Right Angle

తాలిబన్లపై మోదీ వ్యూహమేంటి..?

విలాసవంతమైన ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షభవనంలో సింహాసనాలను పోలిన సోఫాలపై కూర్చున్న తాలిబన్లు.. అఫ్ఘనీ చాప్ లు, కాబూలీ పులావ్ లు తింటూ సరదాగా వేళాకోళమాడుకుంటున్న దృశ్యం ఒకవైపు, హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు ఏ దేశాలకు వెళుతున్నాయో కూడా తెలియని విమానాల వెంట పరుగులు తీస్తున్న ఆఫ్ఘన్ ప్రజల దయనియ స్థితి ఇంకోవైపు- ఈ రెండు ఘటనలు అంతర్జాతీయ భౌగోళిక రాజనీతిలోని క్రూరత్వాన్ని గుర్తుచేశాయి. అసలు దోషి అమెరికా హాయిగా పారిపోయింది. గాంధార రాజ్యంలో పెట్టుబడులు పెట్టిన చైనా, తిమింగళంలా మాటువేసి, కల్లోల జలాల్లో వేట ఆరంభించింది.

గుండెలు బరువెక్కించే ఆఫ్ఘన్ ప్రజల రోదనల వెనుక 170 ఏళ్ల అస్తవ్యస్త చరిత్రేంటి? సీఐఏ రూపొందిచిన Operation Cyclone కు ‘తాలిబన్ ఆవిర్భావానికి సంబంధం ఏంటి? గాంధారభూమిని రణరంగంగా మార్చడంలో రష్యా పాత్ర ఎంత? బ్రిటన్ చేసిన యుద్ధాల తాలూకు చరిత్ర ఏంటి? తాలిబన్ల విషయంలో ఎలాంటి వైఖరి తీసుకునే అవకాశం ఉంది? చైనా-తాలిబన్ మైత్రి చెడితే చైనా ఆఫ్ఘన్ గడ్డపై డ్రాగన్ పరాజయం పాలవుతుందా, గెలుస్తుందా? ఈ సంక్షోభంలో పాకిస్థాన్ కు వచ్చే ప్రయోజనమేంటి?

మౌర్యులు, కుశాణులు, హూణులు ఏలిన గాంధార రాజ్యంలో రాక్షసక్రీడ ఎలా అరంభమైందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జిబుష్ జూలై 14న ‘వాయిస్ ఆఫ్ అమెరికా’తో మాట్లాడుతూ ‘‘Mistake for Biden to Withdraw US Troops From Afghanistan’’ అంటూ వ్యాఖ్యానించాడు. పశ్చిమాసియా మొదలు మధ్య, దక్షిణాసియాలో అగ్గిరాజేయడంలో అత్యంత కీలకపాత్ర పోషించింది జార్జ్ బుష్. తాలిబన్లకు అధునాతన ఆయుధాలిచ్చి ఉసిగొల్పిన బుష్ కు ఆఫ్ఘనిస్థాన్ భవిష్యత్తుపై బెంగ కలగడమే గుంటనక్కబుద్ధికి తార్కాణం.  బుష్ పెట్టిన పెంటకారణంగానే ఆ తర్వాత వచ్చిన ఒబామా, ట్రంప్ ప్రభుత్వాలు పాలుపోని స్థితిలో అదే విధానాన్ని అవలంబించి, ఆర్థికంగా నష్టపోయాయి.

జోబైడెన్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన మంచిచెడులు ఎంచే పరిస్థితిలేదు. ఏ దిక్కూ లేక తీసుకున్న నిర్ణయంగానే భావించాలి. మూడు దశాబ్దాలుగా అమెరికా అనుసరించిన విదేశాంగ విధానంపై ఆ దేశంలోనే విమర్శలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభంలో కీలకపాత్ర పోషించే పాకిస్థాన్ నుంచి వెలువడే పత్రిక DAWN కూడా ‘‘What next for Afghanistan as Taliban rise again?’’ అంటూ ఆగస్ట్ 13న దొంగ ఏడుపును నటించింది. ఒకవైపు ‘తాలిబన్ల’కు పూర్తి మద్దతు ప్రకటించిన తర్వాత ఆ దేశానికి బెంగ ఎందుకు అన్నదే విచిత్రం. టర్కీ కేంద్రంగా పనిచేసే TRT world ఛానెల్ ప్రసారం చేసిన కథనంలో ‘‘For China, Afghanistan is more of a problem than an opportunity’’ అని పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అవకాశాల కన్నా ఆపదే పొంచి ఉందని ఈ కథనం పేర్కొంది.

