More

    చంద్రబాబుపై పిటిషన్..! ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా..!!

    బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి.. ఏం చేసినా, ఏం మాట్లాడినా సంచలనమే. సంచలనంతో పాటు ఆయన చేసే పనుల్లో కొంత లాజిక్ కూడా వుంటుంది. చాలా గ్యాప్ తర్వాత ఆయన మరో సంచలనానికి తెరతీశారు. ఏకంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా కోర్టుకెళ్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    తాజాగా తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సుబ్రమణియన్ స్వామి.. ప్రభుత్వ ఆజమాయిషీ నుంచి టీటీడీకి కల్పిస్తానని అన్నారు. తమిళనాడులోని నటరాజస్వామి ఆలయంపై ప్రభుత్వ పెత్తనం లేకుండా చేశానని ఆయన గుర్తుచేశారు. ఆలయ నిర్వహణలో ప్రభుత్వానికి సంబంధం లేదని సుబ్రణ్యస్వామి vs తమిళనాడు స్టేట్ కేసులో సుప్రీం కోర్టు స్పష్టం చేసిందన్నారు. టీటీడీపై కూడా ప్రభుత్వ పెత్తనం లేకుండా చేస్తానని ఆయన తెలిపారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై కూడా కేసు వేస్తున్నట్టుగా ఆయన వివరించారు. 4 లక్షల ఆలయాలు ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నాయని.. మసీదులు, చర్చిలపై ప్రభుత్వాల పర్యవేక్షణ లేదన్నారు. హిందూ ఆలయాలపై మాత్రమే ప్రభుత్వ పెత్తనం ఎందుకని ప్రశ్నించారు.

    ఈ సందర్భంగా కలియుగదైవం వేంకటేశ్వరస్వామిపై గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పిటిషన్ వేస్తానని చెప్పారు. చంద్రబాబు హయాంలో టీటీడీలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. గత ఐదేళ్లకు సంబంధించి టీటీడీ అకౌంట్లను కాగ్‌తో ఆడిట్ చేయించాలని సుబ్రమణ్య స్వామి డిమాండ్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడుకు బ్యాడ్ న్యూస్ అవుతుందన్నారు. అలాగే జగన్ సీఎం అయ్యాక.. టీటీడీపై అసత్య ప్రచారం ఎక్కువైందని సుబ్రమణ్యస్వామి తెలిపారు. టీటీడీని కాగ్ పరిధిలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అక్రమాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు.

    గత కొంతకాలంగా తిరుమల ఆలయంపై అసత్య ప్రచారం జరుగుతోందని సుబ్రమణ్యస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీపై కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. టీటీడీ పరువుకు భంగం కలించేలా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతిపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని అన్నారు.

    Trending Stories

    Related Stories