హనుమాన్ జన్మస్థలంపై క్లారిటీ అప్పడే..!

0
849

అంజనీ పుత్రుడు హనుమంతుడి జన్మస్థలం గురించి దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. గత కొంతకాలంగా తీవ్ర చర్చోపచర్చలకు దారి తీస్తున్న ఈ విషయంపై భిన్న వాదనలు ప్రచారంలో ఉన్నాయి. అయితే హనుమంతుడు జన్మస్థానంపై వివాదానికి తెర దించనున్నారు.

ఇందుకోసం కర్ణాటక ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకోనున్నారు. అంజనాద్రి ప్రాంతమే హనుమాన్‌ జన్మస్థలమని పలు పౌరాణిక గ్రంథాలు వెల్లడిస్తున్నాయని కొప్పళ జిల్లా గంగావతి ఎమ్మెల్యే పరణ్ణ మునవళ్ళి వెల్లడించారు.

ఈనెల 15, 16 తేదీలలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అధ్యక్షతన జరిగే సమావేశంలో అంజనాద్రి పర్వత ప్రాంతాల అభివృద్ధితోపాటు హనుమాన్‌ జన్మస్థలంపై కూడా చర్చ జరుపుతామన్నారు. హనుమాన్‌ జన్మస్థలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ, మహారాష్ట్రలోని నాసిక్‌ అంజనేరి కొండలు, గోవాలోని పణజీ ప్రాంతానికి చెందిన కొందరు పలు ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారన్నారు. ఈ గందరగోళానికి తెరదించేందుకు ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా మరింతలోతుగా ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేయాలని ప్రభుత్వానికి సూచిస్తామన్నారు. అయితే భక్తులు కూడా హనుమంతుడి జన్మ వృత్తాంతంపై వివాదం తగదని, ఈ సమస్యకు త్వరగా తెరదించాలని కోరుకుంటున్నారు.

ఇక గత కొన్ని రోజులుగా ఆసక్తిగా మారిన ఈ విషయంపై ఒక స్పష్టత తెచ్చేందుకు శ్రీ మండలాచార్య మహంత్ పీఠాదిపది స్వామి అనికేత్ శాస్త్రి దేశ్‌పాండే మహారాజ్ ఆధ్వర్యంలో మే31న నాసిక్ లో ‘ధర్మ సంసద్‌ను’ ఏర్పాటు చేశారు. వాల్మీకి రామాయణాన్ని చేతబట్టి ధర్మ సంసద్ కు చేరుకున్న మహంత్ గోవింద్ దాస్ స్వామి తన వాదనని బలంగా వినిపించగా..ప్రతివాదులు తిరగబడ్డారు. దీంతో ఆంజనేయుడి జన్మస్థలంపై స్పష్టత రాకుండానే ధర్మ సంసద్ రసాబాసకు దారి తీసింది. ఇదిలాఉంటే అసలు హనుమంతుడి జన్మస్థలం అటూ కిష్కింద, అంజనాద్రి, ఇటు మహారాష్ట్రలోని ఆంజనేరి కూడా కాదని..ఆంజనేయుడు గోవాలో జన్మించాడని గోవాకు చెందిన బీజేపీ నేత కుమారుడు, అడ్వకేట్ అయిన శ్రీనివాస్ ఖలాప్ మరో కొత్త అంశానికి తెరలేపారు.

మాజీ న్యాయ శాఖ మంత్రి రమాకాంత్ ఖలాప్ తనయుడు, హిస్టరీ రీసెర్చర్, అడ్వకేట్ శ్రీనివాస్ ఖలాప్ ఈ వ్యాఖ్యలు చేశారు. హనుమంతుడి జన్మస్థలం ప్రస్తుతం గోవాలోని అంజెదివా ఐలాండ్ అని వాదిస్తున్నాడు. వాల్మీకి రాసిన రామాయణంలోనే హనుమంతుడు గోవాలో జన్మించాడని చెబుతుండగా కర్ణాటక, మహారాష్ట్రలు ఎందుకు హనుమంతుడి జన్మస్థలంపై గగ్గోలు పెడుతున్నాయని వాదించాడు. వాల్మీకి రామాయణం ప్రకారం, హనుమాన్ తల్లి అంజనీ దేవి సముద్రం పక్కనే ఉన్న ఓ ద్వీపంలో తపస్సు చేసిందని శ్రీనివాస్ ఖలాప్ అన్నాడు. వాయు దేవుడి వరంతో అంజనీ దేవి హనుమంతుడికి జన్మ ఇచ్చిందని వివరించాడు. ఆ ద్వీపం పేరే అంజనీ ద్వీప్ అని తెలిపాడు. కానీ, కాలక్రమేణ దాని పేరు అంజెదివా ద్వీపంగా రూపాంతరం చెందిందని వివరించాడు. ఈ ద్వీపం ప్రస్తుతం కార్వార్ సమీపంలో ఉన్నదని తెలిపాడు. చారిత్రక కోణాల్లో పరిశీలిస్తే ఈ ద్వీపం గోవాలోనే ఉన్నదని తెలుస్తున్నదని వివరించాడు. కాబట్టి.. హనుమంతుడు గోవాలనే పుట్టాడని నిర్వివాదంగా, నిశ్చయంగా చెప్పవచ్చని అన్నాడు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

two × 2 =