ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్ల సంచారం అధికమవుతోంది. పాకిస్తాన్ భూభాగం నుండి ఆయుధాలను, డ్రగ్స్ ను తరలించడానికి తీవ్రవాదులు డ్రోన్లను వాడుతూ ఉన్నారు. భారత సైన్యం ఎప్పటికప్పుడు డ్రోన్లను కూల్చి వేస్తూ ఉండగా.. కొన్ని తప్పించుకుని తిరిగి వచ్చిన చోటుకే వెళ్ళిపోతూ ఉన్నాయి. సాంబా జిల్లాలో గత రాత్రి ఏకంగా మూడు ప్రాంతాల్లో డ్రోన్లు సంచరించాయి. తొలి డ్రోన్‌ను బారి బ్రహ్మ ప్రాంతంలో, రెండో డ్రోనును చలియారి వద్ద గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కొద్దిసేపటికి గగ్వాల్ ప్రాంతంలో మూడో డ్రోనును గుర్తించారు. వాటిపై కాల్పులు జరపడంతో వెనక్కు వెళ్లిపోయాయి. డ్రోన్లు సంచరించిన ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. డ్రోన్ల సంచారంతో సాంబా జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు.
గత వారంలో కూడా జమ్మూ కాశ్మీర్ ఓ డ్రోన్ ను భారత సైన్యం కూల్చి వేసింది. కనాచక్ ప్రాంతంలో డ్రోన్ ఎగురుతూ కనిపించడంతో భద్రతా బలగాలు వాటిని కూల్చి వేశాయి. ఈ డ్రోన్‌లో ఉన్న ఐదు కిలోల పేలుడు పదార్థాలు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఐదు కిలోల ఇంప్రొవైజ్డ్ పేలుడు పరికరం (ఐఇడి) తో ప్రయాణిస్తున్న పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చి వేశారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఆరు రెక్కల డ్రోన్ ఆరు అడుగుల పొడవు ఉందని.. ఆ డ్రోన్ కు ఐఇడిని పాలిథిన్ తో చుట్టబడిందని తెలుస్తోంది. పేలుడు పదార్థాలను ఉగ్రవాదులకు అప్పగించడానికి ఈ పనికి పాల్పడ్డారు. పేలుడు పదార్థాలను అక్రమంగా రవాణా చేయడానికి లష్కరే తోయిబా ఈ ఆపరేషన్‌ను ఉపయోగిస్తోన్న విషయాన్ని ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. డ్రోన్ స్వాధీనం చేసుకున్న ప్రదేశం నుండి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గత నెల జూన్ 27న జమ్మూలోని భారత వైమానిక దళం (ఐఎఎఫ్) స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడికి పాల్పడిన సమయం నుండి జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్లు పదేపదే కనిపించాయి. 2019 నుంచి పాక్ భారత్‌లోకి డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు, డ్రగ్స్ పంపే చర్యలకు పాల్పడుతోంది. గురువారం రాత్రి కూడా అలాంటి ప్రయత్నమే చోటు చేసుకుంది.