ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తూ ఇతరులతో కలిసి నివాసం ఉంటోన్న అసోంకి చెందిన అక్తర్ హుస్సేన్ లష్కర్ అనే అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన బెంగళూరులో కలకలం రేపింది.
బెంగళూరులో అసోంకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించగా.. కర్నాటకలో కలకలం సృష్టించింది. ప్రస్తుతం సదరు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితుడికి స్థానికుడితో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు కర్నాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర చెప్పారు. బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం రాత్రి యువకుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. అనుమానితుడు తిలక్‌నగర్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలోని మూడో అంతస్తులో పలువురితో కలిసి నివాసం ఉంటున్నాడు. సదరు యువకుడికి పోలీసులకు పక్కా సమాచారం సమాచారం అందిందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
సదరు యువకుడిని అక్తర్ హుస్సేన్ లష్కర్గా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లష్కర్ అసోం నుంచి పారిపోయి వచ్చి బెంగళూరులో నివసిస్తున్నట్లు గుర్తించారు. అతనితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత నెలలోనూ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న తాలిబ్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.