నేతాజీ జయంతిని నేషనల్ హాలిడేగా ప్రకటించాలి

0
956

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని ఏటా జనవరి 23వ తేదీని జాతీయ సెలవుదినంగా (నేషనల్ హాలిడే) ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. నేతాజీ దేశనేతే కాకుండా ప్రపంచ నేత అని, బెంగాల్ నుంచి ఆయన ఎదిగిన తీరు దేశచరిత్రలోనే నిలిచిపోతుందని ఆమె అన్నారు. ”దేశనాయక్ దివస్‌ను అత్యంత వైభవోపేతంగా యావత్ దేశం జరుపుకొనేందుకు వీలుగా నేతాజీ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను” అంటూ మమతా బెనర్జీ ఆదివారం ట్వీట్ చేశారు. అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తూనే బోస్ 125వ జయంతిని ‘దేశ్ నాయక్ దివస్‌’గా తమ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తోందని ఆమె తెలిపారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కారణం తాము ఒత్తిడి తీసుకుని రావడమేనని ఆమె అన్నారు. అందుకే మోదీ ప్రభుత్వం నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని మమత అన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసినంత మాత్రానికి కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయిపోదని.. ఆయనను గౌరవించినట్లు కాదని చెప్పారు. ఆయన మరణించిన తేదీ ఇప్పటికీ తెలియదన్నారు. నేతాజీకి ఏం జరిగిందో మనకు ఇప్పటికీ తెలియదు. ఇప్పటికీ అది ఓ అంతుబట్టని రహస్యంగానే ఉందని అన్నారు. ఫైళ్ళను పరిశీలించడానికి అందుబాటులో ఉండేవిధంగా చేస్తామని మోదీ ప్రభుత్వం చెప్పింది. నేతాజీపై ఫైళ్ళను డిజిటలైజ్ చేశామని, డీక్లాసిఫై చేశామని చెప్పిందని మమత అన్నారు. గణతంత్ర దినోత్సవాల కవాతు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నేతాజీపై రూపొందించిన శకటాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని ఆగ్రహించారు. అదే శకటాన్ని కోల్‌కతాలో జరిగే గణతంత్ర దినోత్సవాల్లో ప్రదర్శిస్తామని చెప్పారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించి ఢిల్లీలో 75వ గణతంత్ర ఉత్సవాలు కూడా ఆదివారం నాడు ప్రారంభమయ్యాయి. నేతాజీ జయంతిని పురస్కరించుకుని పార్లమెంటు సెంట్రల్ హాలులో జరిగిన కార్యక్రమంలో మోదీ, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. నేతాజీ పటం వద్ద ప్రధాని మోదీ పుష్పాంజలి ఘటించారు.