National

తప్పంతా దీపావళి పండుగదే అంటూ ప్రచారం

దీపావళి.. ఈ హిందువుల పండుగ తర్వాత దేశ రాజధాని న్యూ ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయిందనే కథనాలను కొన్ని మీడియా సంస్థలు కావాలనే ప్రచారం చేస్తున్నాయి. దీపావళి తర్వాతి రోజునే వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందనే వార్తలతో మీడియా నిండిపోయింది. మానవులు చేస్తున్న తప్పులు, ఫ్యాక్టరీల కాలుష్యం మరియు ఇతర సహజ కారణాల వల్ల ప్రతి శీతాకాలంలో ఢిల్లీ 3-4 నెలల పాటు తీవ్రమైన కాలుష్యాన్ని ఎదుర్కొంటూ ఉంటుంది. కానీ కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా దీపావళి రోజున పటాకులు పేల్చిన కారణంగానే కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందనే వాదనను వినిపించడం మొదలు పెట్టాయి.

చలికాలం ప్రారంభం కావడం.. దేశ రాజధానికి పొరుగు రాష్ట్రాల రైతులు పొట్టులను, పంటలను కాల్చడం ప్రారంభించడంతో, ఢిల్లీలో గాలి నాణ్యత ఇప్పటికే క్షీణించడం ప్రారంభించింది. శుక్రవారం కాలుష్యం మరింత పెరిగింది. గురువారం నగరంలో 24 గంటల సగటు AQI 382గా ఉంది, బుధవారం 314గా ఉంది. దేశ రాజధానిలో కూడా PM2.5 స్థాయిలు చాలా ఎక్కువ స్థాయికి చేరుకున్నాయి.

“భారతదేశం యొక్క అతిపెద్ద పండుగను అత్యంత సందడిగా టపాసులు కాలుస్తూ జరుపుకున్నందుకు ప్రజలు మూల్యం చెల్లించారు” అని NDTV అప్పుడే దీపావళి మీద నిందలు వేయడం మొదలు పెట్టేసింది. ఇక కొన్ని పార్టీలు కూడా దీన్నే ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దాదాపు అన్ని మీడియా నివేదికల్లోనూ పెరుగుతున్న కాలుష్యానికి బాణాసంచాను కాల్చడమే కారణమని ఆరోపించారు. బాణాసంచాపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించినా కూడా ప్రజలు కాల్చారనే చెప్పుకొచ్చారు.

ఢిల్లీలోని గాలి నాణ్యత క్షీణించిందని గణాంకాలు చెబుతున్నప్పటికీ… గాలి నాణ్యత తగ్గడానికి, కాలుష్యానికి సంబంధించిన మూలాలను పేర్కొనలేదు. కానీ దీపావళి కారణంగానే గాలిలో నాణ్యత తగ్గిందని మీడియా సంస్థలు ఆపాదించాయి. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలలో పొట్టును తగులబెట్టే రైతుల గురించి మాత్రం చెప్పలేదు. కాలుష్యానికి సంబంధించిన అసలు దోషుల గురించి మాత్రం చెప్పలేదు. దీపావళి రోజున టపాసుల కారణంగా ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిందనే వాదనకు మద్దతుగా ఎటువంటి డేటా లేదు.. ఏ అధికారిక వాతావరణ నివేదికలలో కూడా చెప్పలేదు.

వాస్తవానికి ఢిల్లీ వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగానూ, కాలిపోతున్న వ్యవసాయ భూముల నుంచి వచ్చే కాలుష్య కారకాల నుండి శుక్ర, శనివారాల్లో వాయుకాలుష్యం పెరుగుతుందని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) నివేదిక ఇప్పటికే తెలిపింది. ఢిల్లీ వాయుకాలుష్యం బుధవారానికి 8% నుండి 20% వరకు, శుక్రవారం మరియు శనివారాల్లో 35-45% వరకు పెరుగుతుందని SAFAR నివేదిక ఇప్పటికే పేర్కొంది. భౌగోళిక స్థానం మరియు వాతావరణ నమూనాల కారణంగా ఢిల్లీ- ఎన్‌సిఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణమైన పొట్టు దహనం ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుందని ఉపగ్రహ సమాచారం కూడా నిర్ధారిస్తుంది. NASA యొక్క ఫైర్ ఇన్ఫర్మేషన్ ఫర్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రకారం, పంజాబ్ మరియు హర్యానాలలో పొట్టును మండించే ఘటనలు అక్టోబర్ నెలలో గణనీయంగా పెరిగాయి. ఇది గత వారంలో గరిష్ట స్థాయికి చేరుకుంది.

