ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ సోమవారం ప్రభుత్వానికి లేఖ రాశారు. 1995 బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆరు సంవత్సరాల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన వీఆర్‌ఎస్ స్వచ్ఛంద పదవీ విరమణ కోరారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వానికి రాసిన రెండు పేజీల లేఖలో ప్రవీణ్ కుమార్ పలు విషయాలను ప్రస్తావించారు. 26 ఏళ్ల పాటు పోలీస్ విభాగంలో పని చేశానని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ సందర్భంగా తన పదవీకాలానికి సంబంధించిన కొన్ని విషయాలను లేఖలో ప్రస్తావించారు. తన రాజీనామా లేఖను తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు పంపించినట్టు ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఓవైపు బాధ, మరోవైపు ఆనందం కలగలిసిన భావాల నడుమ తన 26 ఏళ్ల కెరీర్ కు గుడ్ బై చెబుతున్నానని తెలిపారు. ఐపీఎస్ అధికారి అవ్వాలనేది తన ఆశయం అని, ఆ స్థాయిని అందుకున్న తాను ఇప్పుడు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నానని.. ఇదేమంత సులభమైన నిర్ణయం కాదని అన్నారు.
బంధుమిత్రులు, గురువులు, సహచరులు, విద్యార్థులు, ప్రజానీకం, ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు ఇలా ఎందరో తన వ్యక్తిత్వాన్ని మలిచారని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు. తనకు ఎప్పుడూ వెన్నంటి ఉన్న కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలిపారు ఆయన. బడుగు, బలహీన వర్గాలకు సేవలు అందించేలా తనకు అవకాశాలు ఇచ్చిన ఉమ్మడి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు అంటూ తన లేఖలో పేర్కొన్నారు. తన శేష జీవితాన్ని మహాత్మా పూలే దంపతులు, అంబేద్కర్, కాన్షీరామ్ వంటి మార్గదర్శకుల ఆశయాలకు అనుగుణంగా కొనసాగిస్తానని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.

స్వేరో ప్రవీణ్ కుమార్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రతిజ్ఞ చేయడం అత్యంత వివాదాస్పదమైన సంగతి తెలిసిందే..! హిందూ దేవుళ్లపై స్వేరో సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించి వివాదాల్లో ఇరుక్కున్నారు. హిందూ దేవుళ్లను పూజించం అంటూ చేయించిన ప్రతిజ్ఞ చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అత్యున్నత పోస్టులో ఉండి ఆయన వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు. ఆయన వివాదాస్పదంగా ప్రవర్తిస్తూ ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తూ వచ్చింది. హిందూ దేవుళ్లన్నా, హిందూ సమాజం అన్నా ద్వేషాన్ని నూరిపోస్తున్నారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందూ సంఘాల నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం దాకా వెళ్ళింది.

