కొద్దిరోజుల కిందట అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే..! 2 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. నవనీత్ కౌర్ గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. నవనీత్ కౌర్ తాను ఎస్సీ అని పేర్కొంటూ తప్పుడు పత్రాలు సమర్పించారని శివసేన నేత ఆనంద్ రావ్ అడ్సల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఆమె ఎస్సీ కాదని తేల్చింది.
అయితే నవనీత్ కౌర్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కుల ధ్రువీకరణపత్రం రద్దు చేస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఎస్సీ రిజర్వుడ్ అమరావతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నవనీత్ కౌర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. శివసేన అభ్యర్థి ఆనందరావు అడుల్స్‌పై విజయం సాధించారు. ఈ క్రమంలో ఆనందరావు నవనీత్ షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి కాదంటూ బొంబాయి హైకోర్టులో పిటిషన్ వేశారు.