International

ఊహించిన దారుణాలే.. మహిళా వాలీబాల్ ప్లేయర్ తల నరికిన తాలిబాన్లు

ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు తమ చేతుల్లోకి తీసుకున్నాక ఎటువంటి దారుణాలైనా జరగొచ్చని ముందే ప్రపంచ దేశాలు ఊహించాయి. ముఖ్యంగా మైనారిటీలకు అక్కడ ఏ మాత్రం రక్షణ ఉండకపోవచ్చని.. మహిళలపై ఎన్నో కఠిన ఆంక్షలను తీసుకుని వస్తారని అందరూ భావించారు. అలాంటి ఘటనలే ఇప్పుడు తాలిబాన్ పాలనలో కొనసాగుతో వస్తున్నాయి. తాజాగా ఓ మహిళా వాలీబాల్ ప్లేయర్ తల నరికిన ఘటన పట్ల ప్రపంచం మొత్తం నివ్వెరబోతోంది.

ఆఫ్ఘనిస్తాన్ మహిళా జాతీయ వాలీబాల్ జట్టు సభ్యురాలు ‘మహ్జుబిన్ హకీమి’ ని తాలిబాన్లు తల నరికి చంపినట్లు ఇండిపెండెంట్ పర్షియన్ నివేదించింది. అండర్-19 జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి మహ్జాబిన్ హకీమిని తల నరికి, అత్యంత పాశవికంగా హతమార్చారు.

ఆఫ్ఘనిస్తాన్ మహిళా జాతీయ జట్టు కోచ్‌లలో ఒకరైన సురాయ అఫ్జలీ మాట్లాడుతూ మహ్జుబిన్ హకీమిని అక్టోబర్‌లోనే చంపేసినట్లు తెలిపారు. ఈ హత్య ఎప్పుడు జరిగిందో హకీమి కుటుంబంలో ఎవరికీ తెలియదు. ఆగస్టు 2021 లో ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిస్ట్ గ్రూప్ తాలిబాన్ చేతుల్లోకి వెళ్ళకముందు ఆమె కాబూల్ మునిసిపాలిటీ వాలీబాల్ క్లబ్ కోసం ఆడేది. ఆమె మంచి టాలెంటెడ్ క్రీడాకారిణి అని ఆమె కోచ్ తెలిపారు. మహ్జుబిన్ ను తాలిబాన్లు చంపేసినా దానిని బహిరంగపరచలేదు.. ముఖ్యంగా ఆమె కుటుంబ సభ్యులు దాని గురించి మాట్లాడవద్దని తాలిబాన్లు బెదిరించారట. తాలిబాన్లు మహిళా అథ్లెట్ల కోసం వేట కొనసాగించారు.. పలువురు మహిళల ఇళ్లకు వెళ్లారు. మీడియా ప్రోగ్రామ్‌లలో కనిపించిన మహిళా అథ్లెట్లకు తీవ్రమైన ముప్పు ఉందని మహిళా కోచ్ చెప్పారు. మహిళా వాలీబాల్ జట్టులోని ఇద్దరు సభ్యులు మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ నుండి తమంతట తాముగా వెళ్లగలిగారని, మిగిలిన మహిళా అథ్లెట్లు తాలిబాన్ల నుండి తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. తాలిబాన్లు ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించుకున్న నేపథ్యంలో ఇద్దరు క్రీడాకారిణులు మాత్రమే దేశాన్ని విడిచి వెళ్లగలిగారని… మిగిలిన వారికి వెళ్లడం సాధ్యం కాలేదని చెప్పారు. మహ్జుబిన్ కూడా పారిపోయి ఉంటే ప్రాణాలతో బతికి ఉండేదని అన్నారు. తాలిబాన్లు, తాలిబాన్ అనుచరులు మహిళా అథ్లెట్ల బంధువులను బెదిరించారని దేశం దాటి బయటకు వచ్చేసిన మహిళా అథ్లెట్లు తెలిపారు.

ఆఫ్ఘన్ జాతీయ మహిళా వాలీబాల్ జట్టును మొదట 1978 లో స్థాపించారు. తాలిబాన్ పాలన తరువాత జరిగిన పౌర యుద్ధం కారణంగా 1992 మరియు 2002 మధ్య జట్టు కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ జట్టు అనేక అంతర్జాతీయ పోటీలలో పాల్గొంది. ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజలు కూడా మద్దతు పలికారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా మంది మహిళా అథ్లెట్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. పాకిస్తాన్ లేదా ఇతర దేశాలకు పారిపోయారు.

Related Articles

Back to top button