సెమీస్ కు మరింత చేరువైన పాక్.. బంగ్లాదేశ్ అవుట్..!

0
759

శుక్రవారం నాడు టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ ఎన్నో మలుపులు తిరిగింది. ఆఖరి బంతి వరకూ రెండు జట్లు కూడా పోరాడాయి. సూపర్-12 గ్రూప్-1లో భాగంగా షార్జా మైదానంలో ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసింది. లోయరార్డర్ లో వచ్చిన నికొలాస్ పూరన్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 22 బంతులు ఎదుర్కొన్న పూరన్ 1 ఫోర్, 4 సిక్సర్లు బాదాడు. రోస్టన్ చేజ్ 39 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ (4), ఎవిన్ లూయిస్ (6), హెట్మెయర్ (9), ఆండ్రీ రస్సెల్ (0) విఫలమయ్యారు. పొలార్డ్ 14 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ 2, ముస్తాఫిజూర్ రహమాన్ 2, షోరిఫుల్ ఇస్లామ్ 2 వికెట్లు తీశారు. ఇక ఛేజింగ్ లో బంగ్లాదేశ్ ఒకానొక దశలో గెలిచేలా కనిపించినా.. ఆఖర్లో బోల్తా పడింది. బంగ్లాదేశ్ సునాయాసంగా గెలుస్తుందని అందరూ భావించారు. వెస్టిండీస్ ఫీల్డర్లు అనేక క్యాచ్ లు వదిలి బంగ్లా బ్యాట్స్ మెన్ కు సహాయం చేశారు. ఆఖరి బంతిని రస్సెల్ బౌలింగ్ లో నాలుగు పరుగులు కొడితే విజయం సాధిస్తారని భావించగా.. బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా కొట్టలేకపోవడంతో విజయం విండీస్ ను వరించింది. అంతకుముందు డ్వెయిన్ బ్రేవో అద్భుతమైన ఓవర్లు వేయడంతో విండీస్ మ్యాచ్ లో పట్టు సాధించగలిగింది. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో లిటన్ దాస్ 44 పరుగులు చేయగా, కెప్టెన్ మహ్మదుల్లా 31 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. విండీస్ బౌలర్లలో రాంపాల్, హోల్డర్, రస్సెల్, హోసీన్, బ్రావో తలో వికెట్ తీశారు. సూపర్-12 దశలో గ్రూప్-1లో 3 మ్యాచ్ లు ఆడిన విండీస్ కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్ లో ఓడిపోవడంతో బంగ్లాదేశ్ సెమీస్ చేరడం అసాధ్యమే..!

https://twitter.com/ICC/status/1454229081319481352/photo/1

గ్రూప్-2 లో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ మరో విజయాన్ని సొంతం చేసుకుని.. దాదాపు సెమీ ఫైనల్ బెర్త్ ను సొంతం చేసుకుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దుబాయ్ లో తలబడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఓ దశలో 76 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకుని ఆఫ్ఘన్ జట్టు కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ నబీ, గుల్బదిన్ జోడీ జట్టును ఆదుకుంది. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో స్కోరు 147 పరుగులు అయింది. నబీ 35, గుల్బదిన్ 35 పరుగులతో అజేయంగా నిలిచారు. నజీబుల్లా జాద్రాన్ 22, కరీమ్ జన్నత్ 15 పరుగులు సాధించారు. పాక్ బౌలర్లలో ఇమాద్ వాసిమ్ 2, షహీన్ అఫ్రిది 1, హరీస్ రవూఫ్ 1, హసన్ అలీ 1, షాదాబ్ ఖాన్ 1 వికెట్ తీశారు.


148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఈ మ్యాచ్ లో కాస్త కష్టపడాల్సి వచ్చింది. చివరి రెండు ఓవర్లలో పాక్ విజయానికి 24 పరుగులు అవసరం కాగా అసిఫ్ అలీ చెలరేగిపోయాడు. కరీంజనత్ వేసిన 19వ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలచిన అసిఫ్, ఆ తర్వాత మూడో బంతిని, ఐదో బంతిని, ఆరో బంతిని సిక్సర్ కొట్టి పాక్ కు విజయాన్ని అందించాడు. మొత్తంగా 7 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అసిఫ్ అలీ 4 సిక్సర్లతో 25 పరుగులు చేశాడు. కెప్టెన్ బాబర్ ఆజం 51, ఫకర్ జమాన్ 30 పరుగులు చేశారు. అసిఫ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.18 టీ20ల తర్వాత ఆఫ్ఘన్‌కు యూఏఈలో ఇది తొలి పరాజయం. ఈ విజయంతో పాకిస్తాన్ సెమీస్ కు మరింత చేరువైంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here