వివేకానందుడి జయంతి.. ‘యువజనోత్సవం’ ఎలా అయింది.. ఆయన టీమ్‎లో మనం ఉన్నామా..?

0
883

జనవరి 12.. మన దేశ యువజన దినోత్సవం..! నేషనల్ యూత్ డే..! ఇంతకీ, జనవరి 12వ తేదీనే మనం ఎందుకు ఎంచుకున్నాం..? ఆ రోజున యువతీయువకులకి బాగా ఇష్టమయ్యే ఏ సినిమా హీరోనో,.. హీరోయినో జన్మించలేదు. పోనీ ఏ స్టార్ క్రికెటరో.. పుట్టాడా అంటే.. అదీ లేదు..! కనీసం జనవరి 12న మన దేశంలో ఏ చెప్పుకోదగ్గ రాజకీయ నాయకుడు కూడా జన్మించలేదు..! అయినా మనం అదే రోజున జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం..! అందుకు కారణం.. వార్ధక్యమే తెలియని.. జ్ఞాన వృద్ధుడు.. స్వామి వివేకానంద..!

1863 జనవరి 12న ఆనాటి కలకత్తా నగరంలో అవతరించిన వివేకానందుడు మనందరికీ తెలిసిన వాడే..! దురదృష్టవశాత్తూ, కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఆయనెవరో అస్సలు తెలియని వారు కూడా మన దేశంలో ఉండేవారు. ఇప్పటికీ ఆయన పేరు కూడా తెలియని జనం మన సువిశాల భారతదేశంలో ఉండవచ్చు. కానీ, అదృష్టవశాత్తూ అత్యధిక శాతం మందికి క్రమంగా స్వామీజీ తెలుస్తున్నారు. దైవ సంకల్పం కారణంగా ఆ కారణ జన్ముడి విషయాలు, విశేషాలు విస్తృతంగానే ప్రచారం అవుతున్నాయి. అయితే, ఇదంతా ఆనందపడాల్సిన సంగతే అయినా.. ఇప్పటికీ.. స్వామీజీ జన్మించి 160 సంవత్సరాలు పూర్తి కావొస్తోన్నా.. ఆయన పేరు తప్ప మరేమీ తెలియని దుస్థితిలో కూడా భారతదేశం ఉందని ఒప్పుకోక తప్పదు..!

అసలు స్వామి వివేకానంద ఎవరు..? ఆయన జయంతి ‘యువజన దినోత్సవం’ ఎలా అయింది..? ఎందుకు అయింది..? యువతకు.. ఒక కాషాయధారి అయిన సన్యాసితో.. ఏం పని..? ఈ ప్రశ్నలకు మనం సమాధానాలు అన్వేషిస్తే.. వివేకానంద అనే ఒక అద్భుతం మన కళ్ల ముందు ఆవిష్కృతం అవుతుంది..!

వివేకానంద కేవలం 39 ఏళ్లే ఈ భూమ్మీద భౌతిక దేహంతో సంచరించిన ఒక యువ సన్యాసి. ఆయనకు ముసలితనం అంటే ఏంటో తెలియదు. 40 ఏళ్లు నిండకుండానే మహా సమాధి పొందినందుకు.. ఆయనని మనం యువ సన్యాసి అనటం లేదు..! ఓ కవి చెప్పినట్టు.. కొందరు యువకులు పుట్టుకతోనే వృద్ధులు. వివేకానందుడు అటువంటి నీరస, నిరుత్సాహ పూరిత ముసలి యువతకి సంపూర్ణంగా వ్యతిరేకం..! ఆయన సంసారాన్ని పరిత్యజించి.. కాషాయం కట్టి ఊరూరా తిరిగిన పరివ్రాజకుడే అయ్యి ఉండవచ్చు. కానీ, ఆయన అత్యధిక హిందూ సాధుసత్పురుషుల వంటి వాడు కాదు. భగవద్గీత కంటే ముందు ఫుట్‎బాల్ చేత పట్టుకుని శరీర ధారుఢ్యం సంపాదించమని బోధించిన వాడు..!

వివేకానంద అవతరణ మన దేశం బ్రిటీషర్ల చేతిలో మగ్గిపోతోన్న కాలంలో జరిగింది. యావత్ జాతి విదేశీయులకు బానిసలై ఆత్మాభిమానం పొగొట్టుకుంటోన్న విషాద, విపత్కర తరుణం అది. సరిగ్గా అప్పుడే చల్లారిపోతోన్న నిప్పుపైకి రివ్వున వీచిన గాలిలా వచ్చారు స్వామీజీ. ఆయన నేరుగా స్వాతంత్ర్య సమరంలో పాలు పంచుకోలేదు. కానీ, తన తరువాతి తరాల మహా నాయకులందర్నీ వివేకానంద ప్రభావితం చేశారు. వారిలో దేశభక్తిని, స్వాతంత్ర్య కాంక్షని అగ్గిలా రాజేశారు..! అందుకే, ‘స్వామి వివేకానందులు మరో ఆదిశంకరులు’ అన్నారు లోకమాన్య బాలగంగాధర్ తిలక్..!

