More

    కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఎంతో సంతోషం కలిగించిందన్న సుప్రీం కోర్టు

    కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను చిదిమేసిన సంగతి తెలిసిందే..! కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా చనిపోయిన వారికి ఆర్థికంగా ఆదుకోవాలని ఎంతో మంది డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సుప్రీం కోర్టులో కూడా పలువురు పిటీషన్లు వేశారు. వీటిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా అందించనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై సుప్రీంకోర్టు ప్రశంసలు కురిపించింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ఇతర దేశాల కంటే భారత్ ఎంతో బాధ్యతగా వ్యవహరించిందని, కరోనా బాధిత కుటుంబాల పట్ల కేంద్రం తీసుకున్న బాధ్యత చాలా గొప్పదని తెలిపింది. తాము చాలా సంతోషంగా ఉన్నామని జస్టిస్ ఎంఆర్ షా వ్యాఖ్యానించారు. బాధితుల కన్నీటిని తుడవడానికి ఎంతో కొంత ప్రయత్నం జరుగుతోందని ప్రశంసించారు. అత్యంత ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పని చేసిందని సుప్రీంకోర్టు ప్రశంసలు కురిపించింది. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా, ఇతర సమస్యలు ఉన్నా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అద్భుతంగా అమలు చేసిందని కొనియాడింది. బాధిత కుటుంబాలకు ఇది ఓదార్పునిస్తుంది. వారి కన్నీటిని తుడిచే చర్య చేపట్టడం మాకు సంతోషంగా ఉంది అని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పరిహారంపై పలు మార్గదర్శకాలతో వచ్చే నెల 4న ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.

    కరోనా పాజిటివ్‌ వచ్చిన 30 రోజుల్లో ఆత్మహత్య చేసుకొన్నవారి కుటుంబాలకు కూడా పరిహారం అందిస్తామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వారిని కూడా కరోనా మృతులుగానే గుర్తిస్తామని స్పష్టం చేసింది. గతంలో డెత్‌ సర్టిఫికెట్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసినప్పుడు ఆత్మహత్య చేసుకొన్నవారిని కరోనా మృతులుగా గుర్తించలేమని కేంద్రం తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఈ విషయంలో పునరాలోచన చేయాలని సూచించింది. తాజాగా ఈ విషయంలో కూడా పరిహారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

    Trending Stories

    Related Stories