More

    దేవాదాయశాఖను భ్రష్టు పట్టిస్తున్నారు: శ్రీస్వరూపానందేంద్రస్వామి

    ఆంధ్రప్రదేశ్‎లో దేవాదాయశాఖ తీరుపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి మండిపడ్డారు. అధికారులు అంతర్గత కలహాలతో దేవాదాయ శాఖను భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రాబల్యం కోసం అధికారులు పాకులాడుతున్నారని అన్నారు. సింహాచలంలో ఎండోమెంట్ జేఏసీ నిర్వహించిన దేవాదాయశాఖ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి స్వరూపానందేంద్రస్వామి హాజరయ్యారు. దేవాదాయశాఖకు డిప్యుటేషన్‎పై రెవెన్యూశాఖ నుంచి వస్తున్న అధికారుల వ్యవహార శైలిపై ఉద్యోగులు ఈ సమావేశంలో చర్చించారు. తమ ఆవేదనను స్వరూపానందేంద్రస్వామి దృష్టికి తీసుకెళ్ళారు.పెరుగుతున్న భూవివాదాలు, భూకబ్జాల దృష్ట్యా దేవాదాయశాఖలో రెవెన్యూ ఉద్యోగుల సేవలు అవసరమేనని ఈ సందర్భంగా స్వరూపానందేంద్రస్వామి అన్నారు. అలాగని దేవాదాయశాఖ ఉద్యోగస్తులను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. దేవాదాయశాఖలో అధికారుల సంఖ్య తక్కువగా ఉందని, 12 ఏళ్ళుగా ప్రమోషన్లకు నోచుకోకపోవడం శోచనీయమన్నారు. కోర్టు వ్యాజ్యాలను పక్కనపెట్టి ఉద్యోగస్తులంతా ఏకతాటిపైకి వస్తే ప్రభుత్వంతో మాట్లాడి పదోన్నతులు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని స్వరూపానందేంద్రస్వామి ఉద్యోగులకు హామీనిచ్చారు. ఈ సమావేశంలో దేవాదాయ, ధర్మాదాయశాఖ ఉన్నతాధికారులు ఆజాద్‌, సురేష్, విజయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

    Trending Stories

    Related Stories