టీ20 ప్రపంచ కప్ ను తరలించేశామని చెప్పేసిన బీసీసీఐ

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో టి20 ప్రపంచకప్ జరుగుతుందని బీసీసీఐ తాజాగా ధృవీకరించింది. బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ టి20 ప్రపంచకప్ ను తరలించడానికి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) కు బీసీసీఐ తెలిపింది. టోర్నమెంట్‌ను యుఏఈకి తరలిస్తున్నామని.. ఈ విషయాన్ని ఐసిసికి తెలియజేస్తామని షా సోమవారం మధ్యాహ్నం చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ తాత్కాలికంగా రద్దవ్వగా.. ఇప్పుడు మరో టోర్నీపై ఈ ప్రభావం పడింది. భారత్ వేదికగా జరగాల్సిన టీ-20 వరల్డ్ కప్ వేదిక మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌లో టీ20 వరల్డ్‌కప్ నిర్వహించలేమని, యూఏఈలో టోర్నీ జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది.
టోర్నీ నిర్వహణకు సంబంధించి నిర్ణయం చెప్పడానికి సోమవారం వరకూ బీసీసీఐకి ఐసీసీ గడువు విధించింది. సోమవారం బీసీసీఐ ఆఫీస్ బేరర్ల మధ్య సమావేశం జరిగింది. ఈ విషయాన్ని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. రానున్న 2-3 నెలల్లో ఏం జరుగుతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని టోర్నీని యూఈఏకి తరలిస్తామని ఐసీసీతో చెప్పాలని బీసీసీఐ నిర్ణయించిందని తెలిపారు. ఈ మెగా టోర్నీని భారత్‌లోనే నిర్వహించాలని భావించామని అన్నారు. టోర్నీ తేదీల్లో ఎలాంటి మార్పులు లేవని.. ఐపీఎల్ ముగియగానే టి20 ప్రపంచకప్ ప్రారంభమవుతుందని అన్నారు. క్వాలిఫయర్స్ మాత్రం ఒమన్‌లో జరగొచ్చని అన్నారు. టోర్నీలో మ్యాచ్‌లు మాత్రం దుబాయ్, అబుదాబి, షార్జాల్లో జరుగుతాయి అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ఈ టోర్నీని యూఏఈలోనే నిర్వహిస్తామని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కూడా మీడియాకు తెలిపారు.