More

  నయన్, విఘ్నేష్ ప్రొడక్షన్స్.. ది స‘రోగ’సీ..!

  సినీ గ్లామర్.. అనేక సుఖాల్ని తెచ్చి పెట్టే ఓ పెద్ద కష్టం..! ఇదేం వింత స్టేట్మెంట్ అనుకుంటున్నారా..? నిజమే.. సినిమా వాళ్లకి ఉండే గ్లామర్ లక్షల కోట్ల కార్పొరేట్లకు కూడా ఉండదు. దేశాన్ని నడిపే పొలిటీషన్స్‎కి, సమాజాన్ని నడిపే మత పెద్దలకి కూడా ఉండదు. కానీ, మాంచి మసాలా దట్టించిన ఫాస్ట్ ఫుడ్.. తింటున్నప్పుడు నాలికకు సుఖంగా ఉంటుంది. కడుపుకి మాత్రం తీరిగ్గా చేటు చేస్తుంది. గ్లామర్ కూడా అటువంటిదే..!

  ఇప్పుడు సినీ గ్లామర్ గురించిన ముచ్చట ఎందుకంటే.. నయనతార పెళ్లై నాలుగు నెలలైంది. దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ఆమె ప్రేమకథ ఏడేళ్లు నడిచింది. అంతకు ముందు కూడా నయన్ లవ్ స్టోరీస్ పబ్లిక్ ఇష్యూస్ గా మారిపోతూ వచ్చాయి. మొదట శింబుతో, తరువాత ప్రభుదేవతో అందాల తార ప్రణయం సాగించింది. కానీ, పుట్టుకతో మలయాళీ క్రిస్టియన్ అయిన డయానా అలియాస్ నయనతార.. ప్రభుదేవకి రెండో భార్య అయ్యేందుకు.. మతం కూడా మార్చుకుంది. క్రిస్టియానిటీ నుంచీ హిందూత్వంలోకి ఘర్ వాప్సీ చేసింది. అంతా బాగానే ఉన్నా ప్రభుదేవ భార్య అప్పట్లో రోడ్డు మీదకు వచ్చి గొడవ చేయటంతో నయన్ వెనక్కి తగ్గింది. ప్రభుతో ఎలాంటి అభిప్రాయభేదాలు వచ్చాయో ఏమోగానీ.. కొన్నాళ్లు మళ్లీ సింగిల్‎గా ఉండిపోయింది. ఆ తరువాత ఆమె లైఫ్ లోకి వచ్చాడు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్..!

  నయనతార భర్త విఘ్నేశ్ ఆమెతో చాలా ఏళ్లే కలసి ముందుకు సాగాడు. వారిద్దర్నీ అటు పరిశ్రమలోని వారు, ఇటు సాధారణ జనం.. దాదాపుగా భార్యాభర్తలుగానే చూసేవారు.. పెళ్లికి ముందు కూడా. అయితే, వివాహా సంబంధమైన విఘ్నాలన్నీ దాటుకుని.. విఘ్నేశ్ ని నయన్ కొన్ని నెలల క్రితం ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. కానీ, మన లేడీ సూపర్ స్టార్ లైఫ్ లో కాంట్రవర్సీలు ఇంకా పూర్తైనట్టు కనిపించటం లేదు. ఆమెకున్న సినీ గ్లామర్ కారణంగా సరోగసీ చట్టంలోని నిబంధనలు సెలబ్రిటీ కపుల్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి.

  పెళ్లై ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాక ముందే మాకు కవల పిల్లలు పుట్టారంటూ విఘ్నేశ్ సొషల్ మీడియాలో ప్రకటించాడు. అతను ఎక్కడా తమకు పుట్టిన కొడుకులిద్దరూ సరోగసీ ద్వారా జన్మించారని చెప్పకపోయినా నెటిజన్స్ ఆ విషయాన్ని గ్రహించేశారు. ఇంతవరకూ అంతా హ్యాపీగానే సాగినా.. 2021లో అద్దె గర్భాల వ్యవహారంలో మన దేశంలోని రూల్స్ మారాయి. కేవలం కొన్ని షరతులకి లోబడి మాత్రమే సరోగసీకి అనుమతిస్తారు. ఆ రూల్స్ ఫాలో కాకపోతే జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు నయన్, విఘ్నేశ్ కూడా సరోగసీ చట్టాన్ని ఉల్లంఘించారని విమర్శలు ఎదుర్కొంటున్నారు..!

  అద్దె గర్భం ద్వారా పిల్లల్ని పొందాలని భావించిన వారు 21 ఏళ్ల కంటే పెద్దవారై ఉండాలి. అలాగే, వారి వయస్సు 36 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఇది ప్రాథమికమైన నిబంధన మాత్రమే. ఇంకా అనేక లీగల్ కండీషన్స్ కూడా సరోగసీ యాక్ట్ లో ఉన్నాయి. అవన్నీ నయన్, విఘ్నశ్ ఫుల్ ఫిల్ చేశారా? ప్రస్తుతానికి మనకైతే తెలియదు. కోలీవుడ్ సెలబ్రిటీ కపుల్ కూడా నోరు విప్పలేదు. తమిళనాడు ప్రభుత్వంలోని ఓ మంత్రి మాత్రం విచారణ జరుపుతామంటూ స్పందించారు. ఎవరైనా చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. నయనతార దంపతులు ఏం చేశారు, ఏం చేయలేదనేది ముందు ముందు తేలుతుంది. కాకపోతే, మన దేశంలో ప్రముఖులు.. ముఖ్యంగా, సినిమా వాళ్లకు ఉండే.. పరపతి గురించి తెలిసిన ఎవరికైనా ఈ తాజా కేసు ఏమవుతుందో ఇట్టే తెలిసిపోతుంది..!

