వన్డే ఫార్మాట్‌లో భారత్ తరపున అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్ రికార్డును సొంతం చేసుకున్న స్టువర్ట్ బిన్నీ సోమవారం ఫస్ట్ క్లాస్, అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల బిన్నీ తన రాష్ట్రమైన కర్ణాటకలో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆరు టెస్టులు, 14 వన్డేలు మరియు మూడు ట్వంటీ 20 మ్యాచ్ లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అని తండ్రి రోజర్ బిన్నీ కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
“నేను ఫస్ట్ క్లాస్ మరియు ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నానని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అంతర్జాతీయ స్థాయిలో నా దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు నాకు ఆనందంగా గర్వంగా ఉంది” అని స్టువర్ట్ బిన్నీ తెలిపాడు. జూన్ 2014 లో ఢాకాలో బంగ్లాదేశ్ పై జరిగిన వన్డేలో కేవలం నాలుగు పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి అసాధారణమైన బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియాకి ఘోర ఓటమి తప్పదని భావిస్తున్న తరుణంలో బాల్‌తో అద్భుతం సృష్టించిన స్టువర్ట్ బిన్నీ, 4 పరుగులకే 6 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు. వన్డే క్రికెట్‌లో భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు బిన్నీ (6/4)వే కావడం విశేషం. ఈ గణాంకాల ద్వారా అనిల్ కుంబ్లే రికార్డును అధిగమించాడు. కుంబ్లే 1993 లో వెస్టిండీస్‌పై ఆరు వికెట్లు తీసుకున్నాడు.. అయితే 12 పరుగులు ఇచ్చి 6 వికెట్లను తీశాడు.
టీమిండియా తరుపున అతడు 6 టెస్టులు, 14 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 95 మ్యాచ్‌లు ఆడిన బిన్నీ 4796 పరుగులు చేసి, బౌలింగ్‌లో 146 వికెట్లు పడగొట్టాడు. జూలై 2014 లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో, అతను తన రెండో ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేశాడు మరియు అది అతని ఆరు టెస్టుల్లో ఏకైక అర్ధశతకం. ఫ్లోరిడాలో వెస్టిండీస్‌తో జరిగిన టీ 20 గేమ్‌లో 31 పరుగులు ఇచ్చిన ఓవర్ అతని అంతర్జాతీయ కెరీర్ కు ముగిసేలా చేసింది. ఆ మ్యాచ్ లో ఎవిన్ లూయిస్ ఐదు సిక్సర్లు కొట్టాడు. ఇక హార్దిక్ పాండ్యా పేలుడు బ్యాటింగ్ ఆల్ రౌండర్‌గా రావడంతో, బిన్నీకి భారత జట్టులో అవకాశాలు తగ్గిపోయాయి.