More

    రికార్డులను బద్దలు కొడుతున్న సూర్య.. ధోనిని దాటేసిన రోహిత్ శర్మ

    భార‌త బ్యాట‌ర్ సూర్య‌కుమార్ మ‌రో రికార్డు బ‌ద్ద‌లు కొట్టాడు. ఈ ఏడాది ఆడిన అంత‌ర్జాతీయ టీ20ల్లో సూర్య‌కుమార్ 45 సిక్స‌ర్లు కొట్టి.. ఈ ఫార్మాట్‌లో ఓ ఏడాది అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెట‌ర్‌గా రికార్డు సాధించాడు. ద‌క్షిణాఫ్రికాతో బుధ‌వారం రాత్రి తిరువ‌నంత‌పురంలో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అత‌ను ఈ ఘ‌న‌త అందుకున్నాడు. రిజ్వాన్ 2021లో 42 సిక్స‌ర్ల‌తో ఓ ఏడాదిలో అత్య‌ధిక సిక్స‌ర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు సూర్య‌కుమార్ అత‌డిని దాటేశాడు. టీ20ల్లో నిల‌క‌డగా ఆడుతున్న సూర్య ఐసీసీ టీ20 బ్యాట‌ర్ల తాజా ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి చేరుకున్నాడు. సూర్య ఖాతాలో 801 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. టాప్‌ ర్యాంక్‌లో ఉన్న పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ఖాతాలో 861 రేటింగ్‌ పాయింట్లున్నాయి.

    భారత కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ రికార్డును అధిగమించాడు. ఒక ఏడాదిలో టీమిండియాను అత్య‌ధిక టీ20 మ్యాచ్‌లో గెలిపించిన కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ నిలిచాడు. 2016లో ఒకే ఏడాదిలో 15 టీ20 మ్యాచ్‌లో టీమిండియాను ధోనీ గెలిపించాడు. ఇటీవ‌లే ఆస్ట్రేలియాలో ముగిసిన టీ20 సిరీస్‌లో చివ‌రి మ్యాచ్‌లో విజ‌యంతో హిట్ మ్యాన్ ఖాతాలో కూడా కేలండ‌ర్ ఇయ‌ర్‌లో 15 టీ20 విజ‌యాలు న‌మోదయ్యాయి. కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురం గ్రీన్‌ఫీల్డ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం వేదిక‌గా బుధ‌వారం జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం సాధించింది. దీంతో రోహిత్ శ‌ర్మ ఖాతాల్లో 16 విజ‌యాలు చేరాయి. కేలండ‌ర్ ఇయ‌ర్‌లో టీమిండియాకు అత్య‌ధిక టీ20 విజ‌యాలు అందించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

    Related Stories