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్,.. ‘మీకు భారతదేశాన్ని తెలుసుకోవాలని ఉంటే.. స్వామి వివేకానందని అధ్యయనం చేయండి’.. అన్నారు. ఇక వివేకానందుడ్ని శ్రీఅరబిందో ‘మనుషుల్లో సింహం’ అంటూ శ్లాఘించారు. స్వదేశీ ఉద్యమాన్ని నిర్మించి బ్రిటీషు వాళ్లని గడగడలాడించిన బిపిన్ చంద్రపాల్ ‘ఆధునిక మానవాళికి సందేశం’ అంటూ స్వామీజీ మాటల ప్రభావం తనపై ఎంత ఉందో తేల్చి చెప్పారు..!

మహాత్ముడిగా పిలవబడే గాంధీజీ కూడా ‘వివేకానందుని వాఙ్మయం చదివాక ఈ దేశం పట్ల నా ప్రేమ వెయ్యింతలు అయ్యింది’ అన్నారు సుభాష్ చంద్రబోస్. తన ఆధ్యాత్మిక గురువు వివేకానందుడే అంటూ.. ‘ఆయన ఈ రోజు ఇక్కడ ఉండి ఉంటే.. నేను ఆయన పాదాల వద్ద ఉండేవాడిని’ అన్నారు. కేవలం బోస్ మాత్రమే కాదు ఇంకా అనేక మంది వివేకానందుడి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితులు అయ్యారు..! తొలి ప్రధాని నెహ్రూ, వినోబా బావే, సర్వేపల్లి రాధకృష్ణన్, రాజగోపాలా చారి వంటి వారు మాత్రమే కాక.. జెమ్‎షెట్‎జీ టాటా లాంటి వివేకానందుడి సమకాలీకులకి కూడా ఆయన నుంచీ ప్రేరణ అందింది. అప్పట్లో జెమ్‎షెట్‎జీ టాటాకు భారతదేశంలో ప్రపంచ స్థాయి వైజ్ఞానిక సంస్థని నెలకొల్పమని స్వామీజీయే చెప్పారట..! అలా ఏర్పడిందే.. ‘ఇండియన్ ఇన్‎స్టిట్యూట్ ఆఫ్ సైన్స్’..!

మన దేశంలో పుట్టిన ఒక సన్యాసి మన దేశ నాయకుల్నే, ప్రముఖుల్నే ప్రభావితం చేయటం పెద్ద గొప్పేంటి అంటారా..? స్వామి వివేకానంద యూరప్, అమెరికాలోని మహామహుల్ని కూడా మహోధృతంగా ప్రభావితం చేశారు..! చెప్పుకుంటూపోతే వారి పేర్లే మరొక పెద్ద ఉపన్యాసంగా మారిపోతాయి. స్వామీజీ శిష్యులు కొందరు ఆయన బోధనలకు ఆకర్షింపబడి.. తమ జీవితాల్ని మార్చుకుంటే.. మరికొందరు ఏకంగా పేర్లు కూడా మార్చుకుని.. సన్యాసం స్వీకరించినవారు కూడా ఉన్నారు..! వారిలో సిస్టర్ నివేదిత అత్యంత ప్రఖ్యాతులు. బ్రిటన్‎లో భాగమైన ఐర్లాండ్‎లో పుట్టిన ఆమె వివేకానంద వాణితో ప్రేరణ పొంది భారతదేశానికి వచ్చింది. సిస్టర్ నివేదితగా సన్యాసశ్రమం స్వీకరించి ఆడపిల్లల చదువుకు తోడ్పడింది. పేదల కోసం తన జీవితాన్ని ధారపోసింది. తరువాతి కాలంలో తన మాతృ దేశమైన బ్రిటన్‎కి వ్యతిరేకంగా భారతదేశం తరుఫున స్వాతంత్ర్య పోరాటం కూడా చేసింది..! సిస్టర్ నివేదిత భారత్‎లోనే మరణించింది కూడా..!

