More

  DEFENCE REFORMS.. కీలక దశలో మహా దళపతి మహా ప్రస్థానం

  మంచుతెరలే కొంపముంచాయి. మహాదళపతిని బలితీసుకున్నాయి. మహోద్యమంగా సాగుతున్న సైనిక బలగాల సమన్వయానికి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్ అనబడే సైనిక సాహసి కేవలం సాయుధ బలగాల సమన్వయ సారథి మాత్రమే కాదు. పదాతిదళం ప్రాముఖ్యత, వాయుసేన వేగం తాలూకు ప్రాధాన్యత, నౌకాదళ నైషిత్యం ఎరిగినవాడు రావత్.  బిపిన్ లక్షణ్ సింగ్ రావత్ భారత సైనిక చరిత్రలో చెరిగిపోని సంతకం.

  సైన్యంలో చాలా మంది చేరతారు. యుద్ధంలో అనేక మంది పాల్గొంటారు. అమరులయ్యే వాళ్ల సంఖ్య కూడా తక్కువేం కాదు. కానీ, రావణకాష్టంలో నిలబడి, ఓరిమితో కలబడి వైరాన్ని అంచనా వేయడం కష్టం. రణరంగాన్ని మదింపు వేయడం అనితరసాధ్యమైన సాహసం. నెత్తురు ఏరులై పారుతున్నప్పుడు పొరపాట్లను గణించడం సాహసికి మాత్రమే సాధ్యం! సరిగ్గా అలాంటి సాహసి అమరుడు బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్.

  ఉత్తరాది జీవితం యుద్ధాన్ని ఔపోసన పట్టింది. దక్షిణాది ప్రాంతం సేద్యంలో సిరులు కురిపించింది. మొఘలాయి దండయాత్రల కారణంగా ఉత్తరదేశంలోని జనజీవితానికి రణరంగం సుపరిచితమైంది. అందుకే బిపిన్ రావత్ లాంటి అనేక మంది యుద్ధాన్నే చదువుకున్నారు. జీవన పోరాటంలో యుద్ధ్నాన్నే వృత్తిగా ఎంచుకున్నారు. వృత్తి, ప్రవృత్తిలో వ్యూహం భాగమైపోయింది. అట్లా బిపిన్ రావత్ కు యుద్ధం రక్తగతమైన అభ్యాసంగా మారింది.

  ‘మహాదళపతి’ బిపిన్ రావత్ భారత సైనిక రంగానికి అందించిన వ్యూహాత్మక ప్రయోజనాలేంటి? దిగ్గజాలను పక్కనబెట్టి రావత్ ను ‘సీడీఎస్’ పదవికి ఎంపిక చేయడంలో ఆంతర్యం ఏంటి? ‘థియేట్రైజేషన్’ కోసం బిపిన్ రావత్ రూపొందించిన ప్రత్యేక ప్రణాళికలేంటి? అసలు థియేట్రైజేషేన్ అంటే ఏంటి?

  సైన్యం, వైమానిక, నౌకా దళాలమధ్య మెరుగైన సమన్వయం సాధించడానికి ఉద్దేశించిన కీలక పదవి తాలూకు విధి నిషేధాలపై అజిత్‌ దోవల్‌ కమిటీ నివేదిక చేతికందిన  తర్వాత కేంద్ర మంత్రివర్గం బిపిన్ రావత్ ను సదరు పదవికి అర్హుడని పచ్చజెండా ఊపింది. మోదీ ప్రభుత్వం చీఫ్ ఆర్మీ స్టాఫ్ నియామకం విషయంలో సీనియారిటీని పక్కనబెట్టి జూనియరైన జనరల్ రావత్‌కు ప్రాధాన్యత ఇచ్చింది.

  భారతదేశ భద్రతకు సంబంధించిన ప్రస్తుత సవాళ్లను జనరల్ రావత్ ఎదుర్కోగల సమర్థుడని పలువురు నిపుణులు పేర్కొంటారు. సంఘర్షణలు జరుగుతున్న ప్రాంతంలో సైనిక కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించడంలో జనరల్ రావత్‌కు మూడు దశాబ్దాల అనుభవం ఉండటంతో, అప్పట్లో ప్రభుత్వం ఆయనవైపు మొగ్గు చూపింది.

  ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటును నియంత్రించడంలో, మయన్మార్‌లోని తిరుగుబాటు శిబిరాలను నిర్మూలించడంలో జనరల్ రావత్ ముఖ్యమైన పాత్ర పోషించారు. 1986లో చైనాతో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు, నాడు జనరల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న బిపిన్ రావత్ బెటాలియన్‌కు కల్నల్ కమాండింగ్‌ అధికారి హోదాలో ఉన్నారు.

  త్రివిధ దళాలకు సంబంధించిన అంశాలపై రక్షణమంత్రికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించే మహాదళపతి -చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌- సీడీఎస్‌ కొలువు తీరాల్సిన ఆవశ్యకతను రెండు దశాబ్దాలక్రితం, కార్గిల్ యుద్ధం తర్వాత ఏర్పాటైన  సుబ్రహ్మణ్యం కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఎస్. జయశంకర్ తండ్రి కే సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ  సీడీఎస్ గురించి ప్రస్తావించింది.

  లాల్‌కృష్ణ అద్వాణీ నేతృత్వంలోని మంత్రుల బృందం జాతీయ భద్రతా వ్యవస్థ తీరుతెన్నుల విశ్లేషణలో భాగంగా సీడీఎస్‌ గురించి నాడే ప్రస్తావించింది. షెకాత్కర్‌ కమిటీ కూడా గట్టిగా మద్దతు పలికింది. రక్షణ మంత్రిగా మనోహర్‌ పారికర్‌ చొరవతో ఊపొచ్చిన ప్రతిపాదనకు మోదీ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అందుకు బిపిన్ రావత్ మాత్రమే సమర్థుడని ఎంచుకుంది.

  మానవ వనరుల గరిష్ఠ వినియోగానికి, త్రివిధ దళాల నడుమ అర్థవంతమైన సంతులనానికి దోహదకారి కానుందనే ఉద్దేశంతోనే మోదీ ప్రభుత్వం రావత్ ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా నియమించింది.  డీబీ షెకాత్కర్‌ మాటల్లో- ‘నలుగురు లెఫ్టినెంట్ జనరళ్లు, ఇద్దరు ఎయిర్‌ మార్షళ్లు, ఇద్దరు వైస్‌ అడ్మిరళ్లు, ఎందరో బ్యురాక్రాట్ల తెరవెనక అవిరళ కృషి’కి ఫలశ్రుతి!

  దళాలవారీగా బలసంపన్నతను లెక్కకట్టి, మనపైకి కాలుదువ్వుతున్న ఫలానా దేశానికన్నా పైమెట్టు మీద ఉన్నామని సంతృప్తి చెందడానికి ఎంతమాత్రం వీల్లేని సంక్లిష్ట దశ ఇది! బంగ్లాదేశ్‌ విమోచన ఘట్టంలో భారత నౌకదళ, వాయుసేన అధిపతుల సన్నిహిత బంధం దేశానికి సాటిలేని విజయం సంపాదించి పెట్టింది. కార్గిల్ యుద్ధ సమయంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో, రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ మధ్య సమన్వయ రాహిత్యం, త్రివిధ దళాలను ఏకతాటిపై నడిపించే నాయకత్వ చొరవ కొరవడటం- కార్గిల్‌ పోరులో భారత్‌కు తల బొప్పి కట్టించింది.

  దళాల మధ్య సమన్వయం ఎంత మహత్తర పాత్ర పోషించగలదో దాదాపు అయిదు వందల సంవత్సరాల నాటి చారిత్రక ఘట్టం విశదీకరిస్తుంది. అప్పట్లో కేవలం పన్నెండువేల మందితో కూడిన బాబర్‌ దళం, లక్షమంది సైనికులు కలిగిన ఇబ్రహీం లోడీ సేనను మట్టి కరిపించింది!సామర్థ్యం పెరగాలనే లక్ష్యాన్ని ఎంచుకున్నారు మహాదళపతి బిపిన్ రావత్. సరిగ్గా ఇందుకోసమే సైనిక థియేట్రైజేషన్ కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నారు. 

  యుద్ధ సన్నద్ధతకు, అది లేకుండా పోవడానికి ఎంత అంతరముందో ఆకళించుకున్న అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ సహా డెబ్భైవరకు దేశాల్లో సీడీఎస్‌ తరహా వ్యవస్థ ఇప్పటికే నెలకొని ఉంది. వర్తమాన, భావి సవాళ్లను దీటుగా ఎదుర్కోవాల్సిన భారత్‌- సైనిక బలగాల ఆధునికీకరణకు, దళాల గరిష్ఠ సద్వినియోగానికి విస్తృత ప్రాతిపదికన మార్పులు, చేర్పులు, సంస్కరణలు ఎన్నో చేపట్టాల్సి ఉందనే విషయాన్ని బిపిన్ రావత్ తన ప్రసంగాల్లో నిత్యం వెల్లడించేవారు.  

