మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులను విచారిస్తున్న ఈడీ

0
668

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఐటీ, ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలకు చెందిన గ్రానైట్ పరిశ్రమపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ కు సంబంధించి ఆధారాలు దొరికాయని అధికారులు చెబుతున్నారు. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ సోదరులను ఈడీ ప్రశ్నించడం ఆసక్తి రేపుతోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులైన తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మనీలాండరింగ్ వ్యవహారంలోనూ.. క్యాసినో, హవాలా కేసుల్లో ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. గత నాలుగేళ్ల ఆర్థికలావాదేవీలపై ఆరా తీస్తున్నారు. వారికి కొద్ది రోజుల కిందట ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్‌తో లావాదేవీలు నిర్వహించిన వారి వివరాల్లో తలసాని సోదరుల లావాదేవీలు ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనిపైనే విచారణకు వారిని పిలిచామన్నారు. తలసాని సోదరుల వ్యాపారాలకు సంబంధించిన నాలుగేళ్ల ఆర్థిక లావాదేవీల వివరాలు తీసుకురావాలని ఈడీ ఆదేశించినట్లుగా తెలుస్తోంది.