రెండో మ్యాచ్ లోనూ చిత్తైన సన్ రైజర్స్

0
745

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ లో బోణీ కొట్టడానికి చాలా కష్టాలు పడుతూ ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 169 పరుగులు చేసింది. 170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్‌ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. లక్నో బౌలర్ అవేశ్ ఖాన్.. తొలుత ఓపెనర్లు అభిషేక్ శర్మ (13), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (16)ను వెనక్కి పంపాడు. ఆ తర్వాత చివర్లో నికోలస్ పూరన్ (34), అబ్దుల్ సమద్ (0)లను పెవిలియన్ పంపి హైదరాబాద్ ను చావు దెబ్బకొట్టాడు. పూరన్ అవుటయ్యాక వరుసగా వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. హైదరాబాద్ జట్టులో రాహుల్ త్రిపాఠి (30 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 44 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా, పూరన్ చేసిన 34 పరుగులు రెండో అత్యధికం. చివరి ఓవర్‌లో జట్టు విజయానికి 16 పరుగులు అవసరం కాగా, వాషింగ్టన్ సుందర్ (18), భువనేశ్వర్‌ (1), రొమారియో షెపర్డ్ (8)లను హోల్డర్ పెవిలియన్ పంపడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ 157/9 వద్ద ముగిసింది. దీంతో లక్నో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా జట్టును ఆదుకున్నారు. హుడా 33 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ (51) పూర్తి చేసుకున్నాడు. రాహుల్ 50 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 68 పరుగులు చేశాడు. ఆయుష్ బదోని 12 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేయడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. డికాక్ (1), లూయిస్ (1), మనీష్ పాండే (11), కృనాల్ పాండ్యా (6) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. హైదరాబాద్ బౌలర్లలో సుందర్, షెపర్డ్, నటరాజన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. లక్నో బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవేశ్ ఖాన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా, హోల్డర్‌కు మూడు, కృనాల్ పాండ్యాకు రెండు వికెట్లు దక్కాయి. మూడు మ్యాచ్‌లు ఆడిన లక్నోకు ఇది రెండో విజయం కాగా, రెండు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఇంకా ఖాతా తెరవలేదు.