చైనా ప్రభుత్వ రంగ సంస్థ metallurgical corporation of china ఆఫ్ఘన్ రాగి గనుల్లో భారీ పెట్టుబడులు పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన దేశాల్లో మొదటి స్థానంలో ఉంది. 2017-18 కాలంలో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి 70 మిలియన్ల రుణాన్ని అందించింది. చైనాకు చెందిన పశ్చిమాసియా నిపుణుడు, కౌంటర్ టెర్రరిజం ఎక్స్ పర్ట్ ప్యాంగ్ గువాంగ్ స్వయంగా  “supported by the poor people who make up more than half of the country’s population’’ అంటూ తాలిబన్ ను అభివర్ణించారు. 2008 నుంచే “Going Out” strategy భాగంగా ఆఫ్ఘనిస్తాన్ ను వ్యూహాత్మక మిత్రదేశంగా భావిస్తూ వచ్చింది.

తాలిబన్ ను ఆహ్వానించిన చైనా చాలా చిత్రంగా అమెరికా సైనిక ఉపసంహరణ విషయంలో పెదవి విరిచింది. అందుకూ కారణం లేకపోలేదు. అమెరికా బలగాలు మరింత కాలం ఉంటే తన బలమైన వేళ్లను నాటుకుని ఉండేది. సైనిక ఉపసంహరణ అనే హఠాత్పరిణామం చైనాకు కొంచెం నిరాశ కలిగించిందంటారు నిపుణులు. యుద్ధ బాధిత నిరుపేద దేశంలో పెట్టుబడులు పెట్టడమన్నది అంత శ్రేయస్కరం కాదనే అంచనా కూడా ఉంది.

అయితే చైనాకు మరో భరోసా కూడా ఉంది. మధ్య ఆసియా దేశాలతో ఆఫ్ఘనిస్థాన్ కు భౌగోళిక బంధాన్ని వాడుకుని యూరేసియా దేశాల వనరులను కొల్లగొట్టవచ్చనేది చైనా దీర్ఘకాలిక వ్యూహం. నాలుగు మధ్య ఆసియా దేశాల్లో చైనా ఇప్పటికే పెట్టుబడులు పెట్టింది.

ఆఫ్ఘన్, మధ్య ఆసియాతో పాటు దక్షిణాసియాలోని పాకిస్థాన్ ఇప్పటికే చైనా అప్పుల ఊబిలో ఉన్నాయి కాబట్టి భారత్ చుట్టూ ఒక వ్యూహాత్మక చక్రబంధాన్ని అల్లేందుకు ఈ స్థితిని ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇదే గనక జరిగితే క్వాడ్ దేశాల ఇండో-వ్యూహం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

తాలిబన్లను నరహంతకులుగా, ఆఫ్ఘనిస్థాన్ ను షైతాన్లు సంచరిస్తున్న ప్రాంతంగా చిత్రించడం వెనుక అంతర్జాతీయ కుట్రలున్నాయి. ఈ కుట్రలకు తాలిబన్ల చర్యలూ దోహదపడ్డాయి. ఈ కుట్రలకు 170 ఏళ్ల చరిత్ర ఉంది. పష్తూన్ రీజియన్ లోని ‘దురానీ’ రాచరికం బలహీన క్షణాలను లెక్కిస్తున్న రోజుల్లో ఆఫ్ఘనిస్థాన్ లోకి ప్రవేశించింది బ్రిటీష్ వలసవాదం. 1804 లో  ఢిల్లీనీ, 1839లో ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించారు బ్రిటీష్ పాలకులు. ఈ పరిణామాల గురించి రేడియో ఆఫ్ యూరప్ లో పనిచేసే జర్నలిస్ట్ అబూబకర్ సిద్దికీ రాసిన ‘‘The Pashtuns: The Unresolved Key to the Future of Pakistan and Afghanistan’’ పుస్తకంలో వివరంగానే రాసే ప్రయత్నం చేశారు.