వివేకానందుడి వేదాంత గర్జనతో తమ దిశని, దశని మార్చేసుకున్న సిస్టిర్ నివేదిత లాంటి విదేశీయులు ఎందరో..! వారిలో ఒకరే ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్. ఆయన స్వామీజీ గురించి చెప్పిన ఒక్క వాఖ్యం చాలు.. పాశ్చాత్యులపై వివేకానంద ప్రభావం ఎంత తీవ్రమైనదో అర్థం కావటానికి..! ‘మన అత్యున్నత విద్యావంతులైన ప్రొఫెసర్లు అందర్నీ ఒక చోట చేర్చినా.. వారందరి కంటే ఎక్కువ విద్యావంతులు స్వామి వివేకానంద’ అన్నారు జాన్ హెన్రీ రైట్..! భారతదేశం బ్రిటీషు వారి బానిసత్వంలో మగ్గుతోన్న ఆనాటి కాలంలో.. ఒక అమెరికన్ ప్రొఫెసర్ కి మన కాషాయధారి అయిన సన్యాసిని.. అంత గొప్పగా పొగడాల్సిన అవసరం ఏంటి..? నిజమైన గౌరవం ఉంటే తప్ప ఆ మాటలు రావు. కానీ, వివేకానంద తన 39 ఏళ్ల అతి స్వల్ప జీవిత కాలంలోనే భారతదేశం మొదలు అమెరికా వరకూ భూమండలానికి ఇరువైపులా ప్రకంపనలు సృష్టించారు..!

1893, సెప్టెంబర్ 11వ తేదీన ఆయన చికాగో సర్వమత మహాసభల్లో తొలిసారి అమెరికన్ నేలపై గొంతు సవరించారు స్వామి వివేకానంద..! ‘సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా’ అని స్వామీజీ అనగానే.. రెండు నిమిషాల పాటు ఎడతెరిపి లేకుండా.. అక్కడి జనం కరతాళ ధ్వనులు చేశారు..! ఈ విషయం ఆ మర్నాడు అనేక అమెరికా దిన పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి కూడా..! కానీ, అసలు వివేకానంద తాను ఏమీ సందేశం ఇవ్వకుండానే.. కేవలం ‘సోదర, సోదరీమణులారా’ అంటూ వారందరినీ ఎలా సమ్మోహన పరచగలిగారు..? వారికి ఎందుకు అలా నిరవధికంగా చప్పట్లు కొట్టాలి అనిపించింది..? దీనికి సమాధానం తరువాతి కాలంలో వివేకానందుల వారే ఓసారి చెప్పారు. చికాగో సభలకు వెళ్లటానికి ముందు ఆయన పన్నెండేళ్ల పాటు.. అత్యంత పవిత్ర జీవనం గడిపారు. సంపూర్ణ బ్రహ్మచర్యంతో సాధించిన అఖండమైన ఓజస్సు ప్రభావం అది..! అందుకే, ఆయన ఒక్కసారి అమెరికన్లను సోదర, సోదరీమణులు అనగానే.. వారిలో భావోద్వేగాలు ఉప్పొంగాయి. ఆ తరువాత కూడా అమెరికా, యూరప్ ఖండాల్లో స్వామీజీ ఎక్కడ ఉపన్యసించినా అక్కడ ఆధ్యాత్మిక గంగావతరణం జరిగేది. భారతీయ సనాతన వేదాంత పరవళ్లలో పాశ్చాత్యులు మునకలు వేస్తూ పునీతులు అయ్యేవారు..!

ఆధునిక చరిత్రలో మనకు తెలిసినంత వరకు.. భారతదేశం నుంచి సముద్రాలు దాటి అమెరికా వెళ్లిన తొలి కాషాయధారి.. వివేకానందుడే..! ఆయన తరువాత అనేక మంది హిందూ జ్ఞానాన్ని, యోగాన్ని అక్కడి వారికి పంచిపెట్టారు. అయినా కూడా అమెరికాలోని జనం ఎంతగా డబ్బులు వెదజల్లినా స్వామీజీ అక్కడ ఉండలేదు. ఆ సుఖాలు, భోగాలు ఆయనలో అంతకంతకూ అయిష్టతనే పెంచాయి. ఆయన స్థానంలో మరొకరు ఉండి ఉంటే.. అమెరికాలోనే విలాసవంతమైన ఆశ్రమం నిర్మించి విశ్రమించేవారు..! వివేకానంద ఆ పని చేయలేదు. భోగాలకు నిలయమైన అమెరికా నుంచీ బాధలకు, బానిసత్వానికి తావుగా మారిన భారతదేశానికి వచ్చారు. వచ్చీ రావటంతోనే పవిత్రమైన సనాతన భూమిని ఆయన ముద్దాడారు..! మాతృభూమిపై వివేకానందుడి అనుపామానమైన ప్రేమ అది..! పేదరికం, ఆకలి, అజ్ఞానంలో మగ్గిపోతున్న సాటి భారతీయుల కోసం ఆయన వెక్కివెక్కి ఏడ్చేవారట..! దరిద్రనారయణుడు అంటూ స్వామీ వివేకానంద.. అభాగ్యుల్లో ఆది దేవుడిని చూశారు..! వారి కోసమే అమెరికా, యూరప్ వెళ్లి ఆర్దిక వనరుల్ని అన్వేషించారు. ఆ క్రమంలో పుట్టిందే రామకృష్ణ మిషన్..! వివేకానందుడు స్థాపించిన ఆ సంస్థ నేడు ప్రపంచ వ్యాప్తంగా జ్ఞానాన్ని, యోగాన్ని అందిస్తూ.. అంతకంటే ముఖ్యంగా, మానవ సేవను మాధవ సేవగా నిర్వర్తిస్తోంది..! దాన్నే స్వామీజీ ‘ఆచరణాత్మకమైన వేదాంతం’ అంటారు. ‘పేదలకు, అభాగ్యులకి ఉపయోగపడని బ్రహ్మ జ్ఞానం ఎందుకు..?’ ఈ ప్రశ్నే వివేకాందుడిని, ఇతర మత గురువుల నుంచి వేరుగా నిలబెడుతుంది..!

