పాకిస్తాన్ లో ఎగిరిన తాలిబాన్ల జెండాలు.. దిక్కుతోచని స్థితిలో ఇమ్రాన్ ఖాన్

  తాలిబాన్లకు పాకిస్తాన్ ఎంతో మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే..! ఆఫ్ఘనిస్తాన్ లో తిరిగి తాలిబాన్లు అధికారంలోకి వచ్చారంటే అందుకు పాకిస్తాన్ చేసిన సాయం కూడా ఎంతో ఉంది. అమెరికా తాలిబాన్ నేతలను వేటాడుతున్న సమయంలో పాక్ వారికి ఆశ్రయం ఇచ్చింది. ఎన్నో విధాలుగా సహాయ పడుతూ వచ్చింది. ఇప్పుడు అదే పాకిస్తాన్ లో తాలిబాన్ జెండాలు ఎగురుతూ ఉండడం పాక్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పెడుతూ ఉన్నాయి.

  ఆదివారం నాడు ఇస్లామాబాద్‌లోని జామియా హఫ్సా మదర్సాలో తాలిబాన్ జెండాలు రెపరెపలాడాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తాలిబాన్‌ జెండాలను తొలగించడానికి పోలీసులను పంపినప్పటికీ అది వీలు పడలేదు. మదర్సా నిర్వాహకుడు మౌలానా అబ్దుల్ అజీజ్ ఏకంగా పోలీసులనే బెదిరించాడు. పోలీసులు వచ్చే సమయానికి అజీజ్‌ చేతిలో ఏకే 47 తుపాకీతో కనిపించాడు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు మదర్సా టెర్రస్‌పై తాలిబాన్‌ జెండాలు ఎగురవేసి నినాదాలు చేశారు. ఈ ఘటన అనంతరం అబ్దుల్‌ అజీజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాబూల్‌ను తాలిబాన్‌లు స్వాధీనం చేసుకున్న తర్వాత పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లో తాలిబాన్ జెండాలు ఎగురవేసి, ర్యాలీలు నిర్వహించారు. ఇప్పుడు ఇస్లామాబాద్ నగరం నడిమధ్యలో ఉన్న జామియా హఫ్సా టెర్రస్‌పై తాలిబాన్ జెండాలు కనిపించాయి. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి జెండాలను దించమనగా.. అందుకు వారు నిరాకరించారు. పోలీసులతో మదర్సా నిర్వాహకుడు అజీజ్‌ గొడవపడి బహిరంగంగా బెదిరించాడు. ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్‌గా పేరుగాంచిన అబ్దుల్ అజీజ్, రైఫిల్ తీసుకుని పాకిస్తాన్ తాలిబాన్ పేరుతో ఇస్లామాబాద్ పోలీసులను భయపెట్టాడు. మదర్సాకు చెందిన మహిళలు కూడా అక్కడే ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘తప్పులు జరిగే చోట మీరుండాలి. అంతేకానీ, పిల్లలను భయపెట్టడానికి మదర్సాలకు రావద్దు. ఇక్కడ చర్యలు తీసుకోవడానికి ముందుకొస్తే ఫలితం మాత్రం చాలా చేదుగా ఉంటుంది’ అని చెప్పాడు. ‘ఈ ఉద్యోగం వదిలేయండి.. మీకు అల్లా ఇంకా మంచి ఉద్యోగం ఇస్తాడు.. మీరు ఇలాగే వ్యవహరిస్తే పాకిస్తాన్ తాలిబాన్‌ మీకు గుణపాఠం నేర్పడం ఖాయం’ అని కూడా హెచ్చరించాడు.

  ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్ జెండాలను ఎగురవేయడాన్ని సహించబోమని, నేరస్థుడిని శిక్షిస్తామని ఇస్లామాబాద్ డిప్యూటీ కమిషనర్ హమ్జా షఫ్‌కత్ పేర్కొన్నారు. కొన్ని గంటల తర్వాత పోలీసులు మసీదు పైకప్పు నుండి జెండాలను తొలగించారు. ఈ సంఘటన తరువాత మౌలానా మరియు అతని సహచరులపై ఉగ్రవాద నిరోధక చట్టం మరియు పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మసీదుపై తాలిబాన్ జెండాలు ఎగురవేయడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కూడా, మసీదులో అనేక తాలిబానీ జెండాలు కనిపించాయి తరువాత వాటిని పోలీసులు తొలగించారు. మదర్సా విద్యార్ధులు తాలిబాన్లను ప్రశంసిస్తూ ఒక పాట కూడా పాడారు. లాల్ మసీదుతో సంబంధం ఉన్న జామియా హఫ్సా సంస్థ ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ కార్యక్రమంలో విద్యార్థులు ‘సలాం తాలిబాన్’ అనే పాట కూడా పాడారు.

  Trending Stories

  Related Stories