కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత దూరం

0
651

కాంగ్రెస్ పార్టీకి వరసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీని వీడగా.. మరో నేత కూడా కాంగ్రెస్ కు దూరమవుతున్నారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, సిల్చార్ మాజీ ఎంపీ సుస్మితా దేవ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. తాను ప్రజా సేవలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నానని ఆమె అన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తృణమూల్ కాంగ్రెస్‌లో ఆమె చేరే అవకాశం ఉందని దేవ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆమె రాజీనామా లేఖను పంపారు. ఆమె రాజీనామాతో పార్టీకి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సుస్మితా దేవ్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై అసోంలోని సిల్చార్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. తర్వాత ఆమెకు పార్టీ అధిష్ఠానం ఆల్‌ ఇండియా మహిళా కాంగ్రెస్‌ బాధ్యతలు సైతం అప్పగించింది. అసోం శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత సుస్మితా దేవ్ రాజీనామా చేస్తుండడంతో కాంగ్రెస్‌కు మరింత ఇబ్బందికరంగా మారింది. రాజీనామాకు ముందు ఆమె వాట్సాప్‌ గ్రూప్‌ల నుంచి వైదొలిగారు.

ఏడుసార్లు పార్లమెంటేరియన్ అయిన సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె, అసోంలోని బెంగాలీ మాట్లాడే బరాక్ వ్యాలీలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా చెప్పుకునే దేవ్ రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ అని తెలుస్తోంది. మేలో ఇటీవల ముగిసిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో, బద్రుద్దీన్ అజ్మల్ యొక్క ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIDUF) తో భాగస్వామ్యం చేసుకున్న కాంగ్రెస్-NDA కూటమి చేతిలో ఓడిపోయింది. సోనియా గాంధీకి రాసిన లేఖలో ఆమె రాజీనామాకు సంబంధించిన కారణాలను వెల్లడించలేదు కానీ.. పార్టీతో మూడు దశాబ్దాల అనుబంధాన్ని మాత్రం గుర్తు చేసుకున్నారు. ఆమె తన ట్విటర్‌ ఖాతా బయోలో కాంగ్రెస్‌ మాజీ సభ్యురాలు, మహిళ నేత అని మార్చి.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మొదటి క్లూ ఇచ్చారు. సుస్మితా దేవ్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబాల్‌ చెప్పారు. యువ నాయకులంతా పార్టీని వీడితున్నారు.. పార్టీని బలోపేతం చేయడానికి మేం సరిగా ప్రయత్నించడం లేదంటూ వృద్ధులపై నిందలు వేస్తున్నారని కపిల్‌ సిబాల్‌ అన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here