తాలిబాన్ ఫైటర్లను కూడా చంపేసిన ఐసిస్ ఉగ్రవాదులు

కాబూల్ లో జరిగిన వరస బాంబు బ్లాస్ట్స్ తర్వాత.. ఐసిస్ ఉగ్రవాదులు కాల్పులకు కూడా తెగబడ్డారు. కాబూల్‌లోని ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో 28 మంది తాలిబాన్లు మృతిచెందినట్లు తెలిపారు. బాంబు పేలుళ్ల వల్ల అమెరికన్ల కన్నా ఎక్కువ సంఖ్యలో తమవారిని కోల్పోయినట్లు తాలిబాన్లు తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌పై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా తన ఆగస్టు 31వ డెడ్‌లైన్‌ను పొడించాల్సిన అవసరం లేదని కూడా ఓ తాలిబాన్ అధికారి తెలిపారు. కాబూల్‌లో జరిగిన పేలుళ్లలో మరణించిన వారిలో 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. పేలుళ్లకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్ర సంస్థ ప్రకటించింది.
ఎయిర్‌పోర్ట్‌లో ఆత్మాహుతి దాడులను తాలిబాన్లు ఖండించారు. ఐసిస్ గ్రూప్ కాబూల్ విమానాశ్రయంపై దాడులకు పాల్పడవచ్చని తాము ముందుగానే అనుమానించామని, ఇదే విషయాన్ని అమెరికాకు కూడా చెప్పామని తాలిబాన్లు ఓ ప్రకటనలో తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతం అమెరికా దళాల ఆధీనంలో ఉన్నట్టు తాలిబాన్లు తెలిపారు. కాబూల్ ఉగ్రవాద దాడులను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఖండించారు. విమానాశ్రయం గేటు వద్ద జరిగిన పేలుడులో పెద్ద సంఖ్యలో జనం మరణించారని, క్షతగాత్రులయ్యారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. చాలామంది కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. గాయపడ్డ మహిళలు రక్తమోడుతూ రోదించడం, చిన్నారుల ఆక్రందనలతో సంఘటనా స్థలం వద్ద భీతావహ దృశ్యాలు కనిపించాయి. ఆత్మాహుతి దాడుల అనంతరం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి.