International

టీవీ, రేడియో స్టేషన్స్ ను స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు

ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి తాలిబాన్లు పట్టు సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గత ఐదు రోజులుగా, తాలిబాన్ మిలిటెంట్లు ప్రభుత్వ బలగాల నుండి దక్షిణ మరియు పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లోని మూడు ప్రధాన నగరాలు, హెరాత్, లష్కర్ గాహ్ మరియు కాందహార్‌లను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో భీకర పోరు కొనసాగుతోంది. హిందీ దినపత్రిక నవభారత్ టైమ్స్ ప్రకారం, తాలిబాన్లు ఆగస్టు 2 న (సోమవారం) లష్కర్ గాహ్‌లో ఒక రేడియో స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెల్మాండ్ ప్రావిన్స్ రాజధాని నగరమైన లష్కర్ గాహ్‌లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రేడియో, టెలివిజన్ ఆఫ్ఘనిస్తాన్ లను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి ద్వారా బెదిరింపులు, హెచ్చరికలను ప్రసారం చేయడానికి అలాగే తాలిబాన్ యొక్క వాయిస్ ఆఫ్ షరియాను ప్రచారం చేయడానికి వీటిని ఉపయోగించనున్నారు.

నగరంలోని 4 టెలివిజన్‌, 11 రేడియో స్టేషన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆఫ్ఘన్ సమాచార మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. తాలిబాన్ల నుంచి బెదిరింపులు రావడంతో ప్రసారాన్ని నిలిపివేసినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. ఓ టీవీ స్టేషన్ మాత్రమే ఇస్లామిక్ ప్రోగ్రామింగ్‌ను నిర్వహిస్తూ ప్రసారం చేస్తోందట..! యుఎస్ వైమానిక దాడులకు ప్రతీకారంగా రేడియో స్టేషన్లు స్వాధీనం చేసుకున్నట్లు కథనాలు వచ్చాయి. అనేక ప్రధాన ఆఫ్ఘన్ ప్రావిన్షియల్ రాజధానులపై తాలిబాన్‌లు దృష్టిసారించారు. తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలపై తాలిబాన్లు దాడులను తీవ్రతరం చేశారు. వాస్తవాలను ప్రచురిస్తున్న మీడియా సంస్థలను, తాలిబాన్ల అన్యాయాలను బహిర్గతం చేయడం ఉగ్రవాదులు కోరుకోరని సమాచార మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

పౌరులను అడ్డం పెట్టుకుని:

తాలిబాన్ ఉగ్రవాదులు పౌరుల ఇళ్లలో దాక్కుని వారిని రక్షణ కవచాలుగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా చాలా మంది సాధారణ పౌరులు ఆఫ్ఘన్ దళాలు చేస్తున్న దాడులకు బలవుతూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా తాలిబాన్ ఉగ్రవాదులు దాగి ఉండవచ్చని అధికారులు అనుమానించి అలాంటి అనేక ఇళ్లపై బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల తరువాత, తొమ్మిది మంది చనిపోయినట్లు తెలియగా.. ఎనిమిది మంది గాయపడిన వారిని సోమవారం లష్కర్ గాహ్ లోని ఆసుపత్రికి పంపారు. వారికి వైద్యులు చికిత్సను అందిస్తూ ఉన్నారు.

గత 72 గంటల్లో హెరాత్, కాందహార్, లష్కర్ గాహ్ నగరాల చుట్టూ తాలిబాన్ స్థానాలను లక్ష్యంగా చేసుకున్నాయని అమెరికా వైమానిక దాడులు చేపట్టిందని ఆఫ్ఘన్ సీనియర్ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. ఆగస్టు 2 న (సోమవారం) అమెరికా జరిపిన వైమానిక దాడులలో ఏడుగురు తాలిబాన్ ఉగ్రవాదులు చనిపోయారని నవభారత్ టైమ్స్ తెలపగా, హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం లష్కర్ గాహ్ నగరంలో యుఎస్ వైమానిక దాడిలో కనీసం 40 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతమైనట్లు ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 − 1 =

Back to top button