  భిన్న దళాల అవసరాలు, సామర్థ్యాలు, పరిమితుల పట్ల కూలంకష అవగాహనతోనే అటువంటి కీలక ప్రక్రియను ఒక కొలిక్కి తేవాల్సిన దశలో భారత రక్షణ ముఖచిత్రాన్ని ఏ మేరకు తేటపరచగలదో చూడాలనే విషయంలో ఇటీవలే ప్రత్యేకమైన నివేదికను ప్రభుత్వానికి అందించారు బిపిన్ రావత్.

  భారీ కమాండ్​ వ్యవస్థపొరుగున జన చైనా మూడేళ్లుగా సంస్థాగత సంస్కరణలు, సైనిక ఆధునికీకరణ వ్యూహాల్ని పట్టాలకు ఎక్కించి తన కమాండ్‌ వ్యవస్థను పెద్దయెత్తున ప్రక్షాళన చేయడంలో రావత్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు.

  యుద్ధ సామగ్రిలో 68శాతం కాలం చెల్లినవని, 24శాతం ప్రస్తుతానికి నడుస్తాయని, కేవలం ఎనిమిది శాతమే అత్యధునాతనమైనవన్న గణాంక వివరాలు దిగ్భ్రాంతపరుస్తున్న నేపథ్యంలో కేంద్రం బిపిన్ రావత్ ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా నియమించింది. త్రివిధ దళాలను ఏకతాటిపై నడిపించాల్సిన సీడీఎస్‌ ఆధునికీకరణ, శిక్షణ, ఉమ్మడి నిఘా, సంయుక్త దాడులు… వీటన్నింటికీ క్రియాశీల కేంద్ర బిందువై అన్నింటా చురుకు పుట్టించాల్సి ఉందనే అభిప్రాయాన్ని రావత్ అనేక సందర్భాల్లోనే ప్రభుత్వానికి తేటతెల్లం చేశారు.

  ప్రస్తుతం ఆర్మీలో ఏడు, వైమానిక దళంలో ఏడు, నేవీలో మూడు- మొత్తం పదిహేడు సింగిల్‌ సర్వీస్‌ కమాండ్లు కలిగిన భారత్‌ను శత్రుభీకరంగా మలచి మెరుపు వేగంతో విరుచుకుపడేలా కదం తొక్కించేందుకు థియేట్రైజేషన్ కోసం నిర్దిష్ఠమైన ప్రణాళిక రూపొందించారు బిపిన్ రావత్.  సాధన సంపత్తి కొనుగోళ్లలో త్రివిధ దళాల ప్రాధాన్య క్రమాన్ని నిర్దేశించి, వెచ్చించే ప్రతి రూపాయీ సద్వినియోగం చేసుకునేందుకు పథకాన్ని రూపొందించారు.  

  రవాణా, శిక్షణ, కమ్యూనికేషన్లు, నియామకాలు… తదితరాలన్నింటా వృథాను నివారించి, ఉమ్మడి తత్వాన్ని అలవరచగలిగితే- ఇటు ఖజానాపై అధిక భారం తగ్గుతుంది. అటు సైనిక దళాల పోరాట సామర్థ్యం ఇనుమడిస్తుంది. సైన్యం ఎదుర్కొంటున్న యాభై రకాల సమస్యల్ని రెండేళ్ల క్రితమే ‘ఆర్మీ డిజైన్‌ బ్యూరో’ నివేదిక రూపొందించడంలో బిపిన్ రావత్ పాత్ర ష్లాఘనీయం.  ఇంతవరకు సత్వర స్పందనకు నోచుకోని అటువంటి అంశాలపై సీడీఎస్‌ పుణ్యమా అని వెలుగు ప్రసరిస్తే- త్రివిధ దళాల్ని శత్రు దుర్భేద్యం చేసేలా మరిన్ని లోతైన సంస్కరణలకు బాటలు పడుతున్న తరుణంలోనే రావత్ నేల రాలడం విషాదకరం!

