More

    ముందస్తు బెయిల్ నిరాకరణ.. అతడి తలపై లక్ష రూపాయల రివార్డు

    సుశీల్ కుమార్.. రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత.. దేశమంతా అతడిని ఒకప్పుడు సగర్వంగా చూసింది. ఇప్పుడు మాత్రం పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. ఒకప్పుడు అతడికి ఎందరో నగదు పురస్కారాలను అందించగా.. ఇప్పుడు అతడిని పట్టిస్తే లక్ష రూపాయలు రివార్డు ఇస్తామని చెబుతున్నారు పోలీసులు. ప్రస్తుతం సుశీల్ కుమార్ మోస్ట్ వాంటెడ్ లా మారిపోయాడు.

    రెజ్లర్ హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న రెజ్లర్ సుశీల్ కుమార్ తలపై ఢిల్లీ పోలీసులు రివార్డు ప్రకటించారు. అతడిని పట్టించినా, ఆచూకీ చెప్పినా రూ.లక్ష నజరానాను అందజేస్తామని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. సుశీల్ తో పాటూ ఉన్న మరో నిందితుడు అజయ్ పై రూ. 50 వేల నజరానా ప్రకటించారు.

    మే 4న ఢిల్లీ ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన గొడవలో.. తోటి రెజ్లర్లపై సుశీల్, అతడి సహచరులు దాడికి దిగారు. ఆ దాడిలో తీవ్రగాయాలపాలైన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా సాగర్ రాణా అనే 23 ఏళ్ల యువ రెజ్లర్ కన్నుమూశాడు. ఈ దాడితో తమకు సంబంధం లేదని సుశీల్ కుమార్ చెబుతూ వస్తున్నాడు. అయితే పోలీసులు అతడిని విచారించాలని అనుకున్నా కనిపించకుండా పోయాడు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అతడితో పాటు కేసులో నిందితులుగా ఉన్న మరికొందరిపైనా ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది.

    ఇక ముందస్తు బెయిల్ కోసం సుశీల్ కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉన్నాయి. సుశీల్ కుమార్ కు ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. ముందస్తు బెయిల్ కోరుతూ సుశీల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను రోహిణి కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా, వారిచ్చిన సమాచారం మేరకు హత్యలో సుశీల్ కుమార్ హస్తం కూడా ఉందని పోలీసులు గుర్తించారు. కోర్టులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేతకు గురైన నేపథ్యంలో, సుశీల్ కుమార్ స్వయంగా లొంగిపోయే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

    Trending Stories

    Related Stories