సోషల్ మీడియా వినియోగదారులు రైతులు పంటలను కాల్చడం వలన కాలుష్యానికి కారణమవుతున్నారని, దీపావళి సమయంలో టపాసులు కాల్చడం కానే కాదని ఎత్తి చూపారు. నాసా (NASA) ఉపగ్రహాలను ఉపయోగించి ఈ పంటల దహనాలకు సంబంధించిన ఘటనలు ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు జరిగాయో తెలుసుకోవచ్చు. ఎరుపు రంగు చుక్కలు ఆ ఘటనలకు సంబంధించిన వివరాలను చూడొచ్చు. అక్టోబర్ 31, నవంబర్ 5 నాటి మ్యాప్‌లు చూస్తే ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో రైతులు పంటలను తగులబెట్టడం గమనించవచ్చు. చాలా రాష్ట్రాల లోని ప్రాంతాలు మొత్తం ఎర్రటి చుక్కలతో కప్పబడి ఉన్నాయని తెలుస్తోంది. ఎంత ఎక్కువగా పంటలలో ఉండే చెట్లను, పొట్టును తగులబెడుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ రాష్ట్రాలలోని దాదాపు అన్ని వ్యవసాయ భూములలో పంట అవశేషాలు తగలబడుతున్నాయి. తదుపరి సాగు కోసం రైతులు ఇలా చేస్తూ ఉంటారు.

రైతులు కావాలనే దీపావళి సమయంలో ఇలా పంటలను తగులబెడుతూ ఉన్నారని తెలుస్తోంది. దీపావళి సమయంలో రైతులు ఇలా చేస్తే చాలా మంది కాలుష్యానికి కారణం బాణసంచా అని అనుకుంటారని స్పష్టంగా అర్థం అవుతోంది. స్వరాజ్య పత్రిక ఎడిటర్ అరిహంత్ పవారియా దీపావళి సమయంలో పొట్ట ఎందుకు తగలబెడుతున్నారని ఓ రైతును ప్రశ్నించగా.. పండుగల సమయం కాబట్టి ఎవరూ పట్టుకోరని ఆ రైతు బదులిచ్చారు.

దీపావళి కారణంగా టపాసులు పేలకపోయినా, ఢిల్లీలో గాలి నాణ్యత ఏ మాత్రం మెరుగ్గా ఉండేది కాదని స్పష్టంగా తెలుస్తోంది. గాలి దిశ కారణంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో కాల్చబడుతున్న పంటల నుండి వచ్చే పొగ ఢిల్లీ వైపు కదులుతుంది. ఈ ప్రాంతంలో గాలి కదలిక లేకపోవడంతో అది స్థిరంగా ఉంటుంది. తక్కువ సమశీతోష్ణత వల్ల కలిగే పొగమంచు గాలిలోని కాలుష్య కారకాలను సంగ్రహిస్తుంది, వాటిని ఎక్కువసేపు గాలిలో ఉంచుతుంది, ఇది విషపూరిత పొగను సృష్టిస్తుంది. భారత సర్వోన్నత న్యాయస్థానం కూడా చివరకు బాణసంచా సమస్య తాత్కాలికమేనని అంగీకరించింది.. ప్రతి సంవత్సరం ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణం పంటలను కాల్చే సమస్య అని చెబుతోంది. కానీ కొన్ని మీడియా సంస్థలు ఈ సమస్యను నిరాకరిస్తూనే ఉన్నాయి. ప్రతీ ఏడాది దీపావళి బాణాసంచాపై నిందలు వేస్తూనే ఉన్నాయి.

బాణాసంచా కాల్చమంది బీజేపీనే: ఆప్ మంత్రి

ఆప్ ప్రభుత్వం టపాసులపై బ్యాన్ ను విధించినా కూడా చాలా ప్రాంతాల్లో ప్రజలు టపాసులను కాల్చారు. అయితే ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అటు ప్రజల మీద, ఇటు భారతీయ జనతా పార్టీ మీద అక్కసు వెళ్లగక్కారు. ప్రజలు క్రాకర్ల నిషేధాన్ని ధిక్కరిస్తున్నారని.. అంతేకాకుండా బీజేపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా టపాసులు పేల్చేలా చేశారని ఆరోపించారు.

ఆప్ మంత్రి కి సమాధానం ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి నవీన్‌ కుమార్‌ జిందాల్‌ ఇచ్చారు. దీపావళి హిందువుల పండుగ అని, రాజకీయ పార్టీల పండుగ కాదని అన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీతో ఉన్న హిందువులు తమ పండుగను జరుపుకోవడానికి అనుమతించలేదా అని ఆప్ నాయకులను ప్రశ్నించారు.

Related Articles

Back to top button