  భారతదేశ సైనిక చరిత్రలో త్రివిధ దళాలను సమన్వయం చేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం చరిత్రాత్మకం. సదరు చారిత్రక బాధ్యతను బిపిన్ రావత్ కు అప్పగించడం అంతకన్నా చారిత్రకం. ముప్పేట దాడికి వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలని కోరుకోరుకోవడమే కాదు దాన్ని అమలు చేసిన ఘనత కూడా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానిదే!

  అమరుడు బిపిన్ రావత్‌కు మానసిక స్థైర్యం, ధైర్యం చాలా ఎక్కువ. నాగాలాండ్‌ లో పనిచేస్తున్న సమయంలో ఉండగా ఓ రోజు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయింది. ఆ వెంటనే కిందికి పడిపోయింది. అలా జరిగితే ఎవరైనా ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు. బిపిన్‌ రావత్‌ మాత్రం అలా చేయలేదు.

  మరో హెలికాప్టర్‌ తీసుకుని వెళ్లి పని పూర్తి చేసుకువచ్చారు. పని పట్ల ఆయనకు ఉండే నిబద్ధత అలాంటిది. డోక్లామ్ సంక్షోభం సమయంలో మహాదళపతి రావత్ ‘‘టూ అండ్ ఏ ఆఫ్ ఫ్రంట్ వార్‌’’ కు భారతదేశం సిద్ధంగా ఉందని ప్రకటించారు. చైనా, పాకిస్తాన్ సమస్యలతో పాటు అంతర్గతంగా జరిగే ఘర్షణలను టూ అండ్ ఏ ఆఫ్ ఫ్రంట్ వార్ ఫ్రంట్ గా అభివర్ణించిన మాటల్లో అంతరార్థం అత్యంత ప్రధానమైంది. ఈ మాట వెనుక లోతైన అర్థం ఉందనే విషయం కాస్తంత ఆలోచించేవారికి తెలుస్తుంది.

  బిపిన్ రావత్ మాటల్లో కూడా వ్యూహాత్మక అంశాలు తొంగిచూసేవి. ఈ కారణంగానే కొన్ని సందర్భాల్లో వివాదాలు కూడా చెలరేగేవి. ‘‘చైనా, పాకిస్తాన్‌ల దురాక్రమణ కాంక్ష భారత సైన్యం అనుక్షణం అప్రమత్తంగా ఉండేటట్లు చేస్తోంది. సరిహద్దులతో పాటు… తీర ప్రాంతాల్లో ఏడాది పొడవునా గట్టి నిఘా అవసరం. ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నపుడు… ఎటువైపు నుంచి యుద్ధం మొదలవుతుందో … అది ఎక్కడి దారితీస్తుందో తెలియదు. కాబట్టి ఇరువైపులా సర్వసన్నద్ధంగా ఉండాల్సిందే’ అన్నారాయన.

  ‘పాక్‌తో చైనా స్నేహం, జమ్మూకశ్మీర్‌పై డ్రాగన్‌ వైఖరిని బట్టి చూస్తే వారిది భారత్‌ వ్యతిరేక అనుబంధంగా అభివర్ణించొచ్చు.’ ‘చైనా ధనబలాన్ని, వాణిజ్యాన్ని అడ్డుపెట్టుకొని ఇరుగుపోరుగు దేశాల్లో ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందని హెచ్చరించారు కూడా.

  పాక్‌ను నియంత్రించాల్సిన అవసరం లేదు. అదే క్రమేపీ తమ దేశంపై పట్టు కోల్పోతోంది. దానికోసం మనం ప్రత్యేకంగా కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం లేదు. వారే కొంపను అంటించుకునే క్రమంలో ఉన్నారు.’ ‘మిత్రులను సంపాదించుకోవడం తేలికే. కాని శత్రువులే మనను నిరంతరం అప్రమత్తంగా ఉండేలా చేస్తారని జాతిని జాగృతం చేసిన బిపిన్ రావత్ మన మధ్య నుంచి అన్యాపదేశంగా నిష్క్రమించారు. చీలమండకు గాయమైనా…..దేహం…మాడి మసైపోయినా…..యుద్ధమే ఊపిరిగా, వ్యూహమే శ్వాసగా బతికిన బిపిన్ రావత్ అనబడే దేశభక్తుడికి వినమ్ర నివాళి….పదముగ్గురికీ…ప్రాణాస్పద అంజలి.

  Trending Stories

  Related Stories