ఆఫ్ఘన్-పాకిస్థాన్ ప్రావిన్సుల్లోని దుర్బేద్యమైన కొండల్లో ఉండే గిరిజన తెగలు బ్రిటీష్ దాడిని ప్రతిఘటించారు. ఈ క్రమంలో సంప్రదాయక ఆయుధాల నుంచి తుపాకులు, ఫిరంగుల వాడకం మొదలుపెట్టారు. అట్లా 1939-42 వరకు ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం నాలుగేళ్లు సాగింది ఈ యుద్ధం లో బ్రిటీష్ పాలకులు 20వేల మంది సైనికులను కోల్పోయి, ఆఫ్ఘన్ గిరిజన తెగలను ప్రాధేయపడి పారిపోయారు. రెండో ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధంలో గాంధారదేశం బ్రిటీషు పాలనలోకి వెళ్లిపోయింది.

1979-89 మధ్య జరిగిన సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం, 1989-92 ఆఫ్ఘన్ అంతర్యుద్ధం, 1996-2001 ఆఫ్ఘన్ యుద్ధం, 2001, అక్టోబర్ 7న మొదలైన అమెరికా-తాలిబన్ యుద్ధం రెండు దశాబ్దాలుగా కొనసాగి 2021 జూలైలో అమెరికా సేనల పలాయనంతో ముగిసింది. ఈ ప్రస్తావన ఉద్దేశం ఏంటంటే…ప్రపంచంలో యుద్ధంలో ఆరితేరిన బ్రిటన్, రష్యా, అమెరికాలు స్వయంగా ఆధునిక యుద్ధకళను తాలిబన్ సేనలకు నేర్పించాయి. నిప్పులు చెరిగే ఆటోమేటిక్ రైఫిళ్లనూ, కలష్నికోవ్ తళతళను చూపించి ఊరించాయి.

1979-89 అంతర్యుద్ధంగా చరిత్రలో మనకు కనిపించే మారణకాండకు అమెరికా నిఘా సంస్థ పథక రచన చేసింది. Operation Cyclone అంటూ అందమైన పేరు తగిలించింది. ఈ ఆపరేషన్ సైక్లోన్ కారణంగా పుట్టుకువచ్చిందే ‘తాలిబన్’ సంస్థ.

ఇదే ఏడాదిని ఎన్నుకోవడానికి కారణముంది. ఎనభయ్యో దశకం ఉత్తరార్ధంలో సోవియట్ రష్యా పరిస్థితులు క్రమంగా చేజారుతూ వచ్చాయి. సోవియట్ పతనం ఖాయమని సీఐఏ వేగులు పసిగట్టారు.

సరిగ్గా ఇదే సందర్భాన్ని ఎంచుకుని ఆఫ్ఘనిస్తాన్ లోని రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూల్చేస్తే పశ్చిమాసియా చమురు వనరులపై పట్టుపెంచుకోవచ్చని భావించి తాలిబన్ ను ఏర్పాటు చేసింది. అమెరికా పాత్రికేయుడు steve coll రాసిన ‘‘Directorate S: The C.I.A. and America’s Secret Wars in Afghanistan and Pakistan’’ పుస్తకంలో అమెరికా కుట్రలను సవివరంగానే నిరూపించే ప్రయత్నం చేశారు.

దక్షిణ, మధ్య, పశ్చిమ దిక్కుల్లోని ఆసియా దేశాలు భవిష్యత్తులో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలని హెచ్చరిస్తున్నాయి ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలు. అఫ్ఘన్ వాసులను చివరకు ‘దేశంలేని ప్రజలు’గా మార్చిన దయనీయ స్థితికి కారణమైన శ్వేతసౌధం మరక అంటకుండా బలగాలను ఖండాలు దాటించింది.