వివేకానంద ఒక సందర్భంలో.. శరీరానికి ఏదో కష్టం, నష్టం, ప్రమాదం వస్తుందని వెనుకడుగు వేయకండి.. అంటారు. మన శరీరం తుప్పు పట్టి పోవటం కంటే.. అరిగిపోయి నశించటం మేలంటారు స్వామీజీ..! ఆ విధంగానే తన జీవితంలోని అనుక్షణం దేశం కోసం, దేశంలోని నిరుపేదల కోసం తపించారు. కాబట్టే.. స్వామి వివేకానంద యువతకు ఆదర్శం..! మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నలకు సమాధానం ఇదే..! స్వామి వివేకానంద కాషాయం కట్టుకున్న సమాజ సేవకుడు. సమూలంగా సమాజాన్ని మార్చాలని కంకణం కట్టుకున్న నిస్వార్థ ధీరుడు. ఆయన ఏనాడూ ముక్కు మూసుకుని కూర్చొని తన స్వంత మోక్షం కోసం ప్రాకులాడలేదు. భరతమాత దాస్య విముక్తే.. తన ముక్తిగా.. సన్యాసాశ్రమ పాలన చేశాడు. నేటి యువత కూడా స్వామీజీ నుంచి నేర్చుకోవాల్సింది అదే..! దేశమే.. వివేకానందుడి సందేశమే..! దేశ సంక్షేమం, పురోభివృద్ధే.. ఆయన ఉద్దేశం..!

చివరగా, మన ‘జాతీయ యువజన దినోత్సవ’ చర్చలో ఒక్క విషయం..! స్వామి వివేకానంద సెప్టెంబర్ 11న అమెరికాలో ప్రసంగించిన చారిత్రక సందర్భాన్ని.. ప్రస్తుతం ‘యూనివర్సల్ బ్రదర్ హుడ్ డే’గా జరుపుకుంటున్నారు. జనవరి 12ని మనం ‘నేషనల్ యూత్ డే’ వ్యవహరిస్తున్నాం..! కానీ, అసలు ప్రపంచం అంతా సోదర భావంతో నిండాలంటే ఏం కావాలి..? భారతీయ యువత వివేకానందుడు నిర్ధేశించిన స్థాయిని అందుకోవాలంటే ఏం చేయాలి..? ఈ ప్రశ్నలకు సమాధానం కూడా స్వామీజీయే ఓ సందర్భంలో చెప్పారు..!

‘Give me few men and women who are pure and selfless and I shall shake the world’ అంటూ గర్జించారు వివేకానంద..! ఆయన కోరిన ఆ కొద్ది మంది స్త్రీ, పురుషుల్లో మనం ఉండగలమా..? మనకు ఆ పవిత్రత, నిస్వార్థ ప్రేమ ఉన్నాయా..? ఉంటే మనమే స్వామి వివేకానందుడి ఆశయ సాధకులం..! లేకుంటే, ఆయన కోరిన విధంగా మనల్ని మనం పదునుపెట్టుకోవటమే.. వివేకానందుడు బోధించిన వేదాంతం..! భగవద్గీతలో అర్జునుడిని యుద్ధం చేయమన్న శ్రీకృష్ణుడి కర్మయోగానికి.. నిలువెత్తు నిదర్శనమే.. స్వామీ వివేకానంద. ఆయన జీవితమే ఒక పాఠ్య పుస్తకం.. ఆయన ప్రతీ మాటా ఒక పాఠం.. నేర్చుకోవటమే మన కర్తవ్యం..! ఆ ఒక్క వివేకానందుడనే దీపంలోంచి వెలిగిన అనేకానేక దివ్వెలుగా.. మనం వెలిగిపోవటమే.. ‘యువజన దినోత్సవ సారాంశం’..! జై హింద్..!