More

    LDF పై ‘గోల్డ్ బాంబ్’..!
    విజయన్ లింకును బయటపెట్టిన స్వప్న సురేష్

    కేరళ సీఎం పినరయి విజయన్ కు ఈసారి ఎన్నికల్లో కష్టాలు తప్పేట్టు లేదు. గోల్డ్ స్కామ్ ఆయనను వెంటాడుతూనేవుంది. గోల్డ్ స్కామ్ తో పినరయికి సంబంధం ఉందని.. ఇప్పటికే విపక్ష పార్టీలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రధాన నిందుతురాలు స్వప్న సురేష్ నోరువిప్పింది. సీఎం పినరయికి గోల్డ్ స్కామ్ తో సంబంధం వుందని దర్యాప్తులో వెల్లడించింది. స్మగ్లింగ్‌లో సీఎం పినరయ్ విజయన్ పాత్ర కూడా ఉందని, ఆయన నిండా మునిగారని కస్టమ్స్ అధికారులకు చెప్పారు.

    సీఎం విజయన్‌, స్పీకర్‌ పీ శ్రీరామకృష్ణన్‌తో పాటు ముగ్గురు కేబినెట్‌ మంత్రులకు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో ప్రమేయం ఉందని కస్టమ్స్‌ శాఖ కేరళ హైకోర్టుకు నివేదించింది. సీఎం పినరయి విజయన్‌కు అరబిక్‌ మాట్లాడటం, అర్ధం చేసుకోవడం రాని క్రమంలో కాన్సులేట్‌ జనరల్‌, ముఖ్యమంత్రి మధ్య సాగిన సంప్రదింపులకు స్వప్నా సురేష్‌ మీడియేటర్‌గా వ్యవహరించేవారని, ఈ ఒప్పందంలో ముఖ్యమంత్రి, మంత్రులు కోట్ల రూపాయల కమిషన్‌ పొందారని స్వప్నా సురేష్‌ స్టేట్‌మెంట్‌ వెల్లడించిందని కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

    తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు వస్తున్న పార్శిల్‌లో 15 కోట్లు విలువచేసే 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం అప్పట్లో కేరళను కుదిపేసింది. జాతీయ భద్రత నేపథ్యంలో ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు. ఈ వ్యవహారంలో కేరళ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ ను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది. ఆ తర్వాత విచారణలో అనేక విషయాలు బయటికొచ్చాయి. తాజాగా సీఎం పేరును కూడా ఆమె బయటపెట్టడంతో కేసు కీలక మలుపు తీసుకున్నట్టయింది.

    ఇదిలావుంటే, ఈ కుంభకోణంలో సీఎం పినరయి విజయన్ తరఫున ప్రధాన పాత్ర పోషించిన నాటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శివశంకర్ కు సుప్రీం కోర్టు నోటీసులు మంజూరు చేసింది. ఈ కేసులో వాదనలు విన్న జస్టిస్ భూషణ్.. శివశంకర్ ఇప్పటికే బెయిల్ మీద బయట వున్నాడని.. ఇప్పుడు హైకోర్టు తీర్పు విషయంలో కలుగజేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

    ఎట్టకేలకు, అంతా ఊహించినట్టే.. గోల్డ్ స్కామ్ లో సీఎం పినరయి ప్రమేయం రుజువుకావడం.. విపక్షాలకు ఆయుధంగా మారింది. ప్రధాన ప్రతిపక్షం యూడీఎఫ్ నాయకులు విజయన్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల మాట్లాడుతూ.. చివరకు తాము చెప్పిందే నిజమైందని అన్నారు. అటు బీజేపీ నేతలు సైతం విజయన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పినరయి విజయన్.. ముఖ్యమంత్రి పీఠానికి చెడ్డపేరు తెచ్చారని మండిపడుతున్నారు. సరిగ్గా ఎన్నికలకు నెలరోజుల ముందు కేరళ హైకోర్టు ఇచ్చిన షాక్ తో.. ఎల్డీఎఫ్ నేతలంతా దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు.

    Trending Stories

    Related Stories