పేద దేశాలపై విలువైన పరిశోధనలు చేసిన ప్రపంచంలోని వందమందిలో ఒక అరుదైన మేధావి అని, అమెరికా యూనివర్సిటీల్లో చదువుకున్నాడని పేరున్న…ఆప్థనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రాణాల మీదకు రాగానే దేశప్రజలను వదిలేసి చీకట్లో రహస్య అనామక దేశానికి జారుకున్నాడు.

అంతర్జాతీయ పత్రికలు ఆఫ్ఘనిస్థాన్ భవిష్యత్తుపై ఎక్కడ లేని జాలి చూపిస్తున్నాయి. బెంగను ప్రదర్శిస్తున్నాయి. మొన్నటిదాకా భూతల స్వర్గంలా ఉన్న ‘ఖొరసాన్’ తాలిబన్లు రాగానే రాక్షస రాజ్యాంగ మారిందని వ్యాఖ్యానిస్తున్నాయి. తాలిబన్ల రాకవల్ల హక్కుల హరణ జరగదని కాదు, ఆఫ్ఘన్ల భవిష్యత్తు అంధకారం కావడానికి తాలిబన్లు మాత్రమే బాధ్యులు కాదని ఉధ్దేశం. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ క్రీడలో, అగ్రదేశాల చదరంగంలో తాలిబన్లు విలువైన అశ్వాలు, వాటిని తోలుతున్న సాయుధ భటులు అని మాత్రమే గుర్తించాలి. జియోపాలిటిక్స్ ను శాసిస్తున్న కింగ్‌, క్వీన్‌, రాక్స్‌, బిషప్స్‌ ఊసులేకుండా పోవడమే వర్తమాన చరిత్రలోని విషాదం.

తాలిబన్ల దురాగతాల నేపథ్యాన్ని ఎవరూ నిరాకరించలేరు. అయితే వర్తమానంలో నిలబడి అంచనా వేస్తే భారత్ లాంటి దేశం తాలిబన్ తో ఎలా వ్యవహరించాలి అనే సందేహం రావడం సహజం. తాలిబన్లు బలంగా రుద్దే మతాచారాలను ఎవరమూ హర్షించలేం. అయితే ఆఫ్ఘన్ గడ్డపై పొంచి ఉన్న చైనాను ఎలా నిలువరించాలి అనే ప్రశ్న అనేక వ్యూహాత్మక అంశాలను ముందుకు తెస్తుంది.

క్వాడ్ దేశాల ఇండో-పసిఫిక్ వ్యూహం, దక్షిణ చైనా సముద్ర వివాదం, పాకిస్థాన్ లో చైనా పాగా, మధ్య ఆసియాలో డ్రాగన్ ప్రాబల్యం నేపథ్యంలో భారత్ తాలిబన్లతో సఖ్యంగా ఉండటం వల్ల మాత్రమే చైనా ప్రయోజనాలను దెబ్బతీయగలదు. తాలిబన్ ఇస్లామిక్ ధోరణి కారణంగా ఆఫ్ఘనిస్తాన్ తో వైరం పెట్టుకుంటే అంతిమంగా లాభపడేది చైనా.

ఆఫ్ఘనిస్థాన్ లో చైనా తన పట్టు పెంచుకుంటే రాబోయే విపరిణామాలను సులభంగానే ఊహించవచ్చు. గత ఏడాది మే 18న తాలిబన్ సంస్థ ‘‘కశ్మీర్ భారత్ అంతర్గత సమ్య. మేం తలదూర్చం’ అంటూ స్వయంగా వెల్లడించింది. పెద్ద శతృవును నిలువనీడ లేకుండా చేయాలంటే కొన్ని ప్రతీపశక్తులను వ్యూహాత్మక కారణాలరీత్యా తాత్కాలికంగా భరించాలి. ఇది భౌగోళిక రాజకీయ చరిత్ర చెపుతున్న సూత్రం.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

18 − two =

Back to top button