  నయనతార, విఘ్నేశ్ ఇప్పుడు కాదు.. గతంలోనే సరోగసీకి సిద్ధం అయి ఉంటారని అప్పుడే వాదనలు వినిపిస్తున్నాయి. అంటే, అద్దె గర్భం నిబంధనల్ని తూచా తప్పక పాటిస్తూనే వారు కవల పిల్లలకి తల్లిదండ్రులయ్యారని కొందరంటున్నారు. అయితే, చట్టంలో అనేక షరతులు ఉండటంతో.. ఇప్పుడే ఎవరైనా కూడా సెలబ్రిటీ కపుల్ కి క్లీన్ చిట్ ఇచ్చేయలేరు. పద్ధతి ప్రకారం గవర్నమెంట్ చేసే ఇన్వెస్టిగేషన్ లోనే నిజమేంటో తేలాలి. కాకపోతే, గతంలో ఇదే సరోగసీ పద్దతి ద్వారా షారుఖ్ లాంటి సీనియర్ నటుడు ఓ కొడుక్కి తండ్రయ్యాడు. వయస్సు రిత్యా చూస్తే నయన్, విఘ్నేశ్ ల కన్నా షారుఖ్, గౌరీ పెద్ద వారు. అలాగే, మన టాలీవుడ్ లో మంచులక్ష్మీ, బాలీవుడ్ లో నిర్మాత ఏక్తా కపూర్, ఆమె సోదరుడు తుషార్ కపూర్ కూడా సరోగేట్ సంతానానికి అమ్మానాన్నలు అయ్యారు. తనని తాను ‘గే’ అని చెప్పుకునే బడా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కరణ్ జోహర్ కూడా ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. అమెరికాలో ఉంటోన్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ మిసెస్ ప్రితీ జింతా కూడా సరోగసీనే నమ్ముకుంది. ఇలా అద్దె గర్భాలపై ఆధారపడ్డ సినీ ప్రముఖులు ఈ మధ్య కాలంలో చాలా మందే ఉన్నారు..!

  చాలామంది ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసిన సరోగసీ వ్యవహారం.. నయనతార, విఘ్నేశ్ విషయంలో వివాదం కావటం కొంత వరకూ ఆశ్చర్యమే. కానీ, సౌత్ లో నయనకు ఉన్న క్రేజీ ఆమె చుట్టూ కాంట్రవర్సీ ముసురుకునేలా చేసిందని భావించవచ్చు. కోలీవుడ్ కొత్త జంట పెళ్లైన ఆర్నెల్లు కూడా పూర్తి కాక ముందే పేరెంట్స్ అవ్వటం చాలా మందికి అనుమానం కలిగించింది. దానికి తోడు సినీ గ్లామర్ కూడా జత చేరటంతో సొషల్ మీడియాలో పెద్ద చర్చగా మారిపోయింది. అదే చివరకు, ప్రభుత్వం కూడా రంగంలోకి దిగేలా చేసింది. అయితే, తాజాగా నయనతార భర్త మరో సొషల్ మీడియా మెసేజ్ షేర్ చేశాడు. ‘నీ వాళ్లు అనుకునే వారిపై దృష్టి పెట్టు’ అనే అర్థం వచ్చేలా విఘ్నేశ్ ఓ పోస్టు పెట్టాడు. మరో మెసేజ్ లో ‘సరైన సమయంలో అన్నీ నీ వద్దకు వస్తాయి’ అనే మీనింగ్ తో కామెంట్ చేశాడు. ఈ మాటల వెనుక ఆయన ఉద్దేశం ఏంటో పెద్దగా ఎవ్వరికీ అర్థం కాలేదు. కాకపోతే, వివాదానికి, విమర్శలకి కాలమే సమాధానం ఇస్తుందని ఆయన భావించి ఉంటాడు. అదే ఇన్ డైరెక్ట్ గా చెప్పాడని కొందరు అంటున్నారు..!

  నయనతార కవల పిల్లల కాంట్రవర్సీ టీకప్పులో తుఫానుగా మారే అవకాశాలే ఎక్కువ. కాకపోతే, మన దేశంలోని డబ్బు, సమాజంలో పరపతి ఉన్న వారి చేతుల్లో.. సరోగసీ దుర్వినియోగం అయ్యే అవకాశాలు మాత్రం మెండుగానే కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కఠినమైన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. అయినా చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే క్లయింట్లు, లాయర్లు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. వారు గెలిచే అవకాశాలు కూడా మన వ్యవస్థలో పుష్కలంగా ఉండటం విచారకరమైన విషయం. ఏది ఏమైనా, నయనతార దంపతులు తమపై వచ్చిన సరోగసీ ఆరోపణలకు ఎటువంటి సంజాయిషీ ఇస్తారో వేచి చూద్దాం. ఈ పరిణామం మరిన్ని మార్పులేమైనా తెస్తుందేమో కూడా చూడాలి..!

  Trending Stories

  Related Stories