జీహెచ్ఎంసీకి ఆఖరి అవకాశం ఇచ్చిన సుప్రీంకోర్టు

0
674

హైదరాబాద్ పరిధిలోని వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించిన పిటిషన్‌పై గురువారం నాడు సుప్రీంకోర్టు విచారించింది. హైదరాబాద్‌లోని హుస్సేన్​సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు గురువారం విచారించింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే చివరి అవకాశం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నారు. జీహెచ్‌ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.

హుస్సేన్ సాగర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఒక్క ఏడాదికి హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి మినహాయింపుని ఇవ్వాలంటూ అభ్యర్థించింది. ట్యాంక్ బండ్ మీదుగా నిమజ్జనం చేసేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్‌లో జీహెచ్ఎంసీ కోరింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది జీహెచ్ఎంసీ. ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించాలని జీహెచ్ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన చీఫ్ జస్టిస్ట్ ఎన్వీ రమణతో కూడిన బెంచ్ గురువారం నాడు విచారించింది. జీహెచ్ఎంసీకి మద్దతుగా సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు, బెంచ్ ఇంతకు ముందే 12 ఉత్తర్వులు జారీ చేసినా ఎందుకు అమలు చేయలేదని జీహెచ్ఎంసీని ప్రశ్నించింది ధర్మాసనం. తాగునీరు కలుషితమవుతున్నా ఎందుకు పట్టించుకోలేదు.సుందరీకరణ కోసం చాలా డబ్బు ఖర్చు చేయబడింది, కానీ అది ఫలితాన్ని ఇవ్వడం లేదని.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది నుండి హై కోర్టు యొక్క అన్ని ఆదేశాలను అమలు చేయడానికి మేము రాష్ట్రాన్ని నిర్దేశిస్తామని తెలిపింది. ఈ ఒక్క ఏడాది మాత్రమే జీహెచ్ఎంసీకి అనుమతులు ఇచ్చింది సుప్రీం కోర్టు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here