ఇటీవలి కాలంలో బాలీవుడ్ సినిమాలు భారీ స్థాయిలో ఫ్లాప్ లను మూటగట్టుకుంటూ ఉన్నాయి. ఓ వైపు చెత్త సినిమాలను చూడడానికి బాలీవుడ్ జనాలు థియేటర్లకు రాకుండా ఉండగా.. మరో వైపు బాయ్ కాట్ ట్రెండ్ కూడా సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దక్షిణాది చిత్రాలను భారీగా చూసేస్తున్నారు బాలీవుడ్ జనాలు. ‘బాయ్‌కాట్’ ట్రెండ్‌పై బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ స్పందించింది. కొందరు పనిగట్టుకొని బాలీవుడ్‌ను నాశనం చేయాలని చేస్తున్నారని, ఇందు కోసం ప్రత్యేకంగా కొందరు పరితపిస్తూ ఉన్నారని ఆరోపించింది. ట్వీట్లు, ట్రోల్స్ చేసినందుకు కొందరికి ఆదాయం కూడా దక్కుతోందని ఆరోపించింది స్వరా. ఒకే వ్యక్తి వంద సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తాడని, అందులో కొన్ని ఏజెన్సీలు పాల్గొంటాయని.. ఇది అందరికీ తెలిసిన విషయమేనని.. ఇది కేవలం పూర్తిగా కృత్రిమమని చెప్పుకొచ్చింది. అయితే ప్రజలు నిజంగానే జరుగుతోందని భావిస్తున్నారని పేర్కొంది.
బాయ్‌కాట్ అనేది సినిమా వసూళ్లపై ఎంత మేరకు ప్రభావం చూపుతుందో తెలియదని.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి చెందిన సమయంలో ఆయన మరణాన్ని వ్యక్తిగతంగా తీసుకొని తమ ప్రయోజనాలను వాడుకునే ప్రయత్నం చేశారని విమర్శించింది. సినిమాలు ఆడకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చని.. ప్రజల అభిరుచులు మారుతున్నాయని, కుటుంబ సమేతంగా ప్రజలు థియేటర్లో సినిమాలు చూడాలంటే భయపడుతున్నారన్నారు. ప్రస్తుతం ప్రజల వద్ద డబ్బు లేకపోవడం పెద్ద విషయమని, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారన్నారు. అందరూ ఫ్లాప్ సినిమాల గురించి మాట్లాడుతున్నారే కానీ.. గంగుబాయ్ కతియావాడి, భూల్ భూలయ్య-2 సినిమాలు హిట్ అయ్యాయని, వాటి గురించి ఎవరూ మాట్లాడడం లేదని తెలిపింది.