రక్షణ దళాధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ఘటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి అనుమానం వ్యక్తం చేశారు. కూలిపోతున్న హెలికాప్టర్ గా చెబుతూ ప్రచారమవుతున్న వీడియోను తాను అత్యంత విశ్వసనీయమైన వర్గాల ద్వారా చూశానని, వాస్తవానికి అది సిరియన్ వైమానిక దళానికి చెందినదని, బిపిన్ రావత్ ప్రయాణిస్తున్నది కాదని చెప్పారు. రావత్, ఆయన భార్య, ఇతర అధికారులు ఎలా మరణించారనే విషయంలో అనుమానాలు వస్తున్నాయని అన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జి వంటి వారి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయిందనే వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని స్వామి చెప్పారు. ఇది దేశ భద్రతకే పెద్ద హెచ్చరిక అని అన్నారు. ఈ ఘటనపై తుది నివేదిక రావాల్సి ఉందని, అప్పటి వరకు ఏం చెప్పాలన్నా కష్టమేనని అన్నారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై ప్రజల మనసుల్లో పలు ప్రశ్నలు మెదులుతున్నాయని అన్నారు. అత్యంతాధునిక, సురక్షితమైన హెలికాఫ్టర్‌లో దేశ సుప్రీం కమాండర్ ప్రయాణిస్తుంటే ఈ ప్రమాదం ఎలా జరిగిందని రౌత్ ప్రశ్నించారు. ఇది అత్యంత దురదృష్టకర ఘటనని, టాప్ కమాండర్‌ను ప్రమాదంలో ఎందుకు కోల్పోయామని ప్రజల మనసుల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయని శివసేన ఎంపీ గురువారం ట్వీట్ చేశారు.
ఈ దుర్ఘటనపై రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్ లో ప్రకటన చేశారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో 13 మంది మృతి చెందారన్నారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రస్తుతం లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారని.. ఆయన్ను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. హెలికాప్టర్ కూలిపోవడాన్ని స్థానికులు గమనించారని.. భారీ శబ్దం రావడంతో ఘటనా స్థలానికి వెళ్లారన్నారు. అప్పటికే మంటల్లో కాలిపోతున్న హెలికాఫ్టర్‌ను వారు చూశారని.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని కాపాడేందుకు స్థానికులు శాయశక్తుల ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై ఎయిర్‌మార్షల్ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించినట్లు తెలిపారు. ఇప్పటికే విచారణ కమిటీ తమ దర్యాప్తు మొదలుపెట్టిందన్నారు.