తనకే కారు ఉందని రెచ్చిపోయాడు.. రోడ్డు మీద స్పీడ్ పెంచి కారు నడిపి.. బైకర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకర్ తీవ్రంగా గాయపడగా.. పోలీసులు కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇక.. ట్విస్ట్ ఏంటంటే అతనో ‘లా’ విద్యార్థి కావడం విశేషం.
ఢిల్లీలోని అర్జంఘర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ బైకర్, కారు డ్రైవర్‌ల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో స్కార్పియో డ్రైవ్ చేస్తున్న అనుజ్ చౌదరి.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై వెళ్తున్న శ్రేయాన్ష్‌ను హై స్పీడ్‌లో కారుతో ఢీకొట్టాడు. అంతకు ముందు బైకర్‌ను బూతులు తిడుతూ.. కారుతో తొక్కించి చంపేస్తానంటూ బైకర్లను హెచ్చరించాడు. ఈ క్రమంలో ఓ బైకర్‌ను వెనుక నుంచి కారుతో వేగంగా ఢీకొట్టాడు.
కారు ఢీకొట్టడంతో కింద పడిపోయిన బైకర్.. శ్రీయాన్ష్ తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను అనురాగ్ అయ్యర్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అనంతరం, పీఎంవో ఇండియా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీసీపీ న్యూఢిల్లీలను ట్యాగ్ చేశాడు. ఈ సందర్భంగా బాధితుడు శ్రేయాన్ష్ మాట్లాడుతూ.. తాను, తన స్నేహితులు కలిసి ఆరావళిలోని టెంపుల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న అనుజ్‌తో వాగ్వాదం జరిగిందన్నాడు.
ట్విట్టర్ వీడియోతో రంగంలోకి దిగిన పోలీసులు.. అనుజ్ చౌదరిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. కారును సీజ్ చేసినట్టు చెప్పారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.