మన దేశంలో న్యాయవ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్ లో ఉండటం సర్వసాధారణం. అయితే ప్రధాని మోదీకి మాత్రం భారీ ఊరట లభించింది. 20 ఏళ్ల తర్వాత ఆయనపై అభియోగాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల కేసులో గతంలో సిట్ దర్యాప్తు సంస్థ ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈషాన్ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఫిబ్రవరి 28, 2002న అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీలో జరిగిన హింసాకాండలో 69 మంది మరణించారు. చనిపోయిన వారిలో ఈషాన్ జఫ్రీ కూడా ఉన్నారు. గోద్రాలో సాధువులు వెళ్తున్న రైలు బోగీని దుండగులు దహనం చేసిన మరుసటి రోజే గుల్బర్గా సొసైటీ మారణకాండ ఘటన చోటుచేసుకుంది. ఇక గోద్రా అల్లర్ల ఘటన తర్వాత.. చెలరేగిన హింసాత్మక ఘటనల్లో వెయ్యి మందికిపైగా చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది మైనార్టీలే. ఇందులో మోదీ ప్రమేయం ఉందడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. అల్లరి మూకలను నియంత్రించడంలో పోలీసుల వైఫల్యమే కారణమని అప్పటి నానావతి కమిషన్ కూడా తెలిపింది.
పలువాదోపవాదాల తర్వాత జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్, దినేశ్ మహేశ్వరి, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. సిట్ ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. సిట్ తీర్పును ఆమోదిస్తూ మెజిస్ట్రేట్ తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్ధిస్తున్నామని, ఈ కేసులో దాఖలైన నిరసన పిటీషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు సుప్రీం ధర్మాసనం చెప్పింది. డిసెంబర్ 9, 2021న సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నరేంద్రమోడీని వెంటాడుతున్న ఈ కేసులో తాజా సుప్రీంకోర్టు తీర్పుతో ఆయనకు భారీ ఊరట లభించినట్లయింది. అయితే గుజరాత్‌లోని గోద్రా సహా పలు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీతో పాటు పలువురి పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2008లో అల్లర్లపై సిట్ దర్యాప్తు ప్రారంభమైంది. 2010లో అప్పటి గుజరాత్ సిఎంగా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని సిట్ దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. అనంతరం ఈ కేసులోని అన్ని ఆరోపణల నుంచి ప్రధాని మోడిని 2012 ఫిబ్రవరి 8న సిట్ తప్పించింది. ప్రధాని మోడికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కేసును మూసివేస్తూ సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదికపై అప్పట్లో కలకలం రేగింది.
అయితే ఈ అల్లర్లలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీతో పాటు ఆయన ప్రభుత్వంలో మంత్రులు, అధికారులు, పోలీసుల పాత్ర ఉందని, ఇందుకు బాధ్యుల్ని చేస్తూ వారిని శిక్షించాలని జాకియా జాఫ్రీ న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రధాని మోడీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ తో కలిసి 2012 ఫిబ్రవరి 9న జఫ్రీ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సిట్ ఉత్తర్వులను కోర్టు సమర్ధించడంతో జఫ్రీ, తీస్తా సెతల్వాద్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో సిట్ తీర్పును 2017లో గుజరాత్ హైకోర్టు కూడా సమర్ధించింది. దీంతో సిట్ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ 2018లో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు.. పిటిషన్ అప్పీల్ కు అర్హత లేదని స్పష్టం చేసింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీం ధర్మాసనం సమర్ధించింది. మోదీతో పాటు ఇతర రాజకీయవేత్తలు, అధికారులపై 2006లో జాకియా జఫ్రీ కేసును నమోదు చేసింది.