Sports

కోహ్లీ నువ్వు వీలైనంత త్వరగా సచిన్ ను సంప్రదించాల్సిందే: గవాస్కర్

విరాట్ కోహ్లీ.. అతడి ట్యాలెంట్ గురించి సంకోచించాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవలి కాలంలో కోహ్లీ నుండి భారీ ఇన్నింగ్స్ అసలు రావడం లేదు. ఇదే భారత అభిమానులను కూడా కలవరపెడుతూ ఉంది. ముఖ్యంగా కవర్ డ్రైవ్ ఆడడానికి వెళ్లి కోహ్లీ అవుటవుతూ ఉన్నాడు. అందుకే భారత క్రికెట్ లెజెండ్స్ కూడా కోహ్లీకి వీలైనన్ని సూచనలు చేస్తూ ఉన్నారు. కోహ్లీ కవర్ డ్రైవ్ ఆడకుండా ఉండడమే బెటర్ అని అంటున్నారు.

తాజాగా టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కోహ్లీ సచిన్ ను వీలైనంత త్వరగా సంప్రదించాలని సూచించారు. 2004 సిడ్నీ టెస్టులో సచిన్ తన సత్తా చాటి తిరిగి ఫామ్ లోకి వచ్చినట్టే కోహ్లీ కూడా ఫామ్ ను తిరిగి సంపాదించుకోవాలన్నారు. కోహ్లీ వెంటనే సచిన్ టెండూల్కర్ కు ఫోన్ చేయాలి. ఏం చేయాలో అడగాలి. అతడి సలహాలు తీసుకోవాలని గవాస్కర్ సూచించారు. కవర్ డ్రైవ్ ఆడనని తనకు తాను చెప్పుకోవాలన్నారు.2004 సిడ్నీ టెస్టులో సచిన్ టెండూల్కర్ 241 పరుగులతో అజేయంగా నిలిచాడు. 613 నిమిషాల పాటు క్రీజులో నిలిచిన లిటిల్ మాస్టర్.. ఒక్క కవర్ డ్రైవ్ కూడా ఆడలేదు. సచిన్ ఇన్నింగ్స్ తో భారత్ 705/7 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.

లీడ్స్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఆండర్సన్ బౌలింగ్ లో కోహ్లీ కేవలం 7 పరుగులకే అవుటయ్యాడు. అందుకే సునీల్ గవాస్కర్ కోహ్లీ తప్పులు చేస్తున్నాడంటూ కామెంట్లు చేశారు. ఆఫ్ స్టంప్ కు ఆవల పడిన బంతులను కోహ్లీ వేటాడడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఐదు, ఆరు, ఏడో స్టంప్ ల దగ్గర పడిన బంతులకు కోహ్లీ ఔట్ కావడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమని చెప్పారు.

లీడ్స్‌లో టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫ‌ల‌మవ్వడంతో తొలి ఇన్నింగ్స్‌లో 78 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 105 బంతులు ఆడి హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ చేసిన 19 ప‌రుగులే టాప్ స్కోర్‌. రోహిత్ తో పాటు టెస్టు వైస్ కెప్టెన్ ర‌హానే (18) మాత్ర‌మే రెండు అంకెల స్కోరు అందుకున్నాడు. ఆ త‌రువాత ఎక్స్‌ట్రాలే(16) అత్య‌ధికం కావ‌డం గ‌మ‌నార్హం. టాస్ గెల‌వ‌డంతో మ‌రో ఆలోచ‌న లేకుండా కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి ఓవ‌ర్‌లో కేఎల్ రాహుల్ (0) అండ‌ర్స‌న్ బౌలింగ్‌లో ఔట్ కావ‌డంతో మొద‌లైన వికెట్ల ప‌త‌నం ఎక్క‌డా ఆగ‌లేదు. అండర్సన్‌(3/6), ఒవర్టన్‌ (3/14), రాబిన్సన్‌ (2/16), కరాన్‌ (2/27) విజృంభించారు. టీమ్‌ఇండియా 40.4 ఓవర్లలో 78 పరుగులకే కుప్ప‌కూలింది. భార‌త్ బ్యాట్స్‌మెన్లు ప‌రుగులు చేయ‌డానికి ఇబ్బంది ప‌డిన అదే పిచ్ పై ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు అద‌ర‌గొట్టారు. ఓపెనర్లు హమీద్‌(60 నాటౌ ట్‌), బర్న్స్‌(52 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీలతో రాణించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా ఇంగ్లాండ్ 120 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 42 పరుగుల ఆధిక్యంలో కొన‌సాగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

nineteen − 16 =

Back to top button