More

    తెలంగాణలో సినిమా థియేటర్ల మూసివేత అంటూ జరుగుతున్న ప్రచారం.. మంత్రి స్పందన

    ప్రజల్లో ఒమిక్రాన్ వేరియంట్ భయం వెంటాడుతూ ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా తెలంగాణలో మళ్లీ సినిమా థియేటర్లు మూసివేస్తున్నారంటూ ప్రచారం కొనసాగుతూ ఉంది. ఈ ప్రచారంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. అలాంటి అపోహలు నమ్మవద్దని స్పష్టం చేశారు. సినిమా హాళ్ల మూసివేత, థియేటర్లలో 50 శాతం ప్రేక్షకులు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని తెలిపారు. ప్రజలు థియేటర్లలో సినిమాలు చూడాలని పిలుపునిచ్చారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తలసాని తెలిపారు. కొన్ని సమస్యలు పెండింగ్‌లో వున్నాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కొత్త వేరియంట్ వస్తుందని ప్రచారం జరుగుతోందని.. అయితే ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో వుందని భయపడాల్సిన అవసరం లేదని తలసాని చెప్పుకొచ్చారు. థియేటర్ల మూసివేత, 50 శాతం ప్రేక్షకులు అని చెప్పడం అవాస్తవమని.. ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలని.. కరోనా వల్ల రెండేళ్లుగా సినీ పరిశ్రమ ఇబ్బందులు పడుతోందని మంత్రి అన్నారు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో ఒమిక్రాన్‌ వస్తోందని అప్రమత్తంగా ఉండాలని దర్శక నిర్మాతలకు చెప్పానని తలసాని అన్నారు. సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడ్డాయని సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా వుంటుందని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. టికెట్ల ధరలు తగ్గిస్తారన్న విషయంపై మాట్లాడుతూ ఎక్కడో ఎవరో తగ్గించారని.. మేం తగ్గించమని స్పష్టం చేశారు. సినిమా టికెట్ల ధరల సవరణ నిమిషాల్లో జరిగే పనికాదన్నారు.

    మంత్రి తలసానిని టాలీవుడ్ ప్రముఖులు మాసాబ్ ట్యాంక్ లోని ఆయన కార్యాలయంలో కలిశారు. నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, రాధాకృష్ణ, సునీల్ నారంగ్, ఎర్నేని నవీన్, వంశీ, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తలసానితో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై ఆయనతో చర్చించారు. కరోనా పరిస్థితులు, థియేటర్లలో ఆంక్షలపై జరుగుతున్న ప్రచారం, సినిమా టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై చర్చించినట్లు తెలుస్తోంది.

    Trending Stories

    Related Stories