More

  దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు..!

  సినీలోకానికి బాగా సుపరిచితులైన అల్లూరి సీతారామరాజు ‘సూపర్ స్టార్ కృష్ణ’ 79వ ఏట కన్నుమూశారు. ఆదివారం అర్దరాత్రి గుండెపోటుకు గురైన కృష్ణను ఆయన కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వెంటిలేటర్‎పై ఉంచి బతికించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మంగళవారం వేకువజామున కృష్ణ తుది శ్వాస విడిచారు. ఎంతో గొప్ప నటుడి మరణం ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినీ లోకాన్ని శోకసంద్రంలో ముంచివేసింది. తెలుగు సినీ లోకాన్ని తన అధ్భుత నటనతో మెప్పించి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న కృష్ణ 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెంలో జన్మించారు. తల్లిదండ్రులు వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల ఐదుగురు సంతానంలో కృష్ణ మొదటివారు.

  కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఎంతో ఆసక్తి ఉన్నా కూడా అతని తల్లిదండ్రులు మాత్రం కృష్ణను ఇంజినీరింగ్ చదివించాలనుకున్నారు. అయితే ఇంజినీరింగ్ లో కృష్ణకు సీటు దొరక్కపోవడంతో డిగ్రీలో చేరారు. డిగ్రీ చదువుతున్న సమయంలో ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది. దీన్ని చూసి స్పూర్తి పొందిన కృష్ణ తాను కూడా సినీ రంగం వైపుకు రావాలని నిర్ణయించుకున్నారు. అప్పుడున్న నటులు జగ్గయ్య, గుమ్మడి, నిర్మాత చక్రపాణిలు తెనాలి వారే కావడంతో మద్రాసుకు వెళ్ళి వారిని కలిశాడు. అక్కడ వారంతా కూడా కృష్ణ వయసు ఇంకా చిన్నదని.. కొన్నాళ్ళ తర్వాత ప్రయత్నిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని సలహా ఇచ్చి పంపారు. దీంతో గరికపాటి రాజారావు సహకారంతో ప్రజానాట్యమండలిలో చేరి పలు నాటకాలు ప్రదర్శించి,.. నటనపై పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. ఇక 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన ‘తేనె మనసులు’ సినిమాతో కృష్ణ సినీప్రయాణం మొదలైంది. అయితే మొదటి సినిమాలో కృష్ణ నటన అంతగా బాగోలేదని అతడిని సినిమానుంచి తొలగించాలని దర్శకుడిపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. కానీ, ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయాన్ని మార్చుకోకుండా కృష్ణను కొనసాగించారు. సినిమా 1965లో విడుదల అయి భారీ విజయాన్ని సాధించింది. దీంతో కృష్ణ సినీ ప్రయాణం అప్రతిహతంగా కొనసాగింది.

  ఇక ‘గూఢచారి 116’ కృష్ణ సినీ ప్రయాణాన్ని మరో మలుపు తిప్పింది. తన రెండో సినిమా ‘కన్నె మనసులు’ అనే చిత్రాన్ని నిర్మిస్తుండగానే ‘గూఢచారి 116’ లో కృష్ణ కు అవకాశం వచ్చింది. అప్పటివరకున్న సినిమాలకు ‘గూఢచారి 116’ విలక్షణంగా ఉండటంతో భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయంతో కృష్ణకి ఆంధ్రా జేమ్స్ బాండ్ అనే పేరు కూడా వచ్చింది. ఆ సినిమాకొచ్చిన క్రేజ్ తో ఒకేసారి 20 సినిమా ఆఫర్లు కృష్ణ తలుపు తట్టాయి. దీంతో పాటు గూఢచారి తరహాలోనే మరో ఆరు జేమ్స్ బాండ్ సినిమాలు తీశారు సూపర్ స్టార్.

  ఇక కృష్ణ సినిమాలు ఒక పీక్ స్థాయిలో ఉన్నప్పుడు ఎన్నో సినిమాలను ఒప్పుకునేవారు. అప్పట్లో హీరోలంతా ఏడాదికి రెండో మూడో సినిమాలు చేస్తుంటే కృష్ణ మాత్రం పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారు. దీనికి సమాధానంగా తాము సినిమాలను నిర్మిస్తేనే చిత్ర పరిశ్రమలో ఉపాధి లభిస్తుందని చెప్పేవారు. తమను నమ్ముకుని ఎంతో మంది సామాన్యులు బ్రతుకుతున్నారు కాబట్టి వారికి ఉపాధి కల్పించేందుకైనా తాను సినిమాలు నిర్మిస్తాననేవారు కృష్ణ. కొన్నిసార్లయితే ఏకంగా మూడు షిఫ్టుల్లోనూ సినిమాల్లో నటించేవారు. ఈ విధంగా 70, 71 వ దశకాల్లో పదుల సంఖ్యలో కృష్ణ సినిమాలు విడుదలయ్యేవి. 1969లో 15 సినిమాలు, 1970లో 16, 71లో 11, 72లో 18, 73లో 15, 74లో 13, 80లో 17 తీసి,.. సినీ చరిత్రలో తనదైన అధ్యాయాన్ని రాసుకున్నారు కృష్ణ.

  ఇక సినిమాల్లో నటించడంతో పాటు దర్శకుడిగానూ సూపర్ స్టారే అని నిరూపించుకున్నారు. 1970లో పద్మాలయా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి విజయవంతమైన చిత్రాలు తీశారు. దర్శకుడిగా 16 సినిమాలు తెరకెక్కించారు. ఈ సినిమాల్లో తొలి జేమ్స్ బాండ్ సినిమా ‘గూఢచారి 116’, తొలి కౌబాయ్ సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’, తొలి ఫుల్‌స్కోప్ సినిమా ‘అల్లూరి సీతారామరాజు’, తొలి 70 ఎంఎం సినిమా ‘సింహాసనం’ సినిమాలు కూడా కృష్ణ నటించిన సినిమాలే. ఇంతటి విజయాలు సాధించిన సూపర్ స్టార్ 2010 తర్వాత క్రమంగా సినిమాల నుంచి వైదొలగుతూ వచ్చారు. 2016లో వచ్చిన ‘శ్రీ శ్రీ’ కృష్ణ నటించిన చివరి సినిమా.

  ఇక సినిమాల్లో రాణిస్తూనే.. కృష్ణ రాజకీయాల్లో కూడా తన ముద్రను వేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో కృష్ణ సన్నిహితులుగా మెలిగేవారు. రాజీవ్ ప్రోత్సాహంతో 1984లో కృష్ణ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 1989 ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే 1991 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి పోటీ చేసినా విజయం వరించకపోవడంతో తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు.

  ఇక సినీరంగంలో ఆయన అందించిన విశేష సేవలకు గుర్తిపుగా కృష్ణకు ఎన్నో పురస్కారాలు వరించాయి. ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో పాటు 2009లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు. ఇంతటి గొప్ప విషిష్టత కలిగిన సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఆయన అభిమానులంతా కన్నీరు మున్నీరవుతున్నారు.

  Trending Stories

  Related Stories