హిజాబ్ వివాదంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరాకరించింది. హోలీ సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. హిజాబ్ వివాదంలో భాగంగా విద్యార్థులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో హిజాబ్‌ను విద్యాలయాల్లో నిషేధించాలంటూ మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్లన్నింటినీ కలిపి హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వివాదంపై మంగళవారం కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పుతో తమకు న్యాయం జరగలేదని భావించిన విద్యార్థులు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదని, హోలీ సెలవుల తర్వాత విచారణ చేపడతామని తెలిపింది.
హోలీ సెలవుల తర్వాత పిటిషన్‌పై విచారణ చేస్తామని కోర్టు తెలిపింది. హోలీని పురస్కరించుకుని మార్చి 17 నుండి మార్చి 19 మధ్య కోర్టు మూసివేయబడుతుంది. హైకోర్టు తీర్పుపై అప్పీలు దాఖలు చేసిన ముస్లిం యువతుల తరపున న్యాయవాదులు సంజయ్ హెగ్డే, దేవదత్ కామత్ వాదించారు.
విద్యాలయాల్లోకి హిజాబ్‌ను అనుమతించరాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అసంతృప్తి వ్యక్తం చేసిన ముస్లిం విద్యార్థినులు.. హిజాబ్‌ను అనుమతించేదాకా క్లాసులకు వెళ్లబోమని తెలిపారు. బుధవారం నాడు క్లాసులకు హాజరవ్వలేదు. అలాగే హాజరుకావాల్సిన పరీక్షలకు కూడా వారు గైర్హాజరయ్యారు.